Colocasia Cultivation: దుంప జాతి పంట అయిన చామ దుంపకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఈ చామ దుంప పంటలో పిండి పదార్ధాలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు మిగతా దుంప జాతి పంటలతో పోలిస్తే అధికంగా ఉంటాయి.ఏ కూరగాయలు అయిన కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దీంతో రైతులు ధర అనుకూలంగా ఉన్నా, లేకపోయినా అమ్ముకోవాల్సి ఉంటుంది. దుంప పంటలైన కంద, చామ అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్ లో ధర అనుకూలతను బట్టి 4-6 వారాలు ఆలస్యంగా కూడా తవ్వుకోవచ్చు.
చామ దుంపకు చీడ పీడలు సమస్య కూడా తక్కువే. కాని నీటి అవసరం ఎక్కువ. ఏడాది మొత్తం చామ దుంపకు మార్కెట్ లో ధర స్థిరంగా ఉంటుంది.చామ దుంపలతో పాటు వాటి ఆకులు, కాడలలో కూడా అధిక పోషకాలు ఉంటాయి. ఆకులను సైతం కూరగా వినియోగిస్తారు.చామ దుంపను ఏడాదికి రెండు సీజన్ లలో సాగు చేస్తారు. వర్షా కాలంలో జూన్ – జూలై మాసాలు చామ దుంప విత్తుకోవడానికి అనుకూలం. చామ దుంప నుండి 6-8 నెలల పంట కాలంలో రకాన్ని బట్టి 10-15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు.
వాతావరణం:
తెలుగు రాష్ట్రాలు చామ దుంప సాగుకు అనుకూలం. వేడి వాతావరణం , నీటి సౌకర్యం తప్పనిసరి.
నేలలు:
ఉదజని సూచిక 5.5 – 7.0 ఉండి,నీటి వసతి కలిగి, మురుగు నీరు బయటకు పోవు సౌకర్యం కలిగిన నేలలు అనుకూలం.సేంద్రియ పదార్థం అధికంగా ఉండే నేలల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం కలదు.
నాటే సమయం :
ఖరీఫ్ లో జూన్ – జులై మాసాలు, వేసవిలో ఫిబ్రవరి – ఏప్రిల్ మాసాలు విత్తుకొవడానికి అనుకూలం.
రకాలు:
శతముఖి:
పంటకాలం: 6-7 నెలలు.
నాటే దూరం: వరసకు, వరసకు 45 cm అలాగే మొక్కకు, మొక్కకు 30 cm ఉండేలా విత్తుకోవాలి.
దిగుబడి: ఒక ఎకరాకు 8 టన్నుల దిగుబడి ఇస్తుంది. దుంపలు నిలువుగా ఉంటాయి.
భావపురి :
పంటకాలం: 8 నెలలు.
నాటే దూరం: వరసకు, వరసకు 45 cm అలాగే మొక్కకు, మొక్కకు 45 cm ఉండేలా విత్తుకోవాలి.
దిగుబడి: ఒక ఎకరాకు 14 టన్నుల దిగుబడి ఇస్తుంది. దుంపలు శతముఖి రకం కంటే లావుగా ఉంటాయి.
K.C.S – 3 :
పంటకాలం: 5 నెలలు.
నాటే దూరం: వరసకు, వరసకు 45 cm అలాగే మొక్కకు, మొక్కకు 30 cm ఉండేలా విత్తుకోవాలి.
దిగుబడి: ఒక ఎకరాకు 9.6 టన్నుల దిగుబడి ఇస్తుంది.
R.N.C.A – 1:
పంట కాలం : 6 నెలలు
నాటే దూరం: వరసకు, వరసకు 45 cm , మొక్కకు, మొక్కకు 30 cm ఉండేలా విత్తుకోవాలి.
దిగుబడి: ఒక ఎకరాకు 8 టన్నుల దిగుబడి ఇస్తుంది.
కో -1:
పంట కాలం :5 – 6 నెలలు
దిగుబడి: ఒక ఎకరాకు 12 – 15 టన్నుల దిగుబడి ఇస్తుంది.దుంపలు గుండ్రంగా వుండి మిగతా రకాల కంటే ఎక్కువ ధర పలుకుతుంది.
Also Read: Potato Processing: బంగాళదుంప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు భారీ లాభాలు.!
విత్తనంగా ఏ దుంపలు వాడాలి?
ఒక ఎకరాకు 300-400 కిలోలు పిల్ల దుంపలు కన్నా తల్లి దుంపలు విత్తానంగా వాడితే దిగబడి పెరుగుతుంది. కొన్ని సార్లు విత్తన మోతాదు దుంపల సైజ్ ను బట్టి ఉంటుంది. దుంపల సైజ్ పెద్దగా ఉంటే ఎకరాకు 600-800 కిలోల వరకు పడుతుంది. తెగుళ్ళు లేని, ఆరోగ్యంగా ఉన్న,ఓకే సైజ్ కలిగిన, దెబ్బలు తగలకని దుంపలను విత్తనంగా ఎంపిక చేసుకోవాలి. తల్లి, పిల్ల దుంపలను విత్తన దుంపలుగా ఉపయోగించుకోవచ్చు. 30-45 గ్రాముల బరువు ఉండి, మధ్యస్థ సైజ్ కలిగిన దుంపలను నాటాలి. తవ్విన తరువాత దుంపలను 30-45 రోజులు నిల్వ ఉంచి , మొలకలు వచ్చే దశలో నాటాలి. విత్తన దుంపలను 2-3 ఏళ్లకు ఒకసారి మార్చి , క్రొత్తవి తెచ్చి నాటాలి.
