Tomato Cultivation Varieties: తెలుగు రాష్ట్రాల్లో టమాట సుమారుగా 4,77,447 ఎకరాల్లో సాగు చేయబడుతూ 65,16, 184 టన్నుల దిగుబడినిస్తుంది. టమాట పంటను సంవత్సరం పొడువునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం మరియు వడగాల్పుల వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలు అందుబాటులో లేకపోవటం, చీడపీడల ఉదృతి కూడా అధికంగా ఉండటం వలన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటమే కాకుండా పెట్టుబడి వ్యయం అధికమవుతుంది. కావున రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకొని సాగుకు అనువైన రకాలు ఎంచుకోవడం వలన మంచి రాబడి మరియు అధిక దిగుబడులను పొందవచ్చును.
సాగుకు అనువైన రకాలు:
పూసా రూబీ: ఈ రకం నాటిన 60-65 రోజులకే కోతకు వస్తుంది. పండ్ల పరిమాణం మధ్యస్థంగా వుండి లోతైన గాళ్ళు కలిగివుంటాయి. దీని మొత్తం పంటకాలం 130-135 రోజులు. మరియు ఇది ఎకరాకు 12 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
పూసా ఎర్లీడ్వార్ఫ్: దీని పంట కాలం 120-130 రోజుల్లో పూర్తవుతుంది. మరియు నాటిన 60 రోజుల లోపే కాపునిస్తుంది. పండ్ల పరిమాణం పూసారూబీ కన్న పెద్దగా వుండి తేలికపాటి ఎరుపు రంగు కల్గి ఉంటుంది. వర్షాకాలం మరియు వేసవిలో ముందుగా నాటుకొనేందుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 12 టన్నులు వరకు వస్తుంది.
పి.కె.యం.-1 : ఈ రకం అన్ని కాలాలలో సాగుచేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్కలు చిన్నవిగా ఉండుట వలన ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటవచ్చును. దీని కాలపరిమితి 130-135 రోజులు. ఇది ఎకరాకు 10-12 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
మారుతమ్: పండ్లు గుండ్రంగా, మధ్యస్థంగా వుంటాయి. ఇది వేసవి కాలానికి అనుకూలమైన రకం. పంటకాలం 135-140 రోజులు. ఎకరానికి 12-14 టన్నుల దిగుబడినిస్తుంది.
అర్క వికాస్: ఈ రకం వేసవి పంటకు అనుకూలం. పండ్ల పరిమాణం పెద్దగా, గుండ్రంగా చదునుగా ఉంటుంది. ఇది తాజా కాయకూరగా వాడుటకు అనుకూలమైనది. దీని పంటకాలం 105-110 రోజుల వరకు ఉంటుంది. మరియు ఎకరానికి 14.5-16 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
Also Read: వివిధ పంటలలో కలుపు యాజమాన్య పద్ధతులు.!
అర్క సౌరభ్ : పండ్ల పరిమాణం పెద్దగా, గుండ్రంగా ఉంటుంది. ప్రాసెసింగ్ కు మరియు కాయగూరగా అనుకూలం. దీని పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 14 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
పూసా హైబ్రిడ్ 4 ; ఈ రకం నులిపురుగులను తట్టుకునే శక్తి కలిగి ఎకరాకు 10 నుండి 14 టన్నుల దిగుబడినిస్తుంది.
పూసా సదా బహార్ ; ఈ రకం 8 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న వాతావరణంలో పెరగటానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 10 నుండి 14 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
అర్క మేఘాలి: ఇది వర్షాధార పంటగా వేయటానికి అనుకూలమైన రకం. మొత్తం పంటకాలం 130 రోజుల్లో పూర్తవుతుంది. ఎకరానికి 7-8 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
అర్క అలోక్: ఈ రకం వడలు తెగులును తట్టుకునే శక్తి కలిగి వుంటుంది. తాజా కూరగాయగా అనుకూలం. ఎకరానికి 18 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
అర్క రక్షక్: ఇది ఆకుముడత వైరస్, ఆకుమాడు తెగులు, మరియు వడల తెగులును తట్టుకునే శక్తి కలిగిన ఉత్తమమైన రకం. పండ్లు లోతైన ఎరుపు రంగు కలిగి మధ్యస్థంగా వుంటాయి. పంటకాలం 140 రోజుల వరకు ఉంటుంది. ఎకరానికి ౩౦ టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది.
వేసవి పంటకు అనుకూలమైన రకాలు : మారుతమ్, పికెయమ్-1, అర్క వికాస్, అర్క సౌరభ్.
సంకర జాతి రకాలు : అర్క రక్షక్, అర్క సామ్రాట్, అర్క వర్ధన్, అర్క విశాల్, అర్క అభేద్, రూపాలి, రష్మి, నవీన్, మీనాక్షి, అవినాష్-2, బిఎస్ఎస్-20, అన్నపూర్ణ, యుఎస్-618, సిరి, లక్ష్మి, యు.ఎస్.-440, అభిలాష్, శుభం, ప్రభవ్.
ప్రాసెసింగ్ కి అనుకూలమైన రకాలు: అర్క రక్షక్, అర్క రోషిణి, అర్క రేష్మి, అభినవ్.
తీగరకాల; అర్క సొరబ్, ఆర్క వికాస్, పూసా రూబీ, పూసా ఉపహల్, పంత్ మహల్, పూసా దివ్య ఇవి తీగరకాలు.
పొదరకాలు ; పూసా ఎర్లీ డ్వార్ష్, పూసా గ్రారావ్, పూసా సాదబాహర్, రత్న రూపాలు, అవినాష్ 2, కో3, హిస్సార్ లలిమ, రజని, రోమా మొదలైనవి పొద రకాలు.
Also Read:రైతుల పరిజ్ఞాన సాధికారత దిశగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యయసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు.!