March Month Horticultural Crops – పండ్ల తోటలు: మామిడిలో పిందెలు బఠాని నుండి నిమ్మకాయ సైజు మధ్య ఉన్నప్పుడు 25-30 రోజులకొకసారి తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్లయితే పిందె రాలుట నివారించవచ్చును. 1% యూరియాను (10 గ్రా. యూరియాను G లీటరు నీటిలో కలిపి) పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఒకసారి మరలా 20 రోజుల తరువాత 2వ సారి పిచికారి చేసి పిందె రాలటాన్ని నివారించుకోవచ్చు లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మామిడి పిందెలు గోళీసైజులో ఉన్నప్పుడు లేక కాయపుచ్చు పురుగులు వలస వెళ్ళే సమయంలో డైక్లోరోవాస్ 1.5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా వేపనూనె 3 మి.లీ. G క్లోరిపైరిఫాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారి చేయాలి. వేప గింజల కషాయం (5%) ప్రతి 10 రోజులకొకసారి ఏప్రిల్-మే నెల వరకు అనగా మామిడి పండ్ల కోతకు 15 రోజుల ముందు వరకు పిచికారి చేయాలి.
జామలో నీటి తడులు ఆపాలి. తోటలో రాలి పడిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి.
అరటికి అవసరాన్ని బట్టి నీటి తడులు సక్రమంగా ఇవ్వాలి. తొండంపై ఎండ పడి పాడవకుండా ఎండు అరటి చెత్తతో కప్పాలి. ప్రతి 3-4 రోజులకొకసారి నీటి తడులు తప్పని సరిగా ఇవ్వాలి.
చీనీ, నిమ్మ తోటలలో సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారి చేయాలి. వేసవి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. పిందెరాలుడు నివారణకు 2,4-డి 1గ్రా. 100 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
సీతాఫలం లో ఎండిపోయిన కొమ్మలను కత్తిరించడం వలన చెట్లు చిగురించి పూతకు వస్తాయి.
సపోటాలో కలుపు లేకుండా శుభ్రత పాటించాలి.
ద్రాక్ష పండ్ల నాణ్యతను పెంచేందుకు నీటి తడులు తగ్గించాలి. పండ్లలో రంగు మరియు పక్వత రావడానికి ఇథెరెల్‌ను సిఫార్సు మేరకు వాడాలి. దానిమ్మలో కాయ కోత సమయం.
బొప్పాయి పంట రెండు నెలల వయస్సులో సూక్ష్మపోషకాలైన జింక్ సల్ఫేట్ 2 గ్రా. G 1 గ్రా. బోరాక్స్ కలిపి పిచికారి చేయాలి.
పుచ్చ/దోసలో తామర పురుగు ఉనికి తెలుసుకోవడానికి నీలి రంగు జిగురు అట్టలను అమర్చాలి. ఉధృతి ఉన్నట్లయితే నివారణకు ఫిప్రోనిల్ 5 ఎస్.సి.ని 2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 45 ఎస్.సి.ని 0.35 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కాయతొలుచు పురుగులు ఆశించినప్పుడు ఏమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.సి.0.5 గ్రా. లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ. లేదానోవాల్యురాన్ 10 ఇ.సి.ని ఒక మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పనసకి అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి.
Also Read: Useful Agricultural Tools: వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లు.!
కూరగాయ పంటలు :
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలి. మొక్క బాగా పెరగడానికి పొటాషియం నైట్రేట్ 5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, పుచ్చ పంటలలో కాయ పగుళ్ళు నివారణకు 3 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటి నివారణకు ముందు జాగ్రత్తగా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
వేసవి ఉల్లిలో కలుపు తీసి, నీటి తడులు 10-15 రోజులకు ఒకసారి అందించాలి. రసంపీల్చు పురుగుల కొరకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. నీటి ఎద్దడి నివారణకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలి.
పెండలం పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆకులు పండి ఎండిపోతాయి. తయారైన పంటను దుంపలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా త్రవ్వాలి. త్రవ్విన దుంపలను 2-3 నెలల వరకు నిలువ చేసుకోవచ్చు. విత్తన దుంపలను త్రవ్విన 4-5 రోజులలోగా కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. G స్ట్రెప్టోమైసిన్ సల్ఫేటు 1 గ్రా. 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంతో దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారి చేసి నీడలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేసినట్లయితే వాటిని తరువాత పంట కొరకు విత్తనంగా వాడవచ్చు.