విత్తన శుద్ధి:
విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్(లీటరు నీటికి 5 గ్రాములు) మరియు 25 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్(లీటరు నీటికి 2.5 ml) కలిపిన ద్రావణంలో 15 నిమషాలు ముంచి తీసి నీడలో ఆరబెట్టి వెంటనే నాటుకోవాలి .
ఎరువుల యాజమాన్యం :
పొలాన్ని లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు ,150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి.తరువాత అడుగున్నర ఎడంగా బొదెలు చేయాలి. సిద్దం చేసిన పొలానికి నీరు పెట్టీ 1.5 అడుగుల దూరంలో దుంపలను నాటాలి.నాటిన తరువాత మొలకలు పూర్తిగా వచ్చే వరకు తేమ ఆరకుండా 2-3 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. నత్రజని ( యూరియా- 105 కిలోలు/ ఎకర్), పొటాష్ (53 కిలోలు/ఎకర్) ఎరువులను మూడు సమభాగాలుగా చేసి దుంప మొలకెత్తిన తరువాత 30,60,90 రోజులకు వేయాలి.ఎరువులను మొక్క రెండు వైపుల గుంటల్లో వేసి మట్టితో కప్పి, తేలిక పాటి తడి పెట్టాలి.
నీటి యాజమాన్యం :
చామ దుంప సాగులో నీటి యాజమాన్యం చాలా కీలకమైనది. పంట ఏ దశలోనైన నీటి ఎద్దడికి గురి అయితే ఆకులు వడలి విరిగిపోతాయి. మొక్కలు నీటి ఎద్దడికి గురి అయితే 50% వరకు దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి 3-4 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి.
కలుపు యాజమాన్యం :
మొదటి దఫా తడి పెట్టిన తరువాత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 2.0 లీటర్ల బుటాక్లోర్ లేదా 1 లీటర్ పెండిమిథాలిన్ 30% లేదా 200 ml ఆక్సిఫ్లోరోఫిన్ 22.5% లలో ఎదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై పిచికారి చేయాలి. 40-45 రోజుల తరువాత పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి. సుమారుగా 75 రోజులప్పుడు ఒక్కో మొక్క దగ్గర మూడు పిలకలు వుంచి మిగతా వాటిని తీసివేయాలి. ఈ రకంగా తొలగించిన పిలకలను ఆకు కూరగా ఉపయోగించుకోవచ్చు.దుంపలు ఏర్పడి వృద్ది చెందే దశలో అధిక పిలకలు ఉంటే దుంపల ఎదుగుదలపై ప్రభావం పడి, దుంప దిగుబడి తగ్గుతుంది.
సూక్ష్మపోషక లోపాలు:
సూక్ష్మ పోషక లోపాలు నివారించేందుకు దుంపలు నాటిన 2-3 నెలల తరువాత లీటరు నీటికి 2 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిపి పిచికారి చేయాలి.
సస్య రక్షణ :
చామ దుంపలో చీడ పీడలు సమస్య తక్కువే. పురుగులలో పొగాకులద్దె పురుగు, రసం పీల్చే పురుగులలో నల్లి ఎక్కువగా ఈ చామ దుంపను ఆశించి నష్టపరుస్థాయి. తెగుళ్ళలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంది.సిఫార్సు చేసిన మందులు పిచికారి చేసి ఈ చీడ పీడలు నుండి పంటను రక్షించుకోవాలి.
కోత:
రకాన్ని బట్టి నాటిన 2-3 నెలలో క్రొత్త దుంపలు ఏర్పడతాయి.5-7 నెలలలో దుంపలు పరిపూర్ణంగా వృద్ధి చెంది, తవ్వకానికి సిద్ధమవుతాయి.దుంపలు పక్వానికి వచ్చిన దశలో ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ దశలో నీటి తడులు తగ్గించాలి. వారానికి ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చి, ఆపై ఆపివేయాలి. దీంతో ఆకులు ఎండిపోతాయి. మార్కెట్ లో ధరలు లేని కారణాల వల్ల దుంపల తవ్వకాన్ని ఆలస్యం చేయాలి అనుకుంటే పొలానికి నీరు పారించడం కొనసాగించాలి. దీని వల్ల దుంపల దిగుబడిపై ఏలాంటి ప్రభావం ఉండదు.
శాస్త్రీయంగా సాగు చేస్తే ఎకరాకు 12-20 టన్నుల వరకు దుంపల దిగుబడి వస్తుంది. రైతుకు సరాసరి కిలోకు 15 రూపాయల ధర లభించిన ఎకరాకు 12 టన్నుల దిగుబడి కి 1,80,000 రూపాయలు వచ్చే అవకాశం కలదు. సాగు ఖర్చు ఎకరాకు 60,000-70,000 పోయిన లక్ష నుండి లక్షా ఇరవై వేలు మిగిలే అవకాశం ఉంటుంది.
Also Read: PJTSAU: ఎరువులు, పురుగు మందులు తగిన మోతాదులో వాడాలి