Monsoon Tomato Cultivation: నిత్యజీవితంలో రోజూ వాడే కూరగాయల్లో టమాటా ప్రధానమైనది. మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. తద్వారా సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్థానంలో టమాటా ఉంది. మన దేశ కూరగాయల బాస్కెట్ లో టమాటా ఉత్పత్తి శాతం 10.7%. మన రాష్ట్రంలో సుమారు 25591 హెక్టార్లలో టమాటా సాగు చేస్తూ 0.88 మిలియన్ హెక్టార్ల టమాటా ఉత్పత్తి చేస్తున్నాము. ఇది దేశ ఉత్పత్తిలో సుమారు 4.28%. వీటిలో ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాలు రంగారెడ్డి (24.8%), వికారాబాద్ (9.3%), సిద్దిపేట (8.5%), సంగారెడ్డి (6.7%) మరియు ఆదిలాబాద్ (4.5%).
ఈ పంటను సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. ఈ పంట అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతంను తట్టుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా వానాకాలం (ఖరీఫ్)లో కురుస్తున్న అధిక వర్షాల వలన మొక్క ఎదుగుదల క్షీణించడం మరియు పూత, పిందే రాలిపోవడం వలన దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. కావున సమయనుగుణంగా తగిన మెళకువలు పాటించినచో టమాటా లో నాణ్యమైన అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
నేలలు :
టమాటా పంట అన్ని రకాల నేలల్లో సాగుకు అనుకూలం. ఇసుకతో కూడిన నేలల నుండి బరువైన బంక నేలల్లో కూడా పంటను సాగు చేయవచ్చు. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు పనికి రావు. ఉదజని సూచిక 6.0-7.0 గల సారవంతమైన నేలలు చాలా అనుకూలం.
నాటే సమయం : వానాకాలం (ఖరీఫ్) లో జూన్ మొదటి పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
రకాలు : తొలకరిలో వేసుకోవడానికి అర్క మేఘాలి, పూసా ఎర్లీ ద్వార్ఫ్, అలాగే వానాకాలంలో ఆలస్యంగా వేసుకోవడానికి పూసా రూబీ, అర్క వికాస్ రకాలు అనుకూలం.
సంకరజాతి రకాలు :
అర్క వర్ణన్, అర్క వికాస్, రూపాలి, రష్మి, సాహో, యుఎస్-440, పిహెచెఎస్-448 వంటి రకాలు.
విత్తన మోతాదు : ఎకరాకు సూటి రకాలకు 200 గ్రా., సంకరజాతి రకాలకు 60-80 గ్రా. విత్తనం సరిపోతుంది.
విత్తన శుద్ధి : విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా. మెటాలాక్సిల్, 2 గంటల తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రసం పీల్చు పురుగుల బెడద తట్టుకునేందుకు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి తర్వాత శిలీంద్రనాశినితో శుద్ధి చేయాలి.
నారుమడి తయారీ : ఎకరా పొలంలో నాటుకోవడానికి 4 మీ. పొడవు, 1 మీ. వెడల్పు మరియు 15 సెం.మీ. ఎత్తు గల నారుమళ్ళను 8 నుండి 10 వరకు తయారు చేసుకోవాలి. సాధారణంగా రైతులు చదును మళ్ళను తయారు చేస్తారు. వీటిపై నారును పెంచడం వలన నారుకుళ్ళు ఎక్కువగా వచ్చి నారు చనిపోవడమేగాక, నారుమడంతా సమానంగా పెరగదు. అందువలన తప్పకుండా ఎత్తు మళ్ళను తయారు చేసుకోవాలి. నారుకుళ్ళు రాకుండా ముందు జాగ్రత్తగా 0.5 శాతం బోర్దో మిశ్రమం గాని, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా డైతేన్ ్గ-78 లేదా డైతేన్ వీ-45 2-3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని తడపాలి.
దీని కోసం 100 లీటర్ల మందు ద్రావణాన్ని 1 సెంటు నారుమడికి వాడాలి. నారుమడిలో 10 సెం.మీ. ఎడంతో వరసల్లో 1 నుండి 1.5 సెం. మీ. లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్‌తో నీటిని చల్లి పాలిథీన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమళ్ళను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే 7-10 రోజులకు మల్చింగ్‌గా వేసిన వరిగడ్డి లేదా పాలిథీన్ షీట్‌ను తీసి వేయాలి.
ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు నారును పెంచేందుకు ట్రేలను వాడుతున్నారు. వీటిని ప్రోట్రేలు అంటారు. ఈ ట్రే లలో కోకోపీట్ లేదా వర్మి కంపోస్ట్‌ను నింపి నారు పెంచుతారు. నారుమడి దశలో వచ్చే నారుకుళ్ళు తెగులు నివారణకు 1 టన్ను కోకోపీట్ కు 100 కిలోల వేప పిండి, 1 కిలో ట్రైకోడెర్మ విరిడి కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ట్రే లలో నింపాలి.
ఒక ట్రే లో 98 గుంతలు ఉంటాయి. ఒక ట్రే నింపుటకు 1.25 కిలోల మిశ్రమం అవసరమవుతుంది. ఈ విధంగా నింపిన ట్రే లలో ముందుగా విత్తనశుద్ధి చేసిన విత్తనాన్ని 0.5 సెం. మీ. లోతులో వేసి పై భాగాన కోకోపీట్ తో కప్పాలి. ఈ విధంగా విత్తిన ట్రేలను ఒక దాని పై ఒకటి (10 ట్రే లు) అమర్చి పాలిథీన్ షీట్‌తో కప్పాలి.
విత్తిన 3-6 రోజుల్లో విత్తనం మొలకెత్తడం ప్రారంభం అవగానే ట్రే లను వేరు చేయాలి. రోజ్ క్యాన్ లేదా పైపు తో ట్రే లను తడపాలి. నారుపోషణ కొరకు 19:19:19 మిశ్రమాన్ని 3 గ్రా. లీటరు నీటికి కలిపి విత్తిన 12, 20 రోజులకు పిచికారి చేయాలి. నారును అధిక వర్షం భారి నుండి కాపాడేందుకు అర్ధచంద్రాకారంలో అమర్చిన పైపుల పై పాలిథీన్ కవరు కప్పాలి.
ఈ రెండు పద్ధతులలో పెంచిన నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులు సోకకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు విత్తిన 20 రోజులకు కార్బోఫూరాన్ 3 జి గుళికలు ఒక సెంటుకు 100 గ్రా. చొప్పున వేసి నీరు పెట్టాలి.
నారును పీకడానికి లేదా పొలంలో నాటడానికి 2-3 రోజుల ముందు లీటరు నీటికి 2 మీ.లీ. డైమితోయేట్ లేదా 0.3 మీ.లీ. ఇమిడాక్లోప్రిడ్ కు 1 గ్రా. కార్బెండజిం కలిపి పిచికారీ చేయాలి. 21-25 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల ఆరోగ్యవంతమైన నారును నాటుకోవాలి.
నేల తయారీ : పొలాన్ని బాగా దున్ని చదును చేసుకోవాలి. దుక్కి సరిగా లేకపోతే ప్రధాన వేరు ముడుచుకు పోయి మొక్కలు చనిపోతాయి.
నాటడం : రెండు చాళ్ళ మధ్య 60 సెం. మీ. చాలులో మొక్కకి మొక్కకి మధ్య 45 సెం. మీ. ఉండేటట్లు నాటుకోవాలి. డ్రిప్ నీటి సదుపాయం ఉన్నట్లయితే జంట చాల్ల పద్ధతిలో నాటుకుంటే మంచిది. ప్రధాన వేరు ముడత పడేటట్లు నాటితే కాయ దశకు చేరుకోగానే పోషకాలు సరైన మోతాదులో తీసుకోలేక మొక్కలు ఎండిపోతాయి. కాబట్టి నాటేటప్పుడు ప్రధాన వేరు ముడత పడకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: రోజురోజుకు పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు.!