ముందుగా విత్తుకొన్న మునగ రకాలు ఈ నెలలో కాపుకు వస్తాయి.
పూల తోటలు :
మల్లెలో కలుపు తీసి పైపాటుగా ఎరువులను వేయాలి. మల్లెలో లేత మొగ్గలను తొలిచే పురుగును నివారించుటకై మలాథియాన్ లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కనకాంబరంలో వచ్చే పిండి పురుగు మరియు పొలుసు పురుగు నివారణకై 1 గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. డైమిథోయేట్ను పిచికారి చేయాలి.
Also Read: Murrah Buffaloes: తక్కువ వయసులోనే ముర్రా జాతి గేదెల్లో గర్భధారణ – సరికొత్త పరిశోధనలో వెల్లడి..!
తోట పంటలు:
కొబ్బరికి 10 రోజులకొకసారి నీరు పెట్టాలి. కొబ్బరితోటలలోను లేక కొబ్బరి చెట్టు చుట్టూ చేసిన పల్లెములలో జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను చల్లుకోవాలి. కొబ్బరిపై ఆశించు నల్లి, ఆకు తేలు, గానోడెర్మా తెగులు మరియు నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.
ఇరియోఫిడ్ నల్లి యాజమాన్యము: నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను, కాయలను ఏరి నాశనము చేయవలెను. వేపపిండి 5-10 కిలోలు/చెట్టుకు/సంవత్సరమునకు వేయవలెను. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడవలెను. సారవంతమైన భూములలో అరటి, కంద, కోకో, పసుపు లేక కూరగాయలు వంటి అంతరపంటలు పండిరచుట ద్వారా నల్లి తాకిడిని తగ్గించవచ్చును. వేప నూనె (అజాడిరక్టిన్’ 10000 పిపియమ్.) 5 మి.లీ./లీటరు నీరు చొప్పున కలిపి గెలలపై పిచికారి చేయవలెను (లేక) 10 మి.లీ. మందు G 10 మి.లీ. నీరు చెట్టుకు చొప్పున వేరు ద్వారా ఎక్కించవలెను. ఈ విధముగా ఒక సంవత్సరములో మూడు సార్లు పెట్టవలెను.
ఆకుతేలు యాజమాన్యము: దీపపు ఎర (200 వోల్టు బల్బు)ను 1 1/2 అడుగుల ఎత్తులో అమర్చి, క్రింద నీళ్ళతో ఉన్న ప్లాస్టిక్ తొట్టెల ద్వారా రెక్కల పురుగు ఉనికి గమనించి, వాటిని సమూలంగా నాశనం చేయాలి. కరెంటు సౌకర్యం లేని తోటలలో గ్యాస్ లైట్లు (నీటితో ఉన్న ప్లాస్టిక్ తొట్టెలో గ్యాస్ లైటు అమర్చాలి) అమర్చి, వాటిని రెండు రోజులకొకసారి స్థానం మార్చడం ద్వారా తల్లి పురుగులను నివారించాలి.
గానోడెర్మా తెగులు యాజమాన్యము : గానోడెర్మా తెగులు ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరము 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి. కొబ్బరి తోటలో ఏ ఒక్క చెట్టుపై గానోడెర్మా తెగులు లక్షణాలు కనిపించినా, ఆ తోటలోని అన్ని చెట్లకు పైన వివరించిన విధముగా చర్యలు చేపట్టవలయును.
నల్ల మచ్చ తెగులు యాజమాన్యము : కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగముపై ట్రైకోడెర్మా విరిడి పొడిని పేస్ట్ తయారుచేసి పూయవలెను (50 గ్రా. పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్ తయారగును). మొదటి మరియు రెండవ సంవత్సరం తమలపాకు తోటలలో ఫైటాఫ్తోరా నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమాన్ని పాదుల్లో పూర్తిగా ఒక మీటరుకు లీటరు చొప్పున తడిచే విధంగా పోయాలి. రెండవ సంవత్సరం తోటలలో ఆకులను ప్రతి నెలలో ఒకసారి కోయాలి. దానితో పాటుగా తీగలను దింపకం చేయాలి.
జీడిమామిడిలో కొమ్మ, పుష్ప గుచ్ఛాలను తొలిచే పురుగు, కాయ మరియు గింజతినే పురుగులు ఆశిస్తాయి. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మూడవ దఫాగా ప్రొఫెనోఫాస్ 1.0 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 15-20 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. దీనివల్ల జీడిపిక్కల రాలుడు తగ్గి కాయల సైజు పెరుగుతుంది.
