ఇప్పుడున్నకాలంలో ఆరోగ్యవంతమైన పాలు దొరకడమే కష్టమైపోయింది. ఎక్కడ చూసినా కల్తీ లేకుండా ఒక్క చుక్క కూడా ఇవ్వడం లేదు. గ్రామాల్లో అప్పటి వరకు స్వచ్చంగా ఉన్న ఆవు, గేదె పాలు.. పట్టణాల్లోకి వెళ్లేసరికి కల్తీ అయిపోతున్నాయి. పాల వ్యాపారులు కూడా లాభాల కోసం ఇలా కల్తీ వ్యాపారం చేస్తున్నారు. అలాగని, ధరలేమైనా తగ్గిస్తారా అంటే.. చిక్కటిపాలకున్న ధరతోనే అమ్మేస్తుంటారు. ఇక ఇప్పుడున్న రేట్లకు పాలను చూడాలన్నా భయమేస్తోంది.. అలాంటిది ఓ వ్యక్తి ఉచితంగా పాలు పోస్తే తీసుకుంటారా?.. అని ఎవ్వరైనా కాదంటారా?..
కర్నూలు జిల్లా నంది కొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన ఆవుల శ్రీను ఓ రైతు. ఆయనకు 500 ఆవులున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎవ్వర్నీ చిల్లి గవ్వ కూడా అడగకుండా.. గత ఐదేళ్ల నుంచి పాలను ఉచితంగా పోస్తున్నాడు. ఈయన దగ్గర స్వచ్చమైన పాలు తీసుకోడానికి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వాళ్లంతా క్యూ కడుతుంటారు. ఎవ్వరి నుంచి రూపాయి కూడా తీసుకోడు.
దీంతో పాటు మరో విశేషం ఏంటంటే.. ఎవరైనా ఆవును అడిగితే ఆ దానం కూడా చేసేస్తున్నాడు. అయితే, కేవలం కర్నూలు జిల్లా వాళ్లకు మాత్రమే. ఒక వేళ ఆవుకు దూడ ఉంటే.. దాన్ని కూడా ఇచ్చేస్తాడట. ఇలా చాలా మంది శ్రీను దగ్గర ఆవును తీసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఇతనికి ఆవుల శ్రీను అనే పేరు వచ్చింది. అసలు ఇలా ఆవులను దానం చేయడానికి కారణం ఏంటా అని అడగ్గా.. తన వద్ద ఈ ఆవులను మేపేంత ఆర్థిక స్తోమత లేదని.. రెవెన్యూ అధికారులు స్థలం కేటాయిస్తే మరికొందరకి ఆవుపాలను, ఆవులను ఇలాగే అందిస్తానని తెలిపాడు. శీను నుంచి సాయం పొందిన వాళ్లు మాత్రం అతని మేలు మర్చిపోలేమని అంటున్నారు.