ఉద్యానశోభ

Cultivation of Maize In Paddy Fields: వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – మెళకువలు.!

0
Maize Crop
Maize Crop

Cultivation of Maize In Paddy Fields: భూగర్భ జలాలు అడుగంటుతూ తక్కువ నీటి సౌలభ్యం కలిగిన ప్రాంతాల్లో రెండవ పంటగా లేదా రబీ పంటగా ఆరుతడి పంటలు సాగు చేయడం పట్ల రైతులు ఆసక్తి పెంచుకోవాలి. ఇటు ఖరీఫ్‌, అటు రబీ పంటగానే కాక వేసవిలో కూడా సాగు చేసుకోదగిన అధిక ఆదాయాన్ని అందించే పంట మొక్కజొన్న. రబీ మాగానుల్లో పెసర మినుముకు ప్రత్యామ్నాయంగా చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న పంట విస్తరిస్తున్నది. మొక్కజొన్నను నేరుగా దుక్కి చేసి నేల తయారీ చేసి మాత్రమే కాకుండా దుక్కి దున్నకుండానే పంట సాగుచేసే (జీరో టిల్లేజి) పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో తొలకరి వరిచేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాల్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి.

Cultivation of Maize In Paddy Fields

Cultivation of Maize In Paddy Fields

వరి మాగాణి లో దుక్కి చేయకుండా మొక్కజన్న సాగు వల్ల లాభాలు:

  • సాగు ఖర్చు ఎకరాకు దాదాపు రూ.2500/- నుండి రూ.3000/- ల వరకు ఆదా అవుతుంది.
  • పైరును ఒక నెల ముందు నాటడం వల్ల 2-3 నీటి తడులు ఆదా అవుతుంది.
  •  పైరు ఒక నెల ముందు కోతకు వస్తుంది. కావున దిగుబడి కూడా పెరుగుతుంది.
  • ఏప్రిల్‌, మే నెలలో వీచే గాలులకు ముందే కోత జరుగుతుంది. కావున నష్ట నివారణ సాధ్యమవుతుంది.
  •  వరి మాగాణుల్లో మొక్కజొన్నను సాగు చేసుకునేటప్పుడు ఈ క్రింద పేర్కొనబడిన అంశాలను పాటించాలి.

రకాలు: మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక (100`120), మధ్యకాలిక (90`100) మరియు స్వల్పకాలిక (90 రోజులు) రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడినిస్తాయి.
డి.హెచ్‌.ఎం. 111, డి.హెచ్‌.ఎం. 113, డి.హెచ్‌.ఎం. 115, డి.హెచ్‌.ఎం. 117 తో పాటు మార్కెట్‌ లో ప్రముఖ కంపెనీల హైబ్రిడ్‌ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

విత్తనశుద్ధి: సయంత్రనిలిప్రోల్‌  థయోమితోక్సమ్‌ 6 మీ. లీ./ కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను కత్తెరపురుగు బారినుండి కాపాడుకోవచ్చు.

విత్తే కాలం: కోస్తా జిల్లాల్లో నవంబరు నుండి జనవరి మొదటి వారం వరకు వేసుకోవచ్చు. ఆ తరువాత విత్తితే దిగుబడి తగ్గుతుంది.

విత్తే పద్ధతి:

  •  వరి మాగాణిలో దుక్కి చేయకుండా నల్ల పదును (మెత్తని పదును) ఉన్న సమయంలో విత్తుకోవాలి
  •  వరికోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజన్నను విత్తుకోవాలి.
  • తాడును ఉపయోగించి కాని లేదా విత్తనం వేసే యంత్రంతో (మార్కర్‌) గాని వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ. మరియు మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండునట్లు విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

  •  ఎకరాకు 80 కిలోల నత్రజని (180 కిలోల యూరియా), 32 కిలోల భాస్వరం (80 కిలోల డి.ఏ.పి), 32 కిలోల పొటాష్‌ (60 కిలోల మ్యూరేట్‌ ఆప్‌ పొటాష్‌) నిచ్చే ఎరువులను వేసుకోవాలి.
  • 1/4వ వంతు నత్రజనిని, మొత్తం భాస్వరం ఎరువును, సగం పొటాష్‌ ఎరువును విత్తే సమయంలోను, మిగతా సగం పొటాష్‌ ఎరువును పూత దశలో వేసుకోవాలి.
  •  మిగతా 1/4వ వంతు నత్రజనిని 30`35 రోజుల మధ్య, 50`55 రోజుల మధ్య వేయాలి. మిగిలిన 1/4వ వంతు 60`65 రోజుల మధ్య వేయాలి.
  • మొక్కల ఎదుగుదల కొరకు 20-25 రోజుల వయసులో 19-19-19 (పాలీఫీడ్‌) ఏ 1 కిలో ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు.
  •  మొక్కలలో జింకు లోపం (ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు పచ్చ రంగులోకి మారడం మరియు లేత పైరు తెల్ల మొగ్గగా మారడం) కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింకు సల్ఫేట్‌ ను కలిపి పైరుపై పిచికారి చేయాలి.పై పాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి.