కర్రపెండలం నాటిన 7-10 నెలలకు త్రవ్వకానికి వస్తుంది.
సుమారుగా డిసెంబరు నెలాఖరు నుండి మార్చి నెల వరకు పంట దిగుబడికి వస్తుంది. కొమ్మలను కోసిన తరువాత దుంప తీసి వెంటనే ఫ్యాక్టరీకి తరలించాలి. పంటకోసిన వెంటనే విత్తనపు కర్రగా ఎంపిక చేసిన కొమ్మలపై ముందుగా మాంకోజెబ్ (3గ్రా./లీటరు నీటికి) మరియు క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి) మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తరువాత విత్తన కర్రలను కట్టలుగా కట్టి 20-25 కర్రలు) చెట్ల నీడలో భూమికి నిటారుగా ఉండేలా దగ్గరగా గుట్టలుగా అమర్చి పైన ఎండు కొబ్బరి ఆకులతో లేదా తాటి ఆకులతో పూర్తిగా కప్పి జాగ్రత్తగా తొలకరి వరకూ నిల్వ ఉచుకోవాలి.
సుగంధద్రవ్య పంటలు :
మధ్యకాలిక పసుపు రకాల దుంపలను తీసి శుభ్రపరచి వండి, మార్కెటింగ్ చేసుకోవాలి. పసుపును ఆరబెట్టేటప్పుడు 2-3 అంగుళాల మందం ఉండేటట్లు చూసుకోవాలి. ఎండబెట్టిన పసుపును పాలిషింగ్ మరియు గ్రేడిరగ్ చేసుకొని నిలువ చేసుకోవాలి.
మిరపలో కోసిన కాయను 10-11 శాతం తేమ ఉండేలా ఎండబెట్టి పొడిగా ఉన్న గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. అల్లానికి వేసవి వర్షాల తదుపరి పొలాలు దున్నాలి. మెత్తగా వచ్చే వరకు దున్ని 1 మీ. వెడల్పుతో, సౌకర్యంగా ఉండేటంత పొడవు మరియు 25 సెం.మీ. ఎత్తైన మడులు తయారు చేసుకోవాలి. వర్షాకాలములో నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా పంపించాలి. హెక్టారుకి 30 టన్నుల పశువుల ఎరువుతో పాటు 310 కి. సూపర్ ఫాస్ఫేటు మరియు 40 కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను తయారు చేసిన మళ్ళలో వేసి బాగా
కలపాలి.
ఔషధ మరియు సుగంధ పంటలు :
కలబంద పంట కోతకు వచ్చు సమయం, ముదిరిన ఆకులు మాత్రమే కోయాలి. ప్రతీ మూడు నెలలకు ఒక కోత తీసుకోవచ్చును. 4-5 సంవత్సరాల వరకూ పంట ఉంచుకోవచ్చు.
సిట్రోనెల్లలో కోతలు కొనసాగించాలి.
నిమ్మగడ్డి మొక్క పెరుగుదలను బట్టి పంట కోసుకోవాలి. కోత అనంతరం ఎరువులు వేసి, నీరు పెట్టుకోవాలి. పంట కోత అయిన తరువాత కలుపు లేకుండా చూసుకోవాలి.
అశ్వగంధ పంట వేర్లను నీటితో శుభ్రంగా కడిగి 7-10 సెం.మీ. పొడవు గల ముక్కలుగా కత్తిరించి నీడలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత ప్రక్కన ఉన్న పిల్ల వేర్లను మరియు వేరు పైభాగాన ఉన్న కాండం మొదలును కత్తిరించాలి. ఎండిన వేర్లను పౌడరుగా చేసుకొని మార్కెట్ చేసుకోవాలి. 7 సెం.మీ. పొడవు కన్నా ఎక్కువ ఉండి 11.50 సెం.మీ. మందంగా, గుండ్రంగా ఉన్న వేర్లను ‘‘ఎ’’ గ్రేడ్ క్రింద వేయాలి. పొలం బాగా దున్నుకొని ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ వేసుకోవాలి.
పిప్పలి : 3-4 సంవత్సరాల పాటు పంట తీసుకోవచ్చును. 4వ సంవత్సరం పంట తరువాత పీకివేసి కొత్తగా నాటుకోవాలి. ఇలా చేయగా వచ్చిన వేర్లను పిప్పలి మోడిగా అమ్ముకుని, కొమ్మలను ప్రవర్ధనం కొరకు వాడుకోవచ్చు.
Also Read: Organic Farming Precautions:సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు.