మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

మామిడిలో పూత సకాలంలో రావడానికి సూచనలు

0
Mango flowers

తెలంగాణా రాష్ట్రంలో మామిడి 1.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉండి సుమారుగా 11.48 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మన రాష్ట్రంలో ఉమ్మడి, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో మామిడిని విస్తారంగా సాగుచేస్తున్నారు. మామిడి తోటలను సాగుచేసే రైతులు పూతకు ముందు, పూత దశలో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పూత ఆలస్యంగా రావడం మరియు ఒకేసారి రాకపోవడం వంటి పరిస్థితులను గమనించడం జరుగుతుంది.

  • మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబరు నెలాఖరున పూమొగ్గలు బయటికి వచ్చి, పూత అంతా కూడా రావటానికి జనవరి నెల ఆఖరి వరుకు సమయం పడుతుంది.

  • కాబట్టి పూత, కోత మొదలైన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టడం సరికాదని, పూత రావడానికి కొన్ని రోజుల ముందు నుంచి తోటను గమనించి పూర్తి స్థాయిలో యాజమాన్య చర్యలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చును.

అంతర కృషి : నవంబర్ నెల నుంచి జనవరి వరకు కొమ్మ కత్తిరింపులు కానీ, దున్నడం కానీ చేయకుండా మామిడి తోటలని చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమయంలో చెట్టుకు అంతరాయం కలిగించినట్లయితే పూత రావడం ఆలస్యమవడం కానీ లేదా పూత రాకుండా ఉండడం కానీ జరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.

Also Read : పలు పంటలలో సమగ్ర సస్య రక్షణ మరియు పోషక యాజమాన్యం

mango flower

mango flower ( మామిడి పూత )

నీటి యాజమాన్యం : మామిడిలో పూత చాలావరుకు వాతావరణ పరిస్థితుల పైన , రైతులు చేపట్టే యాజమాన్య చర్యలపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జూలై – ఆగష్టు నెలలో మామిడి చెట్లకు వచ్చిన ఇగుర్లు ముదిరి ఆ రెమ్మల్లో పూత డిసెంబర్ చివర లేదా జనవరి మాసంలో వస్తుంది. మామిడి పూత రావడానికి ముందు రెండు నెలలు బెట్ట పరిస్థితులు (నీటి ఎద్దడి) అవసరం, అదే విధంగా వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా డిసెంబర్ మాసంలో సగటు ఉష్ణోగ్రత 18 – 28° సెంటిగ్రేడ్ & రాత్రి ఉష్ణోగ్రత 10 – 13° సెం.గ్రే. ఉంటే పూత రావడానికి అనుకూలం. ఈ పరిస్థితుల్లో తేడాలొస్తే పూత రావడంలో మార్పులు ఉంటాయి. కాబట్టి పూతకు ముందు రెండు నెలలు తోటలకు నీటి తడులు ఇవ్వడం పూర్తిగా నిలిపివేయాలి. పూతకు ముందు భూమిలో తడి ఉంటే చెట్లలో పూతకు బదులు ఆకు ఇగుర్లు వచ్చేస్తాయి. డిసెంబర్ చివరిలో పూత వచ్చిన అనంతరం ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి భూమిలో తేమను బట్టి క్రమం తప్పకుండా నీటి తడులు ఇవ్వాలి.

 

Mango Flowers

Mango Flowers ( మాడిపోతున్న మామిడి పూత )

నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి వాతావరణం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పూ మొగ్గలు రావడం ఆలస్యమవుతుంది. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు పూ మొగ్గలను ఉత్తేజపరిచేందుకు డిసెంబర్ రెండవ పక్షంలో లీటరు నీటికి 10గ్రా. మల్టి – కె ( పొటాషియం నైట్రేట్) + 5 గ్రా. యూరియా చొప్పున కలిపి చెట్లపై రెమ్మలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. యూరియా, మల్లి – కె లోని నత్రజని, పోటాష్ పోషకాలు కలిసి పూ మొగ్గలను ఉత్తేజపరిచి , బాగా పూత రావడానికి అధికంగా పిండి కట్టడానికి మరియు కాయలు మంచిసైజులో, నాణ్యంగా ఎదగడానికి సహకరిస్తాయి.

ఇ.రాంబాబు, ఎస్.మాలతీ, ఎన్.కిషోర్ కుమార్, ఎ. రాములమ్మ, బి. క్రాంతి కుమార్ మరియు డి.ఉష శ్రీ కృషి విజ్ఞానకేంద్రం, మల్యాల, మహబూబాబాద్  

 

Also Read : PJTSAU లో అంతర్జాతీయ మృత్తికా దినోత్సవ కార్యక్రమం

 

Leave Your Comments

నిరసన కొనసాగుతోంది…

Previous article

కిసాన్ మోర్చా కొత్త కమిటీ..

Next article

You may also like