ఉద్యానశోభ

మామిడి వ్యర్థాలతో ఎన్నో ఉపయోగాలు..

0

‘‘మామిడి’’ అన్ని పండ్లలోకి రారాజుగా గుర్తించబడింది. వేసవికాలంలో మాత్రమే లభించే పండ్లలో మామిడి ముఖ్యమైనది. ప్రపంచంలో, ముఖ్యంగా ఉష్ణమండల దేశాలలో వెయ్యి రకాల మామిడి పండ్లు అందుబాటులో వున్నాయి. వీటిలో కొన్ని మాత్రం వాణిజ్య ప్రమాణాలకు తగ్గట్టు పెంచడం జరుగుతుంది. పంట విస్తీర్ణం మరియు ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానం ఆక్రమించింది. భారతదేశంలో మామిడి వార్షిక ఉత్పత్తి 15.19 మిలియన్‌ టన్నులు. అందులో మన రాష్ట్రం ప్రధమ స్థానంలో వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా బంగినపల్లి, అల్ఫాన్సా, తోతాపురి మొదలగు రకాలు విరివిగా పండుతాయి. ఇవి చిత్తూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా పండుతాయి. మన రాష్ట్రంలో మామిడి పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్స్‌, అధికంగా చిత్తూరులో తరువాత కృష్ణా జిల్లాలో దాదాపు 100 వరకు వున్నాయి. ఈ మామిడి పండ్ల ప్రాసెసింగ్‌ ద్వారా మామిడి గుజ్జు (పల్ప్‌), రసం (జ్యూస్‌) మరియు తాండ్ర (లెదర్‌) తయారు చేసి మార్కెటింగ్‌ చేయుదురు. పచ్చి మామిడి కాయను పచ్చళ్ళు తయారుచేసేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా గ్రామస్థాయి కుటీర పరిశ్రమలు మొదలుకొని పండ్ల నుండి గుజ్జు తీసి వివిధ రూపాలలో విదేశాలకు ఎగుమతి చేసే భారీస్థాయి పరిశ్రమలు కూడా విరివిగా వున్నాయి. మామిడి పండ్ల పరిశ్రమ నుండి వచ్చే వ్యర్ధపదార్ధాలలో టెంక (స్టోన్‌), తొక్క (పీల్‌) మరియు పీచు (ఫైబర్‌) ముఖ్యమైనవి. అనేక మిలియన్‌ టన్నుల మామిడి వ్యర్ధాలు కర్మాగారాల నుండి ఏటా ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యర్ధాలలో 8.10 శాతం మాత్రమే బై ప్రొడక్ట్స్‌గా వినియోగిస్తున్నారు. మిగిలిన 90 నుండి 92 శాతంను ఏ విధంగానూ ఉపయోగించకపోవడం వలన భూమిలో అవి క్రుళ్ళినపుడు విడుదలయ్యే అనేక రసాయనాలు వలన వాటిని పారవేసిన చోటే గాక ప్రక్క పొలాలోని నేల కూడా నిస్సారమైపోయి పంటను పండించుటకు అనుకూలంగా వుండడం లేదు. ఈ మామిడి వ్యర్ధాలలో నత్రజని మరియు భాస్వరంతో పాటు, అధిక నీటి శాతం ఉన్న కారణంగా, సూక్ష్మజీవులచే మార్పుకు గురై విషరసాయనాలు ఉత్పత్తి మరియు వాయు ఉద్గారా వంటి సమస్యకు కారణమవుతున్నాయి. మామిడి వ్యర్ధాలను తరలించడం, మామిడి పండ్ల పరిశ్రమ వ్యవస్థాపలకు ప్రధాన సమస్యగా మారుతుంది. పర్యావరణ మరియు ఆహార భద్రత దృష్యా, మామిడి వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించడం మరియు సురక్షితమైన వాతావరణం కల్పించడం చాలా ముఖ్యం. ఈ వ్యర్థాల నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చును. ఇందులో టెంకె లోపలి జీడి నుండి కెర్నల్‌ ఆయిల్‌, స్టార్చ్‌, పెక్టిన్‌, ఫైబర్‌ మరియు బయోపాలిమర్‌ ముఖ్యమైనవి.
