Beetroot Cultivation: బీట్ రూట్ పచ్చగా, సలాడ్‌గా తింటారు. కూరగాను, పచ్చళ్ళ తయారీలోను వాడుతారు. అంతేకాక క్యానింగ్ చేయటానికి అనువైనది. ఎర్ర గరప లేదా లేత బీట్ రూట్ ఆకులను ఆకుకూరగా వాడుతారు. బీట్ రూట్ సాగు చేయడానికి లోతైన, సారవంతమైన ఇసుక నేలలు అనువైనవి. బరువైన నల్లరేగడి నేలలు పనికిరావు. 6-7గల ఉదజని సూచిక అనుకూలం. అధిక క్షారత గల చౌడు భూములలో కూడా పెంచవచ్చు.
శీతాకాలపు పంట 18 నుండి 21 సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం. బీట్ రూట్ విత్తనాలను ‘సీడ్ బాల్స్’ అంటారు. ఒక్కోదానిలో రెండు కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 45 సెం.మీ. వరుసలలోని మొక్కల మధ్య 8-10 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
ఆగష్టు నుండి నవంబరు చివరి వరకు విత్తుకోవచ్చు. దఫదఫాలుగా ఒక్కొక్క దఫాకు 15 రోజుల తేడాతో విత్తుకుంటే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంట పొందవచ్చు.
రకాలు:
డెట్రాయిడ్ డార్క్ రెడ్ : పంట కాలం: 80-100 రోజులు. అధిక ఇగుబడినిచ్చే రకం. గడ్డ పైపొర బాగా ఎర్రగా ఉంటుంది.
క్రిమ్సన్ గ్లోబ్ : గడ్డ గుండ్రంగా ఉండి, పై పొర లేత ఎరుపు రంగుతో ఉంటుంది. పంటకాలం 90-95 రోజులు. అధిక దిగుబడినిస్తుంది.
ఎర్లీ వండర్ : గడ్డ ఎర్రగా ఉంటుంది. పంటకాలం 55-60 రోజులు.
Also Read: Spinach: పోషక అద్భుతాన్ని అందిస్తున్న ఈ కూర ఏంటో , ఎలా సాగు చేయాలో మీకు తెలుసా ?
నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి. గింజ విత్తిన 25 రోజులకు ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి.
బీట్ రూట్ సాగులో, గింజలు మొలకెత్తిన తర్వాత, ఒక్కో గింజ బాల్ నుండి 2-6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక బలమైన మొలక ఉంచి, మిగిలినవి పీకి వేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇలా కనీసం రెండుసార్లు చేసి, ఒక్కో మొక్క మధ్య 10 సెం.మీ. దూరం ఉండేటట్లు చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి, మన్ను ఎగదోయాలి. దీని వలన గడ్డ బాగా ఊరుతుంది.
పాముపొడ, ఆకుతినే పురుగులు సాధారణంగా ఆశిస్తాయి. లీటరు నీటికి మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేసి ఆకు తొలుచు పురుగును నివారించవచ్చు. ఆకుతినే పురుగుల నివారణకు లీటరు నీటికి డైక్లోరోవాస్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 3గ్రా. కలిపి పిచికారి చేయాలి. మొక్క కుళ్ళు తెగులు, బూజు తెగులు, బీట్ పసుపుపచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి థైరం లేదా కాప్టాన్ 2గ్రా. పట్టించి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. పంటపై 2గ్రా. డైథేన్ జడ్-78లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బీట్ రూట్ దిగుబడి 60-90 రోజుల్లో పంట తయారవుతుంది. మొక్క మొత్తం గడ్డతో సహా పీకి, ఆకుల తీసివేసి కడిగి మార్కెట్‌కి పంపాలి. ఎకరాకు 10-12 టన్నులు దిగుబడిని పొందవచ్చు.
Also Read: Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?