ప్రపంచమంతా 2021 సంవత్సరంలో నాల్గవ ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని విపత్కర పరిస్థితుల్లో జరుపుకుంటుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వివిధ దేశాలను పట్టిపీడిస్తున్న సమయం ఇది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం తేనెటీగల దినోత్సవాన్ని” బీ ఎంగేజ్డ్ – బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్” (అందరూ నిమగ్నమై తేనెటీగల మంచి కోసం మళ్ళీ పునర్నిర్మించాలి) లనే సరికొత్త ఉద్దేశంతో జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. స్లొవేనియన్ తేనెటీగల పెంపకందారుడు అంటోన్ జాన్సా (1734 – 1773 ) జ్ఞాపకార్థం, 2018 సంవత్సరం, నుండి అతని పుట్టిన తేదీ మే 20 తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాన్సా ఆధునిక పద్దతులలో తేనెటీగల పెంపకానికి మార్గదర్శకుడు మరియు ఐరోపా లో మొదటిసారిగా తేనెటీగల పెంపకం పైన పాఠశాలను నిర్వహించాడు. తేనెటీగల వృద్ధికి ప్రపంచ దేశాలన్నీ కృషిచేసి జీవ సమతుల్యం పాటించాలనికూడా తెలిపారు. పంట పండించడంలో తేనెటీగల యొక్క పాత్రను ప్రపంచ దేశాలు గుర్తించి, తేనెటీగల జాతుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, వ్యవసాయంలో అధిక రసాయన ఎరువులను, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి జీవ సమతుల్యానికి మనమందరం పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఐక్యరాజ్య సమితి ఈ రోజు ప్రపంచ దేశాలను కోరుతున్నది.
తేనెటీగల పెంపకం ద్వారా ఈ కింది పదార్థాలను మనం పొందొచ్చు.
తేనె – ఔషధ గుణాలను కలిగి ఉన్న తీయని చక్కర.
పోలెన్ – ప్రోటీన్లు మరియు విటమిన్లు వీటిలో అధికంగా ఉంటాయి.
రాయల్ జెల్లీ- వృద్దులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
ప్రోపోలిన్ – సహజ యాంటీ బయాటిక్.
వ్యాక్స్ మృదువైన, సున్నితమైన చర్మ సౌందర్యానికి మరియు ఇతర పరిశ్రమలలో ముడిసరుకుగా వాడుతారు.
బీ వెనోమ్ – తేనెటీగలు కుట్టినప్పుడు ఔషధంగా వాడుతారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO ) లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.12 మిలియన్ టన్నుల తేనె ఉత్పత్తి జరుగుతుంది. మన దేశం తేనె ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో కేవలం 6 శాతం మాత్రమే మన దేశంలో ఉత్పత్తి జరుగుతుంది. తేనెటీగలు ఉత్పత్తి చేసే సహజ అతి సంతృప్త చక్కర ద్రావణమే తేనె. తేనెలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ముఖ్యమైన కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్. అంతేకాకుండా తేనెలో ముఖ్యమైన రంగునిచ్చే వర్ణద్రవ్యాలు (కెరోటినాయిడ్లు మరియు ఆంథోసైనిన్లు) ఉండటం వలన సహజసిద్ధంగా ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. అంతేకాకుండా వివిధ రకాల ఖనిజాలు, సేంద్రియ ఆమ్లాలు, విటమిన్లు మరియు ఎంజైములు ఉండటం వలన సహజ ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యాలను నయం చేయడంలో ప్రోత్సహకారమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలలో నిరూపించడం అయినది. వైద్యశాస్త్రంలో తేనెను వివిధ వ్యాధులను నయం చేయడానికి సంప్రదాయ వైద్య పద్ధతులతో పాటుగా తేనెను అనుబంధ ఔషధంగా విరివిగా ఉపయోగిస్తారు. తేనెను తీసుకోవడం ద్వారా చాలా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తేనెకు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ వైరల్, ఫ్రీ బయోటిక్ మరియు ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