మామిడి తొక్క: మామిడి ప్రాసెసింగ్‌ సమయంలో, పై తొక్క సుమారు 7.24% వరకు వుంటుంది. ప్రస్తుతం దీనిని వ్యర్ధంగా పరిగణింపబడుతుంది. దీని మూలంగా కాలుష్యం పెరుగుతుంది. మామిడి తొక్కలో ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌, కెరోటినాయిడ్లు, ఎంజైము, విటమిన్‌ ‘‘ఇ’’ మరియు విటమిన్‌ ‘‘సి’’ వంటి విలువైన సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా క్రియాత్మక మరియు యాంటీఆక్సీడెంట్‌ లక్షణాలను కలిగి ఉన్నాయి. మామిడి తొక్కలో ఫైబర్‌, సెల్యులోజ్, హెమిస్యొలోజ్‌, లిపిడ్లు, ప్రొటీన్లు మరియు పెక్టిన్‌ అధికంగా ఉన్నాయి. పొటాషియం, రాగి, జింక్‌, మాంగనీస్‌, ఇనుము మరియు సెలీనియం మొదలైనవి మామిడి తొక్కలో లభించే కొన్ని ముఖ్య ఖనిజాలు. ఈ విలువైన సమ్మేళనాలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మామిడి తొక్కను వివిధ ఆహార పదార్ధాల అనువర్తనాల కోసం విలువైన పదార్ధాలను (ఉత్పత్తికి అనగా, డైటరీ ఫైబర్‌ మరియు పాలీఫినాల్స్‌) ఉపయోగించవచ్చు. మామిడి తొక్క పిండిని నూడుల్స్‌, బ్రెడ్‌, స్పాంజి కేకు, బిస్కెట్లు, మాకరోనీ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులు వంటి అనేక ఆహార పదార్ధాల ఉత్పత్తులలో క్రియాత్మక పదార్ధంగా ఉపయోగిస్తారు.
పెక్టిన్‌: మామిడి తొక్కద్వారా తయారుచేసిన పెక్టిన్‌ను ఫుడ్‌ ప్రాసెసర్లు విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తక్కువ గ్రేడ్‌ పండ్లను మంచి నాణ్యమైన ఉత్పత్తులుగా మార్చడానికి, పోషణ, సౌందర్య మరియు ఔషధ తయారీలో క్రియాత్మక పదార్ధంగా వాడతారు. ఈ పిండిని బయోడిగ్రేడబుల్‌ మరియు నీటిలో కరిగే ఫిల్మ్‌, బల్కింగ్‌ ఏజెంట్లు, కోటింగ్‌ ఏజెంట్లు, చిలేటర్‌, ఎమల్సిఫైయర్లు గాను మరియు స్నిగ్ధత మార్పిడు కొరకు దీనిని వాడతారు. మామిడి తొక్క నుండి సేకరించిన కరిగే మరియు కరగని పెక్టిన్‌ రెండింటిలోనూ తటస్థ చక్కెరలో ఎక్కువ భాగం అరబినోస్‌ (11.6 శాతం), గెలాక్టోస్‌ (4.97 శాతం), మరియు గ్లూకోజ్‌ (1.28 శాతం) వుండును. మామిడి తొక్కలోని పెక్టిన్‌, ఆపిల్‌ తొక్కలో ఉన్నవాటి కంటే 23% అధికంగా జెల్లింగ్‌ శక్తిని కలిగి ఉంటుంది మరియు జెల్‌ ఏర్పడుటకు సగటున 36 సెకన్ల సమయపడుతుంది. మామిడి తొక్కలో అధిక పెక్టిన్‌ వున్నందున మంచి చిక్కదనం కలిగి జెల్లింగ్‌ మరియు ఎమల్సిఫైయింగ్‌ క్షణాలుగా మార్మలాడ్లు, సోడాలు, పాలు మరియు మాంసం ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. మామిడి తొక్క పొడిని బేకరీ ఉత్పత్తులు (రొట్టె, కుకీలు, కేకు), ఐస్‌క్రీం, తృణధాన్యాలు, పాస్తా ఉత్పత్తులు (మాకరోనీ), పానీయాలు (ఇన్‌స్టెంట్‌ పొడు), స్నాక్స్‌ వంటి ఎక్సట్రూడెడ్‌ మరియు మాంసం ఉత్పత్తులలో ఉపయోగించవచ్చు. అదేవిధంగా, మామిడి తొక్కపొడిని క్రీమ్‌, జున్ను మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులలో కొవ్వు పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