ఎరువులు : చివరి దుక్కిలో ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. పశువుల ఎరువుతో పాటుగా ట్రైకోడెర్మా విరిడిని కూడా ఎకరానికి 2 కిలోల చొప్పున భూమిలో వేసి కలియదున్నితే నేల నుండి సంక్రమించే కుళ్ళు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. చివరి దుక్కిలో ఎకరానికి 24 కిలోల భాస్వరం (150 కిలోల ఎస్ ఎస్ పి), 24 కిలోల పొటాష్ (40 కిలోల ఎం ఒ పి) ఇచ్చే ఎరువులను వేయాలి. 48-60 కిలోల నత్రజనిని (100-120 కిలోల యూరియ) మూడు సమ భాగాలుగా చేసి నాటిన 30,45,60 రోజులకు పై పాటుగా వేసి నీరు పెట్టాలి.
పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. చొప్పున యూరియా కలిపి పిచికారీ చేస్తే 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరానికి 8-12 కిలోల బోరాక్స్, 10 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. నాటిన 30,45 రోజులకు లీటరు నీటికి 5 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ పిచికారీ చేసి 20 శాతం దిగుబడి పెంచవచ్చు. పూత దశలో ప్లానొఫిక్స్ 4 లీటర్ల నీటికి 1 మీ. లీ. చొప్పున కలిపి పిచికారీ చేస్తే పూత, పిందె నిలిచి అధిక దిగుబడి వస్తుంది.
జీవన ఎరువులు : కొన్ని రకాల సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని (78%) స్థిరీకరించి, మొక్కలకు అందించి భూసారాన్ని పెంపొందిస్తాయి. జీవన ఎరువుల వాడకము వలన ఉత్పత్తి ఖర్చు తగ్గించడమే కాకుండ వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.
ప్రతి 100 కిలోల పశువుల ఎరువుకు 2 కిలోల అజటోబాక్టర్ కలిపి, దీనిలో నీళ్ళు చల్లుతూ 7-10 రోజుల వరకు బాగా కుళ్ళనిచ్చి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియాను పొలంలో చల్లుకోవాలి. జీవన ఎరువులు గాలిలోని నత్రజని తీసుకోవడం వల్ల నేల సారవంతమై మొక్కలకు ఉపయోగపడుతుంది. జీవన ఎరువులు వాడకం వల్ల 25% వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
కలుపు నివారణ : పెండిమిథాలిన్ అనే మందును తేలిక నేలలకు 1.0 లీ./ఎకరానికి మరియు బరువు నేలలకు 1.2 లీ./ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటల లోపు తడి నేల పై పిచికారీ చేయాలి. మెట్రిబుజిన్ అనే మందును 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 15 రోజులకు పిచికారీ చేయాలి. నాటిన 30-35 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేసి పొలంలో కలుపు లేకుండా చూడాలి. పొలంలో కలుపు ఉన్నట్లయితే వైరస్ తెగుల్లకు ఆవాసంగా మారి వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. దీని వలన పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. కావున పొలంలో మరియు పొలం గట్ల పైన కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి.
ఊతమివ్వడం (స్టేకింగ్) : టమాటాలో పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా కర్రలను పాతి ఊతం ఇవ్వాలి. ఊతమివ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. అంతేకాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. ఈ ఊతం ఏర్పరచడానికి వెదురు బొంగులు, సవక కర్రలు అవసరం. పొలంలో వరుసల వెంబడి సవక కర్రలను పాతి వెదురు బొంగులను ఈ కర్రలకు అడ్డంగా కట్టాలి. ఈ విధంగా కట్టిన వెదురు కర్రలను కొమ్మలకు ఊతంగా చేయాలి. ఈ ప్రక్రియ మొక్క 30-35 రోజుల వయసు నుంచి ప్రారంభించాలి. ఈ విధంగా ఊతమివ్వడం వలన కాయలు భూమికి తగలవు, కాయ పాడవదు. స్టేకింగ్ వలన మంచి గాలి, వెలుతురు తగిలి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
నీటి యాజమాన్యం : నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 7`10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. పూత, పిందె మరియు కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. బిందు సేద్యం ద్వారా సాగు చేసినచో టమాటా పంటలో 15-20 శాతం వరకు దిగుబడి పెంచవచ్చు.
పైన సూచించిన యాజమాన్య పద్ధతులతో పాటు సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టి టమాటలో అధిక దిగుబడి మరియు అధిక ఆదాయం పొందవచ్చు.
Also Read: 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం.!