తేనెలో వివిధ పోషకాలు 100 గ్రాములలో
పోషకాలు పరిమాణంలో లభ్యత
తేమశాతం 15 – 20
కార్బోహైడ్రేట్లు(శాతం) 85 – 88
ఫ్రక్టోజ్ (శాతం) 40 – 45
గ్లూకోజ్ (శాతం) 32 – 38
సుక్రోజ్ (శాతం) 2 – 5
మాల్టోజ్ (శాతం) 2 – 4
ఒలిగోసాకరైడ్లు (శాతం) 2- 4
ఎర్లొస్ (శాతం) 0.6 – 1.0
మేలెజిటోస్ ( శాతం) 0.05- 1.0
గ్లైసెమిక్ చక్కెరలు (శాతం) 73 – 77
ప్రోటీన్ (శాతం ) 0.35 – 0.45
కొవ్వు (శాతం) 0.3 – 0.7
థియామిన్ (విటమిన్ బి1) మిల్లీ గ్రాము / 100 గ్రా. 0.01 – 0.03
రిబోఫ్లేవిన్ (విటమిన్ బి2 ) మిల్లీ గ్రాము/ 100 గ్రా. 0.01 – 0.03
నియాసిన్, మిల్లీ గ్రాము/ 100 గ్రా. 0.1 – 0.15
విటమిన్ బి5, మిల్లీ గ్రాము / 100 గ్రా. 0.03 – 0.07
పిరిడాక్సిన్, మిల్లీ గ్రాము/ 100 గ్రా. 0.13 -0.18
ఫోలిక్ ఆమ్లం, మిల్లీ గ్రాము/ 100 గ్రా. 0.03 – 0.07
ఆస్కార్బిక్ ఆమ్లం, మిల్లీ గ్రాము/ 100 గ్రా. 2.0 – 2.5
విటమిన్ కె, మిల్లీ గ్రాము/ 100గ్రా. 0.02 – 0.04
మన దేశంలో తేనె అమ్మే సమయంలో తేనెలో కల్తీ నివారించి ఈ కింది ఆహారభద్రత ప్రమాణాలను పాటించవలసిన అవసరం ఉన్నది
కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ ప్రకారం తేనె లో ఈ క్రింద నాణ్యత ప్రమాణాలు ఉండాలి
క్రమ సంఖ్య ప్రమాణాలు పరిమితి
1 స్పెసిఫిక్ గ్రావిటీ ఉష్ణోగ్రత 27 0C వద్ద కనిష్టం 1.35
2 తేమశాతం గరిష్టంగా 20.0
3 మొత్తం రెడ్యూసింగ్ చక్కెర్లు శాతం కనిష్టం 65.0
కార్వి యకలోసా మరియు హనీడ్యూ తేనె, శాతం (ద్రవ్యరాశి ద్వారా) కనిష్టం 60. 0
మిశ్రమ తేనెలో హనీడ్యూ తేనె మరియు వికసించిన తేనె శాతం (ద్రవ్యరాశి ద్వారా, కనిష్టం 45.0
4 సుక్రోజ్ శాతం గరిష్టం 5.0
కార్వి యకలోసా మరియు హనీడ్యూ తేనె, గరిష్టం 10
5 ఫ్రక్టోజ్: గ్లూకోజ్ ల నిష్పత్తి 0.95 – 1.50
6 మొత్తం బూడిద శాతం, గరిష్టం 0.50
7 ఆమ్లత్వం (ఫార్మిక్ ఆమ్లం)శాతం (ద్రవ్యరాశి ద్వారా), గరిష్టం 0.20
ఫ్రీ అసిడిటీ మిల్లీ క్వివలెంట్స్ ఆమ్లం/ 1000 గ్రా. గరిష్టంగా 50.0
8 హైడ్రాక్సీ మిథైల్ ఫర్ ఫ్యూరల్ (HMF) మిల్లీ గ్రాము/ కేజీ, గరిష్టంగా 80.0
9 డయాస్టెన్ కార్యాచరణ, (షేడ్ యూనిట్లు) కనిష్ట 3.0
10 నీటిలో కరగని పదార్థం శాతం (ద్రవ్యరాశి ద్వారా) గరిష్టం 0.10
11 సి 4 షుగర్ శాతం ( ద్రవ్యరాశి ద్వారా గరిష్టం 7.0
12 పుప్పొడి సంఖ్య / గ్రా. కనిష్ట 25000
13 రైస్ సిరప్ కోసం నిర్దిష్ట మార్కర్ (SMR)పరీక్ష నెగిటివ్
14 రైస్ సిరప్ కోసం ట్రేస్ మార్కర్ నెగిటివ్
15 ఇతర ఒలిగోసారైడ్లు శాతం, గరిష్టం 0.1
16 ప్రోలిన్ మిల్లీ గ్రాము/ కేజీ కనిష్ట 180
ఎ. పోశాద్రి, ఎమ్. సునీల్ కుమార్, ఎం. రఘువీర్, జి.శివచరణ్, ఎ. రమాదేవి, వై.ప్రవీణ్ కుమార్ మరియు డా.పి. జగన్ మోహన్ రావు , కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ – 504002