మామిడి టెంక: మామిడి తొక్క మాదిరిగా, మామిడి టెంకను కూడా వ్యర్ధాలుగానే పరిగణిస్తారు. పారిశ్రామిక ప్రొసెసింగ్‌ సమయంలో మామిడిపండు రకాన్ని బట్టి టెంకలొ 45.85% వరకు వుంటుంది. మామిడి టెంక విస్తృత శ్రేణి జీవరసాయనిక సమ్మేళనాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మూలం అని అధ్యయనాలు వెల్లడించాయి. మామిడి జీడి పిండిని శిశువుకు మరియు పెద్ద ఆహారంలో పోషక అవసరాలను పెంచడానికి ప్రధాన పదార్ధంగా ఉపయోగిస్తారు. మామిడి జీడి పిండిని గోధుమ పిండిలో కలిపినప్పుడు, ప్రోటీన్‌, కొవ్వు మరియు ఫినోలిక్‌ విలువ అవసరాన్ని సమతుల్యం చేస్తుంది మరియు బిస్కెట్ల తయారీకి ముడి పదార్ధంగా ఉపయోగించబడుతుంది. మెరుగైన యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు మరియు మంచి రుచి కలిగిన బిస్కెట్లను 40% వరకు మామిడి జీడి పిండికి జోడించడం ద్వారా తయారు చేయవచ్చును. మామిడి టెంక చూర్ణంలోని యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ రకాల క్యాన్సర్లను నివారించడానికి సహాయపడుతుంది మరియు వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మామిడి చూర్ణం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటిచూపును మెరుగు పరుస్తుంది.
మామిడి నూనె: మామిడి టెంక నుండి తీయగా మరో విలువైన ఉత్పత్తి లేత పసుపు రంగులో ఉండే నూనె. ఇది అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉన్న అనేక ఇతర కూరగాయల నూనె కంటే స్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది. మామిడి టెంకలో 71.15% ముడి కొవ్వు ఉంటాయి. ఇది తినదగిన కొవ్వు యొక్క మంచి, సురక్షితమైన మరియు సహజ వనరులు. ఇందులో ట్రాన్స్‌ఫ్యాటీ ఆమ్లాలు ఉండవు. మామిడి టెంక నూనెలోని ప్రధాన సంతృప్త కొవ్వు ఆమ్లాలు స్టెరిక్‌ మరియు పాల్మిటిక్‌ ఆమ్లాలు, మరియు ప్రధాన అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఓలిక్‌ మరియు లినోయిక్‌ ఆమ్లాలు. మామిడి టెంక నూనెలోని ‘‘ఓలిక్‌’’ అసంతృప్త కొవ్వు ఆమ్లం, తక్కువ సాంద్రత కొవ్వు (ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌) వంటి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడానికి మరియు మన శరీరంలో అధిక సాంద్రత కొవ్వు (హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌) వంటి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచడానికి మరియు కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు ఋజువు చేశాయి. కొవ్వు మరియు నూనె సంరక్షణ కొరకు, మామిడి టెంక నూనెలో గల స్టెరిక్‌ ఆమ్లం సంతృప్త కొవ్వు ఆమ్లం మిశ్రమాను బంధించడానికి మరియు ప్లాస్టిసైజ్‌ చేయడానికి బాధ్యత వహిస్తుంది. కూరగాయ నూనెతో మామిడి కెర్నల్‌ నూనె కలిపినప్పుడు, వాటి ఆక్సీకరణ స్థిరత్వం మెరుగు పడుతుంది. కోకో వెన్న అత్యంత ఖరీదైన కూరగాయల నూనెలో ఒకటి. ఇందులో ప్రధానంగా పాల్మిటిక్‌ ఆమ్లం, స్టెరిక్‌ ఆమ్లం మరియు ఒలేయిక్‌ ఆమ్లం అలాగే లౌరిక్‌ ఆమ్లం మరియు మిరిస్టిక్‌ ఆమ్లం ఉన్నాయి. అందువల్ల కోకో వెన్న మాదిరిగానే రసాయన మరియు భౌతిక లక్షణాలను కలిగి ఉన్న చౌకైన ప్రత్యామ్నాయ కూరగాయల నూనె కోసం పరిశ్రమలు ప్రయత్నిస్తున్నాయి. మామిడి కెర్నల్‌ నూనెను పామాయిల్‌తో సరైన నిష్పత్తితో కలిపినప్పుడు, ఆ మిశ్రమాన్ని కోకో వెన్నగా ఉపయోగించవచ్చు. మామిడి టెంకె నూనెలో ఉన్న యాక్టివ్‌ ఏజెంట్‌ మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని వివిధ అధ్యయనాలలో నిరూపించబడింది. ఇది మన రక్త ప్రవాహంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడానికి చాలా ఉపయోగకరంగా ఉండి తద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఈ నూనె గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ, అంటే ఈ నూనెలను తమ రోజువారీ ఆహారంలో రోజూ ఎటువంటి భయం లేకుండా చేర్చవచ్చు. సాధారణంగా మామిడి టెంకె నూనె గది ఉష్ణోగ్రత వద్ద సెమీ సాలిడ్‌గా వుంటుంది. ఈ నూనె మన చర్మానికి చాలా మంచిది మరియు సన్‌ కేర్‌ బామ్స్‌, బేబీ క్రీమ్స్‌ మరియు మాయిశ్చరైజింగ్‌ ప్రొడక్ట్స్‌లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించబడుతుంది. కొవ్వొత్తు, సబ్బు తయారీలో, బిస్కెట్లు వంటి బేకరీ ఉత్పత్తులలో కోకో బటర్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. మామిడి టెంకె నూనె అనేక సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ వలె పనిచేయడంతో పాటుగా ఎండకు కాలిన, రంగు మారిన చర్మాన్ని నయం చేసే లక్షణాలను కలిగి ఉంది. మామిడి టెంకె నూనెను ఉపయోగించడం వన చర్మం పై సాగిన గుర్తు ఏర్పడకుండా ఉండటమే కాకుండా విస్తరించిన గుర్తును కూడా తొలగిపోతాయి. చర్మం పైన పగుళ్ళు ఒక తీవ్రమైన సమస్య. పగుళ్ళ పైన మామిడి టెంకె నూనె వాడటం వలన త్వరగా కోలుకుంటుంది. దీనిని డెర్మటైటిస్‌కు నివారణగా కూడా ఉపయోగించవచ్చు. మామిడి టెంకె నూనె యొక్క కొవ్వు ఆమ్లం మరియు ట్రైగ్లిజరైడ్‌ కూర్పుతో షేవింగ్‌ క్రీములో ఉపయోగిస్తారు.
