Rooftop Tomato Farming: టమాటా ధరలు సెంచరీ కొట్టాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో టమాటా రూ.150 అమ్ముతున్నారు. టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో, ఇంటి పైకప్పులపై టమోటా సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కేవలం వ్యవసాయ భూముల్లో కాదు. ఇంటి పెరట్లో, కొద్దిపాటీ ఖాళీ స్థలంలో, ఇంటి పైకప్పుపై గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టమాట సాగు చేయవచ్చు. ఇంటి అవసరాలకే కాదు… ఎక్కువ దిగుబడులు సాధించి కొంత ఆదాయం కూడా తీసుకోవచ్చు.
ఇంటిపైకప్పు సేద్యం
ఇంటి పైకప్పుపై కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించడం అనాదిగా వస్తూనే ఉంది. తీగజాతి మొక్కలను ఇంటి గోడల వెంట నాటి, వాటిని మిద్దె పైకి పాకించడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. పెరిగిపోతున్న జనాభాకు తోడు, నగరీకరణ వేగం పుంజుకోవడంతో సాగు భూమి తగ్గిపోతుంది. అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగు విధానాలు కూడా మారాల్సి ఉంది. మిద్దె సేద్యం ద్వారా ప్రతి ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి పండ్ల మొక్కలు కూడా పెంచుకుంటూ దిగుబడులు సాధిస్తున్నారు.
Also Read: Poultry Management: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!
తీగజాతి టమాటా తో అధిక దిగుబడులు
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. టమాటా పంటను పూర్వం పొలంలో సాగు చేసేవారు. సంకరజాతి వంగడాలు, తీగలా పాకే టమాటా రకాలు అందుబాటులోకి రావడంతో సాగు విధానంలో సమూల మార్పులు వచ్చాయి. ఎకరా తీగజాతి టమాట ద్వారా 150 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నాయి. ఇంటి పై కప్పుపై పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టన్నుల కొద్దీ టమాటోలు పండించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, వారాంతంలో మొక్కలను పెంచుతూ సేదతీరాలనుకుంటున్న వారికి మిద్దె సేద్యం మంచి అవకాశం అనే చెప్పాలి.
టమాటో విత్తనాలు నేరుగా విత్తుకోవచ్చు
టమాట సాగు కుండీలతో పాటు, డాబాలపై కూడా సాగు చేసుకోవచ్చు. గ్రీన్ హౌస్, పాలీ హౌస్ లేకుండా కూడా నీడ పట్టున సాగు చేయవచ్చు. వేసవి కాలం అయితే గ్రీన్ హౌస్ తప్పనిసరి, మిగతా సీజన్లలో టమాటో సాగుకు ఎలాంటి షేడ్ అవసరం లేదు. వెయ్యి అడుగుల మిద్దె ఉంటే ఏటా 5 వేల కిలోల టమాటా దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టమాటో విత్తనాలను నేరుగా కుండీల్లో నాటుకోవచ్చు. లేదా చిన్నపాటి నర్సరీలో 25 రోజుల పాటు టమాటా నారు పెంచుకుని కావాల్సిన చోట నాటుకోవచ్చు. ఈ పంటకు చీడపీడలు కూడా తక్కువే. మిద్దెపై సాగుచేసుకునేవారు సేంద్రీయ విధానాలు అవలంభించి అధిక దిగుబడి తీయవచ్చు. ఇంటిపై కప్పుపై టమాట సాగుతో కొందరు లక్షలు ఆర్జిస్తున్నారు. టమాట ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ఇంటి పైకప్పు కూడా సిరులు కురిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read: Tomato Staking Method:స్టేకింగ్ పద్దతిలో టమాటా సాగు ఎలా చేయాలి.. ?