కలుపు యాజమాన్యం:

  • వరి మాగాణులలో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది.
  • దీని నివారణకు ఎకరాకు కిలో అట్రజిన్‌ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
  • వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్వాట్‌ 1.0 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. అట్రజిన్‌ G పారాక్వాట్‌ కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చును.
Cultivation of Maize In Paddy Fields

Cultivation of Maize In Paddy Fields

నీటి యాజమాన్యం:

  •  మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం.
  •  30`40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు.
  •  సాధారణంగా పంట కాలంలో 6`8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు, విత్తిన 15 రోజులకు, 30`35 రోజులకు, పూతదశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకొనే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి.
  • దీర్ఘకాలిక వంగడాలకు 1`2 తడులు అధికంగా అవసరమౌతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి నీటి తడి ఇవ్వాలి.
  • సాధారణ పద్దతిలో కంటే జీరో టిల్లేజి పద్దతిలో రెండు నుండి మూడు నీటి తడులు తగ్గుతాయి.

సస్యరక్షణ-
కత్తెర పురుగు: ఈ పురుగు యొక్క రెక్కల పురుగు గుడ్లు పెట్టడం వల్ల గుడ్లు పగిలి పిల్లలుగా మారిన పురుగులు ఆకుల మీదపత్రహరితాన్ని గోకి తింటాయి. రెండవ దశలో పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల తింటాయి ఆకుల మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి. శాఖియ దశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినడం వల్ల మొవ్వు చనిపోయే ప్రమాదం ఉంది. పురుగు తిని విసర్జించిన మలం పదార్థంతో మొవ్వు అంతా నిండి ఉంటుంది. పూత మొదలయ్యే సమయంలో ఆశిస్తే మొవ్వ లోపల ఉన్న నూతన కూడా రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి చనిపోయే కంకి తయారు అవ్వదు.

నివారణ:

  • సయంత్రనిలిప్రోల్‌ ం థయోమితోక్సమ్‌ 6 మీ. లీ./ కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలనుకత్తెర పురుగు బారినుండి కాపాడుకోవచ్చు.
  • లింగాకర్షక బుట్టలు ఏకరాకు 10 చొప్పున అమర్చుకోవాలి. పంట వేసిన పది రోజులకు వేపనూనె 1 లీ. మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • బి టి ఫార్ములేషన్‌ లీటర్‌ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పురుగు ఉధఅతి గమనించిన వెంటనే పిచికారీ చేయాలి.
  • పురుగు ఉధఅతి ఎక్కువగా ఉంటే నివారణకు ఇమామేక్టిన్‌ బెంజోయేట్‌ 5% 100గ్రాములు లేదా స్పైనోసాడ్‌ 60 మీ. లీ.ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • మందు పిచికారి చేసేటప్పుడు మొవ్వు సుడిలో పడే విధంగా పిచికారీ చేస్తే పురుగు నివారణ సాధ్యమవుతుంది.

కాండం తొలుచు పురుగులు: గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10`20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్ర హరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఉన్న ఆకుద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి, ఎండిపోతుంది. దీనినే ‘డెడ్‌ హార్ట్‌’ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ాూ్ణ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను మరియు కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది.

నివారణ :

  • పొలంలో కలుపు మొక్కలు మరియు చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచడం.
  • పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం
  • పొలం చుట్టూ 3ా4 వరుసలలో జన్నను ఎరపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయడం.
  • ట్రైకోగ్రామా కిలోనిస్‌ పరాన్న జీవి గ్రుడ్లని ఎకరాకు 2`3 ట్రైకోకార్డ్స్‌ను రెండు విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలలో విడుదల చేయడం.
  • మోనోక్రోటోఫాస్‌ 36 ఎస్‌.ఎల్‌ ఎకరాకు 320 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్‌ (కొరాజెన్‌, రైనాక్సిపర్‌ లాంటివి) ఎకరాకు 60 మి.లీ.ను 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10`12 రోజులకు పిచికారీ చేయడం.
  • ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యురాన్‌ 3జి గుళికలను ఎకరాకు 3 కిలోలు చొప్పున పైరు మొలకెత్తిన 25`30 రోజులకు ఆకుల సుడులలో వేయడం.

రసం పీల్చు పురుగులు: ముప్ఫై రోజులు పైబడిన పైరును పేనుబంక మరియు చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారి పోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.

