ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయం

పొద్దుతిరుగుడు సాగులో మెళుకువలు..

0

పొద్దుతిరుగుడు నూనెగింజల పంట, అంతేకాకుండా అలంకార మొక్కగా కూడా పెంచారు. పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి.ప్రస్తుతం ఎక్కువగా శాతం పొద్దుతిరుగుడు నూనె నే వాడుతున్నారు.

విత్తే సమయం:

రబీలో నవంబరు-డిసెంబరు, వేసవిలో నీటి పారుదల కింద జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు

నేలలు:

నీరు నిల్వ ఉండని, ఉదజని సూచిక 6.5-8.0 మధ్య ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పొద్దుతిరుగుడు అధిక తేమను తట్టుకోలేదు. కనుక లోతట్టు, సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయరాదు.

అనువైన రకాలు:

రకాన్ని బట్టి పంటకాలం 80 – 95 రోజులుంటుంది. నూనె శాతం 38-44 శాతం వరకుంటుంది. సంకర రకాలైన కె.బి.ఎస్.హెచ్ – 1, కె.బి.ఎస్.హెచ్- 44, ఎన్.డి.హెచ్- 1, డి.ఆర్.ఎస్.హెచ్-1, ఎ.పి.ఎస్.హెచ్-66, రకాలు అనుకూలం.

విత్తన మోతాదు:

ఎకరాకు 2కిలోల విత్తనాలు సరిపోతాయి.

విత్తే దూరం:

బరువు నేలల్లో సాలుకు సాలుకు మధ్య 24అంగుళాలు, మొక్కకు మొక్కకు మధ్య 12అంగుళాలు ఉండేలా విత్తుకోవాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 18 అంగుళాలు మొక్కల మధ్య 8-10 అంగుళాలు ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.

ఎరువులు:

బాగా చివికిన పశువుల ఎరువును ఎకరాకు 3 టన్నులు వేయాలి. దుక్కిలో ఎకరాకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, యూరియా 26 కిలోలు, జిప్సం 55 కిలోలు, విత్తిన 30 రోజులకు 13 కిలోల యూరియా, విత్తిన 50 రోజులకు 13 కిలోల యూరియా వేయాలి.

తాలుగింజల నివారణ:

పొద్దుతిరుగుడు సాగులో తాలుగింజలు ముఖ్యమైన సమస్య. దీని నివారణకు 400గ్రా. బోరాక్స్ 200 లీటర్ల నీటిలో కలిపి పైరు పూతదశలో పిచికారీ చేయాలి. మొదట బోరాక్స్ ను వేడినీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేయాలి.

కలుపు నివారణ:

విత్తిన వెంటనే పెండిమిథాలిన్ ఎకరాకు 1 లీటరు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట విత్తిన 20-25 రోజులకు ఫినాక్సి ప్రాప్ ఇధైల్ 250 మి.లీ./ 200 లీటర్ల నీటిలో కలిపి కలుపును నివారించుకోవచ్చు.

నీటి యాజమాన్యం:

మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ, గింజకట్టు దశలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. భూమిలో తేమను బట్టి ఎర్ర నేలల్లో 6నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి.

Leave Your Comments

పొన్నగంటి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

క్యాబేజి మరియు కాలీప్లవర్ పంటలలో సస్యక్షణ

Next article

You may also like