Drip Irrigation : బిందు సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలి…
- 3.1 లక్షల హెక్టార్లలో పూర్తయిన రిజిస్ట్రేషన్లు
- అవసరం ఉన్న ప్రతి రైతుకూ అమలు
- బకాయిలు చెల్లింపుతో బిందు సేద్యానికి పునరుజ్జీవం
- రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి,
మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు
బిందు సేద్యం అమలులో అంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం (అక్టోబర్ 28 )సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6% భాగస్వామ్యంతో ప్రధమ స్థానంలో నిలిచిందని, తిరిగి బిందు సేద్యం అమలులో రాష్ట్రం ప్రధమ స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.
బకాయిల చెల్లింపుతో పథకానికి పునరుజ్జీవం:
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ ఎత్తున బిందు సేద్యం కంపెనీలకు పెట్టిన బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించి పథకాన్ని తిరిగి పునరుద్ధరించారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వం బకాయిలు చెల్లించి పథకానికి పునరుజ్జీవం పోసి అమలులో వేగం పెంచామని మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే రూ.276 కోట్ల బకాయిలు చెల్లించామని, మరో పది రోజుల్లో రూ.104 కోట్లు చెల్లిస్తామని, నెల రోజుల్లో రూ.232 కోట్ల చెల్లింపులకు ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కేంద్ర సహకారంతో పథకం అమలు !
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికే 3.01 లక్షల హెక్టార్లలో 2.50 లక్షల మంది రైతులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, 6,797 మంది రైతులకు చెందిన 7,253 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు ఇప్పటికే అందించామని వెల్లడించారు. మరో 13 వేల హెక్టార్లలో అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తామని, త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిని కలిసి రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంపై చర్చించనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన శాఖ (MIDH) పథకానికి నిధులు రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
రైతుకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు
రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 3450 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలియచేశారు. మామిడి, జీడిమామిడి (జీడిపప్పు) బోర్డు ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు నూతన మండలాల కేటాయింపు, ఆయిల్ పామ్ ధరల నిర్ణయం, కోకోనట్ బోర్డు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Leave Your Comments