బయోపాలిమర్స్‌: తక్కువ ఖర్చుతో కూడిన పెట్రోకెమికల్‌ ఆధారిత పాలిమర్లు ఆహార ప్యాకేజింగ్‌లో విస్తృతంగా ఉపయోగించబడుచున్నాయి. కానీ ఈ ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ భూమిలో విచ్చిన్నం కాకపోవడం వలన ప్రధాన పర్యావరణ సమస్యగా ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో సహజ జీవవనరుల నుండి పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ పదార్థాలను తయారు చేయడంలో విస్తృతమైన పరిశోధనలు జరుగుచున్నాయి. మొక్కజొన్న, బంగాళాదుంప, కర్రపెండలం, కంద మరియు బఠానీ వంటి అనేక సంప్రదాయ మరియు సాంప్రదాయేతర వనరుల నుండి స్టార్చ్‌ ఆధారిత బయోడిగ్రేడబుల్‌ ఫిల్మ్‌ లు తయారు చేయబడుచున్నాయి. మామిడి టెంకె లోపలి జీడిలో అధిక పిండి పదార్థం ఉంటుంది కాబట్టి ఇది ‘‘బయోప్లాస్టిక్‌’’ తయారీలో ప్రత్యామ్నాయ పదార్ధంగా ఉంటుంది.
స్టార్చ్‌: మామిడి జీడిలో సుమారు 58% స్టార్చ్‌ (పిండి పదార్ధం) వుంటుంది. మామిడి జీడి నుంచి తీసిన స్టార్చ్‌, మొక్కజొన్న, గోధుమ, బియ్యం మరియు బంగాళాదుంప నుండి వచ్చే స్టార్చ్‌లో ఉన్న లక్షణాలతో సరిపోల్చబడినది. ముఖ్యంగా ఫుడ్డింగ్‌, కస్టర్డ్‌, సూప్‌, సాస్‌, గ్రేమీ, సలాడ్‌ డ్రెస్సింగ్‌, నూడుల్స్‌ మరియు పాస్తా వంటి ప్రాసెస్‌ చేసిన ఆహారాల తయారీలో చిక్కబడుటకు మరియు స్టెబిలైజర్‌గా ఈ స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా తాజా మరియు పొడి సూప్‌ మిశ్రమంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
వెనిగర్‌: మామిడి పండ్లలో అధిక మోతాదులో నీరు మరియు పిండిపదార్థాలు ఉన్న కారణంగా రవాణా సమయంలో మరియు నిల్వకాలంలో త్వరగా పాడైపోయ్యే అవకాశం ఎక్కువ. దీని కారణంగా కోత అనంతర నష్టం సుమారుగా 20.25% వుంటుంది. ముఖ్యంగా ఈ పండ్లలో చక్కెరను పులియబెట్టు ప్రక్రియలో వెనిగర్‌ను మరియు పండ్లరసాలతో తయారయ్యే ఆల్కహాల్ ను ఉత్పత్తి చేయవచ్చును. అయితే ద్రాక్షపళ్ళతో తయారయ్యే ఆల్కహాల్ ఆధిపత్యంలో వున్నకారణంగా, ఈ రకమైన ఆల్కహాల్ మార్కెట్లో ప్రాచుర్యం తక్కువనే చెప్పవచ్చును. ఏదేమైనా మామిడి పరిశ్రమ వ్యర్థాలను వదిలించుకోవడం ప్రధాన సమస్యగా పరిణమించిన ప్రస్తుత సమయంలో వాటి నుండి పైన పేర్కొన్న విలువైన ఉపఉత్పత్తులను వెలికి తీసినట్లయితే విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడినట్లగును.

                     వి. వాసుదేవ రావు, ఎస్‌.వి.ఎస్‌. గోపాస్వామి, డి. సందీప్‌ రాజా, బి.వి.ఎస్‌. ప్రసాద్‌ 
                                                    పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాజీ సెంటర్‌, బాపట్ల
Leave Your Comments

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏఐఎఫ్ రుణాల కోసం అధిక దరఖాస్తులు..

Previous article

పచ్చిరొట్ట పైర్లకు భారీ సబ్సిడీ..

Next article

You may also like