Protection of Agricultural Land from Elephant Attacks: ఆంధ్ర ప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మన్యం ప్రాంతాలను ఆనుకొని వున్న పంట పొలాల్లో ఏనుగుల బెడద ఎక్కువగా రైతాంగాన్ని భాదిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఈ ఏనుగులు నాశనం చేసే పంటల్లో ముఖ్యంగా అరటి, చెరకు, వరి, కొబ్బరి ఇంకా ఇతరత్ర కూరగాయాల పంటలను నాశనం చేస్తూ రైతుకు కన్నీరును మిగిలుస్తున్నాయి. అయితే అటవీశాఖ వారి సూచనలు మరియు వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) నిబంధనలు పాటిస్తూనే మనం క్రింది జతపరిచిన పద్ధతుల ద్వారా పంట పొలాలను ఏనుగుల బారి నుండి కాపాడుకోవచ్చును. అనగా భౌతిక, యాంత్రిక, వృక్ష, కీటక సంబంధమైన అవరోధాలకు సంభందించిన పద్ధతుల ద్వారా ఏనుగుల బెడదను అరికట్టగలం.
Also Read: Dragon Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఆరోగ్య లాభాలు బాగు.!
భౌతిక, యాంత్రిక పద్ధతులు:
1. కందకాలు:
ఏనుగులు దూకడం సాధ్యం కాని కందకాలు వెడల్పుగా తవ్వడం అనేది అనాదిగా ఆచరిస్తున్న పద్దతులలో ముఖ్యమైనది. ఈ కందకాలు లోతుగా ఉండడం వలన అవి వాటిని దాటలేక సహజంగానే వెనుతిరుగుతాయి.
2. మొనదేలిన వెదురు బొంగులు పొలం గట్ల వెంబడి పాతిపెట్టడం:
ఈ రకమైన చర్యలో వెదురు బొంగులు ధృడంగా, మొనదేలిన సూది ఆకారంతో ఉండడం వలన వాటిని పొలం గట్ల వెంబడి, గట్లు మీద 10 -15 %షఎ% ఎత్తు మేరకు పాతి పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన ఏనుగులు వాటి మీద కాలు మోపడం, నడవడం చేయలేవు. అలాగే ఎక్కువ వెడల్పుతో ఈ కర్రలు పాతడం వలన కూడా వీటి మధ్యలో అడుగులు వేయలేక అలాగే వాటిని అధిగమించి దాటడం సాధ్యం గాక వెనుతిరుగుతాయి.
3. మొనదేలిన రాళ్లను గట్ల మీద పాతడం:
ఈ రకమైన చర్యల్లో కూడా పైన పాటించిన పద్దతి ప్రకారం రాళ్లను మొనదేలిన ఆకారంతో కోయించి దగ్గరగా ఉండేటట్లు మరియు వెడల్పుగా పాతిపెట్టడం చేయాలి. తద్వారా ఏనుగులు వాటిని దాటి పంట పొలాల్లోకి రావడం నియంత్రించబడుతాయి.
4. మంటలు:
చెత్త చెదారాలతో కాని, పనికిరాని రబ్బరు టైర్లు గాని ఉపయోగించి పొలాల గట్ల దగ్గర రాత్రులందు మంటలు పెడితే ఏనుగులు ఆ మంటను చూసి వెనుదిరుగుతాయి. ఇలా పంటలను రాత్రి వేళల్లో కాపాడుతూ ఉదయం సమయంలో పంటను తరలించడం చేయాలి. ఈ రకమైన పద్ధతిని మన ఉత్తరాంధ్ర జిల్లాలలో అన్నదాతలు ఎక్కువగా పాటించడం చూస్తున్నాం.
5. శబ్దాలు:
ఇనుప డ్రమ్ములను ఉపయోగించి శబ్దాలు చేయడం, అలాగే తుపాకీ పేల్చడం (జంతువులకి హాని చేయకుండా) అన్నవి అనాదిగా వస్తున్న ఆచారాలు. ఈ రకమైన పద్ధతులు కూడా మన జిల్లాలలో పాటించడం మన అందరికి తెలిసిన విషయం. అలాగే కొన్ని రకాల ప్రాంతాలలో పెద్ద, పెద్దగా శబ్దాలు వచ్చేలా రాత్రి పూట పంట పొలాల్లో రికార్డింగ్ పాటలు, అరుపులు చేయడం వలన కూడా మనం పంటలను ఏనుగుల బారి నుండి కాపాడుకోవచ్చును. మరియు కొన్ని రకాల అలారం శబ్దం చేయడం తద్వారా రైతన్న మేల్కొని వాటిని తరిమి కొట్టడం కూడా మనం చూస్తున్న చర్యల్లో భాగమే.
