కంది పప్పుదినుసుల్లో ముఖ్యమైనది. వాతావరణ పరిస్ధితుల వలన కందిలో ప్రధానంగా కాయ తొలుచు పురుగు మరియు మారుకా మచ్చల పురుగు ఆశించడం జరుగుతుంది.
కాయ తొలుచు పురుగు :- ఈ పురుగు పూత,పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి.
నివారణ చర్యలు :
- వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది.
- ఈ పురుగు తక్కువ ఆశించే పంటలైన జొన్న,సోయాచిక్కుడు,నువ్వులు,మినుము,ఉలవ,మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
- కాయ తొలుచు పురుగును తట్టుకునే ఐ.సి.పి.332,యల్.ఆర్.జి41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల ఎల్.ఆర్.జి.30,ఎల్.ఆర్.జి.38 కంది రకాలను సాగు చేసుకోవాలి.
- పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్దావరాలను ఏర్పాటు చేయాలి.
- పురుగు గ్రుడ్లను,తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5% వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారి చేయాలి.
- రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు.
- పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు తొలి పూతదశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. పూత లేదా కాయదశలో క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ మందులు వాడిన తర్వాత కూడా కాయ తొలుచు పురుగును నివారించలేక పోతే స్పైనోసాడ్ 0.3మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మారుకా మచ్చల పురుగు:
దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1గ్రా. లేదా ధయోడికార్బ్ 1గ్రా. తో పాటు డైక్లోరోవాస్ 1మి.లీ. లేదా లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారము రోజులకొకసారి పిచికారి చేయాలి.
Leave Your Comments