Dried Flowers: ప్రస్తుతం అందరిలో పర్యావరణం గురించి అవగాహనతో పాటు వాటిని ఆస్వాదించడం కూడా ఎక్కువ అవడం అనేది ఒక మంచి పరిణామం. ఎక్కువగా ప్రకృతి నుండి వచ్చిన, ప్రకృతికి హాని కలిగించని ఎండబెట్టిన పువ్వులను, మొక్కలోని వివిధ భాగాలను వాడడం వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఎండబెట్టిన పూలతో ఇంటిని అలంకరిస్తున్నారు.
భవిష్యత్తులో తాజా పూల కన్నా ఎండబెట్టిన పూల తయారీ పరిశ్రమ అనేది దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుంది. చాలా కాలం నుండి మానవుని జీవితంలో పూలు ఎండడం అనేది ఒక ముఖ్య భాగంగా ఉంది. తాజాగా అప్పుడే మొక్క నుండి కోసిన పూలు చాలా అందంగా ఉన్నా కొన్ని పువ్వులను ఎంతో ఇష్టపడి, చాలా ధర పెట్టి కొన్నా గాని వాటికి ఉన్న త్వరగా పాడయ్యే గుణం వలన సంవత్సరంలో కొన్ని పువ్వులు కొన్ని కాలాలలో మాత్రమే లభించడం వలన మొక్క అందాన్ని ఆస్వాదించ లేకపోతున్నాము. ఎండబెట్టిన పువ్వులు సంవత్సరం పొడవునా లభించడం వలన ఈ మధ్యకాలంలో ఎండబెట్టిన పువ్వులకు గిరాకీ పెరిగింది.
ఎండిపోయిన పువ్వులకు మనదేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. మన దేశం నుంచి అమెరికా, యూరప్, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వివిధ రకాల ఎండిపోయిన పూల ఎగుమతిలో మన దేశానిదే అగ్రస్థానం. ఎండిపోయిన పూలు అన్న అర్థం కేవలం పువ్వుల భాగాలకే కాకుండా, ఎండిన కాడలు, విత్తనాలు, కొమ్మలు మొదలైనవి వస్తాయి. మన దేశం ఎండిపోయిన పూలు, మొక్కల ఎగుమతి వలన ప్రతి ఏటా దాదాపు వందకోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. దాదాపు ఐదు వందల రకాలు 20 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
పువ్వులను ఎండబెట్టడం అనేది చాలా పాత కాలపు పద్ధతి. హెర్బెరియం కొరకు వృక్ష శాస్త్రవేత్తలు వివిధ రకాల పువ్వులను సులువుగా గుర్తించడానికి పువ్వులను, అవసరమైన మొక్క భాగాన్ని ఎండబెట్టి దాచుకునేవారు. పువ్వులను, ఆకులను ఎండబెట్టడం వివిధ పద్ధతులలో చేయవచ్చును. వీటిని చేతితో తయారుచేసిన కాగితంలో, దీపపు అచ్చులతో, కొవ్వొత్తి హోల్డర్లలో, కార్డులలో, ఫోటోఫ్రేమ్ లల, జనపనారతో చేసిన సంచుల తయారీలో, అట్టపెట్టెలలో, పుస్తకాలలో, ఇతర బహుమతుల తయారీలో విరివిగా వాడతారు.
ఎండు పువ్వుల తయారీలో వాడే పువ్వుల మొక్కలు ఓపియంపాపి, గులాబీలు, కుంకుమపువ్వు, హెలిక్రైసం, గామ్ ఫ్రీనా, నైజిల్లా, డెల్ఫీనియం.
Also Read: ఆంతురియం పూల సాగులో మెళకువలు
ఎండు పువ్వుల తయారీలో వివిధ అంచెలు:
1. ఎండబెట్టటానికి పువ్వులను కోయడానికి అనువైన కాలం
ఎండు పూల తయారీకి పువ్వు పూర్తిగా విచ్చుకోకముందు, పువ్వుల రెక్కల రంగు మారకముందు, ఉదయం పూట, మంచు పూర్తిగా ఎండిపోయిన తర్వాత మొక్క నుండి కోయాలి. పువ్వులను కత్తిరించిన తర్వాత అన్నింటిని గుంపుగా చేర్చి రబ్బర్ తో చుట్టి వీలైనంత తొందరగా ఎండ నుండి తీసివేయాలి.
2. శుభ్రపరచడం
అనవసరమైన భాగాలను ఎండబెట్టటానికి ముందుగానే పేరు చేయాలి.
3. వైర్లను చుట్టడం
పువ్వులకు వైర్లను అడ్డంగా, నిలువుగా చుట్టడం వలన ఎండుటకు వీలుగా ఉంటుంది.
4. పూలలోని తేమను తీసివేయుటకు పువ్వులు ఎండబెట్టే పద్ధతులు
అ) ప్రకృతిలో ఎండబెట్టడం
ఈ పద్ధతిని పూర్వకాలంలో ఉపయోగించేవారు. పువ్వులను పొలంలోనే ఎండలో ఎండపెట్టేవారు. డెల్ఫీనియం, హైడ్రాంజియా, గామ్ ఫ్రీనా మొక్కలు ఈ పద్ధతికి అనువైనవి.