ఇంకా కొన్ని ప్రాంతాలలో పొలం గట్ల వెంబడి కంచెను అమర్చి వాటి మధ్యలో పెద్ద, పెద్ద శబ్దాలను చేసే గంటలు అమర్చుతారు. ఏనుగులు వాటిని తాకడం వలన సహజంగానే గంటలు శబ్దం చేయడం, రైతన్న మేల్కొని వాటిని తరిమి కొట్టడం కూడా మనం చూస్తున్న పద్ధ్దతుల్లో ఒకటిగా చెప్పవచ్చు.
వృక్ష సంభందమైన అవరోధాలు:
1. అడ్డుకట్టలు:
పనికి రాని మొక్కలను పొలం చుట్టూ నాటుకోవడం వలన ఏనుగులు ముఖ్య పంటను గుర్తించలేక వెనుతిరుగుతాయి. ఈ రకమైన పంటల్లో ముఖ్యంగా సీసాల్, మిరప, టీ, పసుపు, నూనెపంటలను అడ్డుకట్టలుగా పొలం చుట్టూ వేసుకోవాలి (నాటుకోవాలి).
2. బఫర్ జోన్:
కొన్ని రకాల ప్రాంతాలలో మన్యానికి పంట పొలాలకు కొంచెంగా దూరం పాటించడం చేయాలి. ఈ దూరం పాటించిన ప్రాంతాలలో మన్యంకి ఆనుకొని సీసాల్, ముండ్లు వున్న లేదా అటవీ ఉత్పత్తులకు సంబంధించిన కలప మొక్కలను పెంచుకోవడం వలన కూడా పంటలను కాపాడుకోవచ్చును. ఈ రకమైన చర్యలో అవి కలప మొక్కలను గుర్తించి వాటిని తినడానికి ఇష్టపడక, అలాగే అవతలి వైపు వున్న పంట పొలాలను గుర్తించలేక అక్కడ నుండి వెనుతిరుగుతాయి.
3. ఇంకా కొన్ని రకాల పద్ధతులలాగా మనం పొలం గట్ల మీద మరియు పొలాల్లో వున్న ఒక చెట్టుకు ఇంకొక చెట్టుకు మధ్యన తాడును కట్టాలి. అలా కట్టిన తాడుకు తెలుపు రంగు వస్త్రమును కొద్దిపాటి దూరాన్ని పాటిస్తూ వేలాడదీయాలి. ఇలా చేయడం వలన ఏనుగులు ఒక రకమైన మానసిక భయాందోళనకు గురై వెనుతిరుగుతాయి. ఇలాంటి పద్ధతులను ఎక్కువగా ఆఫ్రికా దేశాలలో పాటిస్తారు.
ఇతరత్ర అవరోధాలు:
1. విద్యుత్ రహిత ఫెన్సింగ్ (కంచె):
ఏనుగుల బెడద ఎక్కువగా వున్న ప్రాంతాలలో రైతులు ఈ విద్యుత్ రహిత కంచెను నిర్మించడం చేస్తున్నారు. ముఖ్యంగా కొబ్బరి, అరటి పొలాల చుట్టూ ఈ కంచెను నిర్మించి పంటను కాపాడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా స్తంభాలను సరిహద్దు వెంబడి లోతుగా పాతిపెట్టి భారీ గేజ్ వైర్ ను కంచె మాదిరిగా చుట్టుకోవాలి. అయితే ఈ పద్దతి కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఆసియా దేశాల్లోని చాలా ప్రాంతాలలో ఈ ఫెన్సింగ్ (కంచె ) పద్ధతి మీద రైతులు మక్కువ చూపించడం గమనార్హం.