Sap-Sucking Pests

Sap-Sucking Pests

నివారణ: సహజంగా అక్షింతల పురుగులు, సిర్ఫిడ్స్‌ వంటి పరాన్నభుక్కులు మరియు పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులోఉంచుతాయి.రసంపీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే అసిఫేట్‌ 200 గ్రా.లేదా మోనోక్రోటోఫాస్‌ ఎకరాకు 320 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

టర్సికమ్‌ ఆకు ఎండు తెగులు: ఆకులపై పొడవైన, కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు మొదట మొక్క క్రింది ఆకులపై కనిపించి, పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి. శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు కండెపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి.

తుప్పు తెగులు: ఆకులపై రెండువైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పంట పెరిగిన కొలది ఆకులపైన పొక్కులు గోధుమ వర్ణం నుండి నలుపు వర్ణానికి మారుతాయి. పూత సమయంలో తెగులు లక్షణాలు స్పష్టంగా అగుపిస్తాయి. అధిక తేమ గల చల్లని వాతావరణంలో తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తేముందు కిలో విత్తనానికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ శిలీంధ్రాశినితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

Also Read: Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

బొగ్గు కుళ్ళు తెగులు: పూత దశ తరువాత నేలలో తేమ శాతం తగ్గడం వలన, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ తెగులు ఎక్కువ తీవ్రతతో సోకుతుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్లద్వారా కాండం పైభాగానికి వ్యాపిస్తుంది. కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వలన పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్ళి, తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.

Coal Rot

Coal Rot

తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాలలో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధిచేసి 3`4 సంవత్సరాలు వరుసగా నేలలో కలుపుతూ పోవాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చు ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తరువాత ముఖ్యంగా పూతదశ నుండి నేలలో తేమ తగ్గకుండా ఉండే విధంగా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తరువాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతి అవలంభించాలి.

పాము పొడ తెగులు: ఈ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కల క్రింది ఆకులపై సోకి, పై ఆకులకు మరియు కాండానికి వ్యాపిస్తుంది. బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఆకులు, కాండంపై ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడటానికి పాముపొడ మాదిరిగా కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. తెగులును కలుగుజేసే శిలీంధ్రం మొక్కల అవశేషాలలో మరియు కలుపు మొక్కలపై జీవించి ఉంటుంది.

తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఒకటి లేక రెండు ఆకులను తీసివేయాలి. 200 గ్రా. కార్బెండజిమ్‌ లేక 200 మి.లీ. ప్రోపికొనజోల్‌ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశించే ప్రాంతాలలో విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులు పిచికారీ చేయాలి.

పంటకోత:

  •  పంట కోతకు వచ్చినప్పుడు బుట్టల పై పొరలు ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి. మరియు కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. అంతేకాకుండా, బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరీక్షించినచో నల్లని మచ్చలు ఉండడం గమనించవచ్చు.
  •  ఈ దశలో గింజలలో సుమారుగా 25`30% తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరుచేసి గింజలలో తేమ శాతం 15 వచ్చే వరకు 3`4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి.
  • మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూతదశలో పైరును కోయాలి. కంకులను నూర్పిడి చేయుటకు (గింజలను బుట్ట నుండి వేరు చేయుట) ట్రాక్టరుతో లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు.
  • నూర్పిడి తరువాత గింజలను 2`3 రోజులు శాతం తేమ వచ్చేవరకు ఎండలో ఆరబెట్టి, శుద్ధి చేసి గోనె సంచులలో గాని లేదా పాలిథీన్‌ సంచులలో గాని భద్రపరచి చల్లని, తక్కువ తేమ గల ప్రాంతాలలో నిల్వ చేయాలి.
  • దీనితోబాటు నిల్వలో తేమగాని, ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు మొదలగునవి రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

-డా. జి. చిట్టిబాబు, శాస్త్రవేత్త (సస్యరక్షణ), డా. పి. వెంకట రావు, శాస్త్రవేత్త   (విస్తరణ),
-డా. జె. జగన్నాధం, సమన్వయ కర్త, ఏరువాక కేంద్రం, ఆమదాలవలస,   శ్రీకాకుళం. ఫోన్‌ : 9849035068

Also Read: Zero till Maize cultivation: జీరో టిల్లేజ్ పద్ధతి లో మొక్క జొన్న సాగు వల్ల కలిగే లాభాలు

Must Watch:

Leave Your Comments

Manila Tamarind Health Benefits: సీమ చింతకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.!

Previous article

Acharya N.G. Ranga Agricultural University: లాం ఫారం లో డిసెంబర్ నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు.!

Next article

You may also like