ఆంధ్రప్రదేశ్తెలంగాణమన వ్యవసాయంవార్తలు

Methods Of Weed Eradication: సమగ్ర పద్ధతులతోనే వయ్యారిభామ కలుపు నిర్మూలన !

0
Methods Of Weed Eradication
Parthenium

Methods Of Weed Eradication: ఆగస్టు 16 నుంచి 22 వరకు పార్థీనియం అవగాహన వారోత్సవం

వర్షం పడగానే వామ్మో… వయ్యారిభామ అని రైతులు భయపడే లాగా చేస్తుంది ఒక కలుపు మొక్క. అదే పార్థీనియం హిస్టీరోపోరస్. ఇది హానికరమైన కలుపు జాతి. క్యారెట్ మొక్కను పోలి ఉండి, చిన్న పూలను కలిగి ఉండే ఆస్టరేసి కుటుంబానికి చెందిన వార్షిక మొక్క ఇది. దీనిని కాంగ్రెస్ గడ్డి, వయ్యారి భామ, పిచ్చి మాచపత్రి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఒక మొక్క 4000 నుంచి 25000 వరకు అతి చిన్న పరిమాణంలో ఉండే విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3 నుంచి 4 నెలల్లో జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. ఈ విధంగా ఒక్క సంవత్సరంలో 2-3 తరాలను పూర్తి చేసుకుంటుంది. అంటే సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది. పార్థీనియం తేలికైన, అతి చిన్న పరిమాణంలో ఉన్న విత్తనాలను కలిగి ఉండడం వల్ల సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఈ విత్తనాలు ముఖ్యంగా ఎరువులు, గాలి, నీరు, వాహనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది మెక్సికోలో ఉద్భవించి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలకు వ్యాప్తి చెందింది. భారతదేశంలో 1975 అధ్యాయనం ప్రకారం 5 మిలియన్ హెక్టార్లలో ఉండేది. ఇప్పుడు 35 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది. ఈ పార్టీనియం మొక్క ముందుగా మహారాష్ట్రలోని పూణేలో 1955- 56లో గుర్తించారు. అప్పటినుంచి దేశమంతా వ్యాప్తి చెంది 35 మిలియన్ హెక్టార్లకు పైగా ఆక్రమించింది. ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 10% భూమిని ఆక్రమించి ఉంది. ఇంతకు ముందు పార్థీనియం అంటే బంజరు భూముల్లో రోడ్ల పక్కన ఇండస్ట్రీ ప్రదేశాల్లో మాత్రమే ఉంటుందని చెప్పేవారు. కానీ ఇప్పుడు దీనిని మనం వ్యవసాయ, ఉద్యాన, అటవీ ప్రాంతాల్లో కూడా పెరగడం చూస్తున్నాం.

Methods Of Weed Eradication

Parthenium

ఈ కలుపు మొక్క వల్ల కొన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల ద్వారా వెళ్లడైంది. ఈ మొక్క పచ్చిక బయళ్ళలో కూడా పెరగడం వల్ల పశుగ్రాస కొరత కూడా ఏర్పడుతుంది. ఈ కలుపు మొక్క మనుషులకు, అదే విధంగా పశువుల ఆరోగ్యానికి కూడా హానికరం. కొంతమందికి ఈ మొక్కలను ముట్టుకున్నప్పుడు ఆస్థమా, చర్మ సంబంధ వ్యాధులు కూడా వస్తున్నాయి. డైరెక్టరేట్ అఫ్ వీడ్ సైన్స్ రీసెర్చ్ (DWSR), జబల్పూర్ లో గత 2 దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూ, కేవలం ఒక పద్ధతి ద్వారా ఈ కలుపు మొక్క యాజమాన్యాన్ని సంతృప్తికరంగా చేపట్టలేమని కనుగొన్నారు. కాబట్టి అన్ని రకాల యాజమాన్యం పద్ధతులను కలిపి సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. DWSR వారు పార్థీనియం యాజమాన్యానికి వివిధ రకాల పద్ధతులను సిఫారసు చేసింది.వాటి వివరాలు …

