ఉద్యానశోభ

క్లోనింగ్ విధానంలో తైవాన్ జామ..

0

మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. పండ్ల తోటల రైతులు ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలలో నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నారు. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలు అయ్యాయి. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువరైతు గత నాలుగేళ్లుగా తైవాన్ జామ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. ఏ తోట మొక్కలయిన మంచి జాతి మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. పంట దిగుబడి, నాణ్యత మొట్టమొదట లభించే మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. తొలి సంవత్సరంలో ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు తోట దిగుబడి, ఆదాయాలలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. శ్రేష్టమైన విత్తనాలు లభించక పోవడం, ఉత్తమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటలు ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు. ఇది దృష్టిలో పెట్టుకొని పండ్ల తోటలను సాగుచేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిసాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావాల్సిన రకాలను అభివృద్ధి చేసి మరీ అందిస్తున్నాయి. దీంతో రెండు, మూడు ఏళ్లకు రావలసిన దిగుబడులు ఏడాదికే వస్తున్నాయి. దీంతో రైతులు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి.
జామ మొక్కలనుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తున్నారు. మదీన క్లోనల్ నర్సరీ పేరుతో దీనిని నిర్వహిస్తున్నది సయ్యద్ గౌస్ మొయినుద్దీన్. 10,15 ఏళ్లుగా క్లోనింగ్ విధానంలో జామ మొక్కలను పెంచేవారు. అయితే మారుతున్న పంటల సాగు విధానంలో వీరు కూడా మొక్కల పెంపకాన్ని మార్చుకున్నారు. మార్కెట్ లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండటంతో నాలుగేళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో మొక్కల పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు 8 నెలల తోట నుండి లేత కొమ్మలను సేకరించి వాటిని కోకో పీట్ నింపిన ట్రేలలో నాటుతున్నారు. వేరు వ్యవస్థ వృద్ధి చెందేందుకు హీట్ ఛాంబర్ లో 30 రోజుల పాటు ఉంచుతారు. తరువాత అక్కడి నుండి 10 రోజుల పాటు షేడ్ నెట్ లో ఉంచి ఆ తరువాత 2 నెలల పాటు ఆరుబయట పెంపకం చేపడతారు. దీనితో మొక్క ప్రధాన పొలంలో నాటేందుకు తయారవుతుంది. ఒక్కో మొక్క నిర్వహణ రూ. 10 నుండి 12 అవుతుంది. రోజుకు కూలీలు 10 నుండి 20 మంది ఉంటారు. ఆడవారికి రోజుకి రూ. 200, మగవారికి రూ. 400 నుండి 500 వరకు ఉంటుంది. రైతుకు ఒక్కో మొక్కను రూ. 25 అమ్ముతున్నారు. ఏడాదికి 1 నుండి 2 లక్షల మొక్కలను అమ్మినా ఏడాదికి ఆదాయం రూ. 25 లక్షలు. పెట్టుబడి పోను ఏడాదికి నికర ఆదాయం రూ. 5 లక్షలు వస్తుంది.

Leave Your Comments

20కి పైగా జాతుల మామిడి పండ్లను ఇస్తున్న చెట్టు

Previous article

మునగ మొక్కల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతులు

Next article

You may also like