ఆ) గాలిలో ఆరబెట్టడం
సాధారణంగా ఈ పద్ధతిని వాడతారు. పువ్వులను గుత్తులుగా చేర్చి పూల గుత్తులను తలక్రిందులుగా తాళ్ళ పైన గాని, వెదురు కర్రలపై గాని వేలాడదీయాలి.ఈ పద్ధతిలో, గదిలోని గాలిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూడాలి. లేకపోతే శిలీంద్రం సోకే ప్రమాదం ఉంది. లిల్లీ, క్వాకింగ్ గడ్డి అనువైనవి.
ఇ) పేపరు మధ్యలో పెట్టి అదిమి ఉంచుట
ఈ పద్ధతి చాలా పాత కాలం నుండి వాడుకలో ఉంది. పేపరును వాడడం ద్వారా కూడా పువ్వులను ఎండబెట్టవచ్చును. పువ్వులను పేపర్ మధ్యలో పెట్టి వాటిపైన బరువైన వస్తువులను పెట్టడం ద్వారా పూలలోని తేమను తీసివేయవచ్చును. కానీ ఇలా చేయడం ద్వారా పువ్వులు వాటి ఆకారాన్ని కోల్పోతాయి. పువ్వుల నాణ్యత త్వరగా దెబ్బతింటుంది. ముసాండ, కోడిజుట్టు పువ్వులు ఈ పద్ధతికి అనువైన అనువైనవి.
ఈ) సూర్యరశ్మితో ఎండబెట్టడం
ఈ పద్ధతిలో పువ్వుల భాగాన్ని ఇసుక కలిగిన పాత్రలో ఉంచి, రోజు ఎండలో పెడుతూ ఉంచాలి. ఈ పద్ధతి చాలా సులువైన, తక్కువ ఖర్చుతో చేసే పద్ధతి. వర్షాకాలంలోఈ పద్ధతిని అవలంభించడం కష్టము. ఈ పద్ధతిలో ఎలాంటి రసాయనాలు వాడవలసిన అవసరం ఉండదు. గాలి ప్రసరణ బాగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. బంతి, చామంతి రకాలు ఈ పద్ధతికి అనువైనవి.
ఉ) పువ్వు ను పూర్తిగా కప్పి వేసే పద్ధతి వేసే పద్ధతి
ఈ పద్ధతిలో తేమను పీల్చుకునే గుణం ఉన్న పదార్థాలు అయినటువంటి ఇసుక, సిలికాజెల్, రంపపు పొట్టు, బోరాక్స్ మొదలగునవి ఒక దానితో ఒకటి గాని, రెండు మూడు కలిపి గాని వాడవచ్చును. ఒక పాత్రలో పైన తెలిపిన పదార్థాల్లో ఏదైనా ఒక దాన్ని మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు పోసి దాని పైన పువ్వులను పరచి పాత్ర ప్రక్కనుండి కొద్దికొద్దిగా పదార్థం వేస్తూ పువ్వులను పూర్తిగా మునిగే లాగా చూడాలి. ఇలా చేయడం వలన పువ్వు ఎటువైపు కదలకుండా ఉండి ఆకారం మారకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో ఎండడానికి గులాబీ, దాలియా తులిప్, డైసి పువ్వులకు రెండు నుంచి మూడు రోజులు; బంతి పువ్వులకు మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది.
ఊ) హాట్ ఎయిర్ ఓవెన్ లో ఎండబెట్టడం
ఈ పద్ధతిలో, దగ్గర దగ్గరగా రెక్కలు ఉండి ముద్దగా ఉన్న బంతి, చామంతి, జినియ పువ్వులను 40 నుండి 50 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఆరబెట్టడం ద్వారా పువ్వు నాణ్యతగా ఉంటుంది.
ఋ) మైక్రోవేవ్ ఓవెన్లో ఎండబెట్టడం
మైక్రోవేవ్ ఓవెన్ ను వాడి పువ్వులను త్వరగా ఎండ పెట్టవచ్చును. పువ్వుల రెక్కల మందాన్ని బట్టి, తేమ శాతాన్ని బట్టి, సమయం, ఉష్ణోగ్రత మార్చుకుని ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన పువ్వులకు మంచి రంగులు అద్దడం ద్వారా మరింత అందాన్ని ఇనుమడింప చేయవచ్చును.
ఎ) శీతల పద్ధతిలో ఎండబెట్టడం
ఎండలో ఎండబెట్టడం కన్నా ఇది మెరుగైన పద్ధతి. ఈ పద్ధతిలో పువ్వులను శీతల పరికరంలో -10 సెంటి గ్రేడ్ దగ్గర 12 గంటలు ఎండబెట్టడం వలన పువ్వులు మంచి ఆకారంతో, నాణ్యతతో ఉంటాయి. చక్కని ధర పలుకుతాయి. గులాబీలు కార్నేషన్ పూలు ఈ పద్ధతికి అనువైనవి. ఈ పద్ధతిలో ఎండబెట్టటానికి వాడే పరికరాలు చాలా ఖరీదు.