1. మాన్యువల్ పద్ధతి: పార్థీనియం పుష్పించక ముందే పేర్లతో సహా భూమిలో నుంచి పీకేయడం ద్వారా చాలా వరకు తగ్గించవచ్చు. ఈ మొక్కను పీకేటప్పుడు చేతులకు గ్లవుజులు, రక్షణ దుస్తులను ధరించడం తప్పనిసరి. పార్థీనియం మొక్కను కోసేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది మరలా పెరిగి తొందరగా పుష్పించి విత్తనాలను ఏర్పరుస్తుంది.
2. రసాయనిక పద్ధతి: వ్యవసాయ యోగ్యం కానీ భూముల్లో గడ్డి కాకుండా ఈ మొక్కని ఒక్కటే నాశనం చేయడానికి మెట్రిబ్యూజిన్ 0.3% లేదాహెక్టారుకు 1.5 కిలోల మూలపదార్థం గల 2, 4-డి ని పూత దశకు ముందే పిచికారి చేయాలి. ఇతర మొక్కలతోపాటు నాశనం చేయడానికి గ్లైఫోసైట్ 1.5 కిలోల మూలపదార్థంను పూత దశకు ముందే పిచికారి చేయాలి.
3. జీవ నియంత్రణ పద్ధతి: పార్థీనియం యాజమాన్యానికి జీవ నియంత్రణ ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. జైగోగ్రామ బైకొలరేట అనే పెంకు పురుగుతో పార్థీనియం యాజమాన్యం అనేది ఒక గొప్ప విజయంగా భారత దేశంలో చెప్పవచ్చు.ఈ పెంకు పురుగు 1983లో మెక్సికో నుంచి దిగుమతి చేసుకోబడింది. ఇది కేవలం పార్టీనియం మొక్కను ఆహారంగా తీసుకొని జీవిస్తుంది. ఈ పురుగు పార్థినియం ఆకులను తినేయడం వల్ల మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇందుకోసం వారు ఈ పురుగును ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి ప్రత్యేక ప్యాకేజింగ్ తో నేషనల్ పోస్టు, కొరియర్ ద్వారా అందజేస్తుంది.జూన్ నుంచి ఆగస్టు నెలలు ఈ పురుగును పార్థినియం మొక్కలపై విడుదల చేయడానికి మంచి సమయం. ఈ పురుగులు వర్షాకాలంలో ఈ మొక్కలపై తింటూ వాటి సంఖ్యను గణనీయంగా పెంచుకుంటాయి. ఒక్క జైగోగ్రామ బైకొలరేట (అక్షింతల పురుగు) ఒక్క మొక్కను పూర్తిగా తినడానికి 6-7 వారాలు పడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఒక్క హెక్టార్లో ఉన్న పార్థీనియం మొక్కలను నియంత్రించడానికి 20-25 లక్షల పురుగులు అవసరమవుతాయి. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేటు సంస్థలు, రైతు సంఘాలు ఈ పురుగులను వదిలి పార్థీనియం నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.జీవనియంత్రన పద్ధతి ద్వారా పార్టీనియం నియంత్రించడానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. అవి బంతి, కేసియా సెర్రేట విత్తనాలను బంజరు భూముల్లో రోడ్ల పక్కన మార్చి, ఏప్రిల్ నెలల్లో చల్లడం ద్వారా పార్థీనియం వ్యాప్తి చెందడాన్ని నివారించవచ్చు.ఈ మొక్కలు పార్థినియం మొక్కలు పెరగకుండా భర్తీ చేస్తాయి.
4. చట్టపరమైన చర్యలు: హానికరమైన కలుపు మొక్కల ప్రవేశం, వ్యాప్తిని చట్టపరంగా అరికట్టాలి.
5.కంపోస్ట్ తయారీకి వాడుకోవడం ద్వారా: పార్థీనియం మొక్కలను పూత దశకు ముందే భూమిలోంచి వేళ్ళతో సహా పీకి కనీసం మూడు అడుగుల లోతు ఉన్న గుంతలో 3-4 వరుసలుగా వేయాలి. యూరియా, పేడ ద్రావణాన్ని ప్రతి వరుస పైన చల్లాలి. తర్వాత గుంతను పేడ మట్టి, పొట్టు మిశ్రమంతో కప్పివేయాలి. రెండు నుంచి మూడు నెలల తర్వాత బాగా కుళ్ళిన కంపోస్టు తయారవుతుంది. వర్మీ కంపోస్ట్ తయారీలో కూడా ఈ మొక్కలను వాడవచ్చు.దీనితో చేసిన కంపోస్టులో సాధారణ కంపోస్టుతో పోల్చినప్పుడు ఎక్కువ పోషకాలు ఉన్నట్లుగా, వర్మి కంపోస్టుతో సమానంగా పోషకాలు ఉన్నట్లుగా నిరూపితమయింది. పార్టికల్ బోర్డులు, బయోగ్యాస్, బయో పెస్టిసైడ్ తయారీలో కూడా దీనిని వాడుతారు.
పార్థీనియంను సమర్ధవంతంగా నియంత్రించాలంటే అవగాహన, అందరి నుంచి సహకారం ఉండాలి. జాతీయస్థాయిలో ప్రతి సంవత్సరం పార్థీనియం అవగాహన వారం ఆగస్టు నెలలో 16 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. దీనిద్వారా విస్తృత ప్రచారం జరుగుతుంది. స్వచ్చంధ సంస్థలు, కేవీకేలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, సాధారణ ప్రజలు ఇందులో పాలుపంచుకుంటారు. ర్యాలీలతో పాటు కరపత్రాల పంపిణీ కూడా చేస్తారు.

డా.ఎం.శ్వేత, డా.ఎస్.నవీన్ కుమార్, డా.బి. రాజ్ కుమార్, డా.సురేశ్ కుమార్, పి.విజయ్ కుమార్, బి.శ్రీలక్ష్మి, కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూర్

Leave Your Comments

Paddy Cultivation: నేరుగా విత్తే వరి సాగుకు ఇది అనువైన సమయం !

Previous article

Rhizobium benefits: మీకు తెలుసా..? పప్పు జాతి పైర్లకు రైజోబియం చేసే మేలు !

Next article

You may also like