2. విద్యుత్ కంచె:
విద్యుత్ కంచెను కూడా మన ఆంధ్రా జిల్లాలో రైతులు వాడడం తద్వారా ఏనుగుల బారి నుండి పంటలను కాపాడుకోవడం మనం చూస్తున్నాము. అయితే ఈ పద్ధ్దతి అన్ని ప్రాంతాల్లో ఆచరణలో లేనప్పటికీ ఏనుగులు వెనుతిరిగేలా చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
సహజ (కీటక) శత్రువులు:
సాధారణంగా మన్యం ప్రాంతంలో తేనెటీగలు ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. ప్రకృతి అనుకూలంగా వుండే మన్యం ప్రాంతాలు అలాగే వాటిని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలలో తేనెటీగల పెంపకం ప్రోత్సహించడం, వాటిని ప్రోత్సహించే పద్దతిలో మనకి పరోక్షంగా తేనే లభించడం వలన రైతుకు అదనపు ఆదాయం చేకూరుతుంది. అలాగే ప్రత్యక్షంగా ఏనుగులను కుట్టి వాటిని తరిమేసే గుణం ఉన్నందున ఈ తేనెటీగలను గజరాజులకు సహజ శత్రువులుగా భావించి వాటిని మన్యం పరిసర ప్రాతాలలోని పంటపొలాలను ఏనుగుల బారి నుండి కాపాడుకోవచ్చును. ఇందులో భాగంగా పొలాల సరిహద్దుల వెంబడి పాతిన కొయ్యలకు తేనెటీగల పెట్టెలను కట్టి వాటిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలి. ఈ రకమైన చర్య వలన ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినపుడు తీగ కదిలి తేనెటీగల ప్రశాంతతకు భంగం కలుగుతుంది. పెట్టెలలో నుండి బయటకి వచ్చిన తేనెటీగలు ఏనుగులను చుట్టుముడతాయి. అందువలన ఏనుగులు వెనుతిరగడం జరుగుతుంది. ఈ రకమైన పద్ధతిని శ్రీలంక, ఆఫ్రికా దేశాలలోని రైతాంగం ఆచరణాత్మకంగా రుజువు చేసారు. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా త్రిసూర్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ సంస్థ తేనెటీగల కంచెను రైతుల సహకారంతో క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది.
రసాయనిక అవరోధాలు:
1. కాప్సికం పంట:
ఈ కాప్సికం మొక్కలలో క్యాప్సిసిన్ రసాయనికం ఉండడం వలన ఏనుగులు ఈ క్యాప్సిసిన్ ఘాటును ఇష్టపడక వెనుతిరగడం జరుగుతుంది. ఈ కాప్సికం పంటను సహజ అవరోధమైన పంటగా ఆఫ్రికా, ఆసియా దేశాల రైతులు ప్రోత్సహిస్తున్నారు .
2.పెప్పర్(క్యాప్సిసిన్) స్ప్రే:
క్యాప్సిసిన్ స్ప్రే తయారీ చేయడానికి మిర్యాలను ద్రావకాలలో నానబెట్టాలి. మొత్తం మిర్యాలలోని వేడి స్కోవిల్ యూనిట్లలో కొలుస్తారు. క్యాప్సిసిన్ ను సియాచిన్ నూనెతో కలిపి, సవరించిన స్ప్రే నాజిల్‌తో ఏరోసోల్ డబ్బాలో నింపాలి (హెయిర్ స్ప్రే మాదిరిగానే). అప్పుడు కొంచెం వత్తిడి పీడనం ఏర్పడి అణువులతో కూడిన మేఘం మాదిరిగా తయారవుతుంది. అయితే క్యాప్సిసిన్‌ను గ్యాస్ క్లౌడ్ లోకి ఆటోమైజ్ చేయడం ఒక చాల ప్రభావంతమైన చికాకు. కానీ ఈ పద్ధ్దతిలో క్యాప్సిసిన్ పెప్పర్ స్ప్రే యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ చర్య ద్వారా 10-15 నిముషాలు తాత్కాలిక అంధత్వము మరియు మండుతున్న అనుభూతి 40-60 నిమిషాలు అనగా సుమారు గంట సమయం పాటు చర్మం మీద ఉంటుంది. కావున ఈ చర్య వలన కూడా మనం ఏనుగులను వెనుతిరిగేటట్లు చేయవచ్చును.
సారాంశం:
ఈ రకమైన భౌతిక, యాంత్రిక, వృక్ష, కీటక మరియు రసాయనిక సంబంధమైన పద్ధతులు, అలాగే ఆచరణాత్మక ప్రాచీన పురాతన శాస్త్రీయ పద్దతులను పాటించి గజరాజును వెనుదిరిగేటట్లు చేసి పంట పొలాలను కాపాడుతూ ఈ దేశంలో రైతే రాజు అనేలా, దేశానికి వెన్నెముకగా నిలబడుతూ మంచి లాభాలను పొందవచ్చును.
ఏనుగులు దాడి చేసిన వరి, కొబ్బరి, చెరకు, అరటి పొలాలు.
డా. అప్పల రాజు, డా. అద్దంకి మనీషా అసిస్టెంట్ మేనేజర్,
ప్రొడక్ట్ డెవలప్మెంట్, పి ఐ ఇండస్ట్రీస్, గుర్గాన్
అసిస్టెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లా రెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్.
Also Read: Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు