మూస పద్ధతిని వీడి ఆధునిక పద్ధతులను అవలంభించి కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చు. పాతపద్ధతిలో టమాట సాగు చేస్తే మొక్కలు నేలపై పరచుకోవడంతో కాయలు నేలపైవాలి, నీటిలో తరచుగా తడవడంతో ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చేతికందే టమాట దెబ్బతినకుండా ఉండేందుకు స్టేకింగ్ పద్ధతిని ఎంచుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఆయిలాపూర్ గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్ రెడ్డి, ఈ పద్ధతిలో టమాట సాగు చేస్తూ మెరుగైన దిగుబడులతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
సాగు విధానం:
స్టేకింగ్ విధానం అంటే ముందుగా బోజా పద్ధతిలో మొక్కలను నాటాలి. మొక్కల వరుసల నడుమ మీటరు దూరం ఉండేలా చూడాలి. టమాట మొక్కల వరుసల మధ్యలో 3 మీటర్ల దూరం చొప్పున 7 అడుగుల ఎత్తున్న కర్రలను(కంకబొంగులు) పాతాలి. కర్రలను కలుపుతూ భూమి నుంచి 1.5 మీటర్ల ఎత్తులో గట్టి తీగను కట్టాలి. ఇలా కట్టిన తీగలకు మొక్కలు కింది నుంచి అల్లుకు నేలా జనపనార తీగలు వేలాడదీయాలి. ఈ జనపనార తీగలకు టమాట మొక్కలు అల్లుకుంటూ సుమారు మీటరు, 1.5 మీటర్ల ఎత్తు వరకు తీగలు వ్యాపిస్తాయి. మొక్కలు ఎక్కువగా వ్యాప్తి చెందటంతో కాత ఎక్కువగా వస్తుంది. మొక్కలు తీగలకు అల్లుకుని ఉండటంతో కాయలు నాణ్యమైన వర్ణాన్ని సంతరించుకుంటాయి. టమాట నేలపై వాలకుండా.. నీటిలో తడవకుండా పైకి వేలాడి ఉండటంతో పూత బాగా వస్తుంది. సాధారణ రకంతో పోలిస్తే ఈ పద్ధతిలో కాత మూడింతల దిగుబడి అధికంగా వస్తుంది. సాహో రకం సాగు చేయడంతో వేసవిలో ఎండ వేడిమిని తట్టుకుని కాత కాస్తుంది. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే రెండు నెలల వరకు మాత్రమే కాత చేతి కందగా, స్టేకింగ్ పద్ధతిలో నాలుగు, ఐదు నెలల వరకు కాత చేతి కందుతుంది. లాభాలు రెండు, మూడింతలుగా వస్తాయి.
ఐదు గుంటల్లో ఈ పంటను సాగు చేసేందుకు విత్తనాలు, పురుగు మందులు, కూలీలు, కర్రలకు కలిపి రూ.8 వేల వరకు ఖర్చు వచ్చిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రోజు విడిచి రోజు 150 నుంచి 180 కిలోల దిగుబడి వస్తుందన్నారు.