ఏ) నీటిలో ఎండబెట్టడం
ఈ పద్ధతిలో, పువ్వుల కాడలను రెండు ఇంచుల వరకు నీరు నింపిన గ్లాసులో ఉంచాలి. ఈ గ్లాసును వెచ్చగా, చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. సెల్లోషియా, హైడ్రాంజియా పూలు ఈ పద్ధతిలో ఎండుటకు అనువైనవి.
ఐ) గ్లిజరిన్ పద్ధతిలో ఎండబెట్టడం
ఈ పద్ధతిలో ఒక భాగం గ్లిజరిన్, రెండు భాగాలు నీటితో కలిపి వేడి చేయాలి. ఇలా వేడి చేసిన పదార్థాన్ని పాత్రలో (లేదా) గాజు గ్లాస్ తీసుకొని, పువ్వుల కాడలను అందులో ఉంచాలి. 2 నుండి 6 వారాల తరువాత ఆకుల ఆకారం, రంగు మారడం గమనించవచ్చును. యూకలిప్టస్, ఓక్ వలియాండర్, మాగ్నోలియా పువ్వులు ఈ పద్ధతికి అనువైనవి.
ఒ) పాలీసెట్ పద్ధతి
పువ్వులపై పాలీసెట్ పిచికారి చేయాలి ఈ పద్ధతిలో ముగ్గులు ఉండడానికి ఉండడానికి చాలా తక్కువ సమయం పడుతుంది ఎండిన పువ్వుల రంగు ఎంతో మెరుగ్గా ఉంటుంది.
5. ఎండిన పువ్వులకు రంగు వేయడం
ఎండిన పువ్వులను రంగులో ముంచి, అవి రంగును పీల్చుకునే దాకా ఉంచాలి. ఎండిన పువ్వులకు ప్రోసియన్ రకం రంగు మంచిది. నాలుగు కిలోల రంగు పొడిని 20 లీటర్ల నీటిలో కలపాలి. ఆ ద్రావణాన్ని ఎనిమిది వందల లీటర్లు వేడి నీళ్లలో పల్చగా చేసుకోవాలి. దానికి రెండు లీటర్లు అసిటిక్ ఆమ్లం కలపాలి. మరీ సున్నితంగా ఉండే పువ్వులకు మెగ్నీషియం క్లోరైడ్ వాడి రంగును మెరుగుపరచవచ్చును.
6. ఎండిన పువ్వులను భద్రపరచడం
ఎండిన పువ్వులను పాలితిన్ సంచులలో (లేదా) అట్టపెట్టెలలో (లేదా) మైనపు కాగితాలలో చాలా కాలం జాగ్రత్తగా భద్రపరచవచ్చును. భద్రపరచడానికి వాడే వాటిలో సిలికాజెల్ ను గాని, మాత్ బిళ్ళలను గానీ ఉంచాలి.
7. ఎండిపోయిన పువ్వుల వాణిజ్య ఉత్పత్తులు
తురాయి, ఊదా రంగు తోటకూర, పోక, కొబ్బరి ఆకులు, కత్తిరించిన పువ్వులు ఇవన్నీ ఈ తరగతిలోకి వస్తాయి. ఎండుటాకులు, రెమ్మలు, పువ్వులు, మొక్కలుగా వాడడం జరుగుతుంది. వీటన్నింటిని గత 20 ఏళ్లుగా భారతదేశం ఎగుమతి చేస్తోంది.
అ) పార్ట్ పొర్రీ
ఒక పాలిథీన్ సంచిలో సువాసన ద్రవ్యము పూసిన ఎండిన విడి పువ్వుల మిశ్రమమే పార్ట్ పొర్రీ. వీటిని సాధారణంగా అలమరలలో, స్నానపు గదులలో ఉంచుతారు. ఈ పద్ధతిలో కనీసం 300 మొక్కలను వాడతారు. తురాయి, జాజి, గులాబీ పూల రెక్కలు, కాగితం పూలు, వేపాకులు, పండ్ల విత్తనాలు భారతదేశంలో తయారయ్యే పార్ట్ పొర్రీలో ఉంటాయి. వీటి ప్రధాన కొనుగోలుదారు ఇంగ్లాండ్ దేశం.
ఆ) ఎండిపోయిన పువ్వుల కుండీలు
ఎండిన కాడలను, మొగ్గలను ఇందులో వాడుతారు. వీటికి మార్కెట్లో గిరాకీ తక్కువే అయినా, అధిక ఆదాయ వర్గాలు వాటిని కోరుకుంటారు. ఎక్కువ ధర పలుకుతుంది. ఎండిన ప్రత్తి తొక్కలు, దేవదారు పూలు, ఎండు మిరప, ఎండు దోస, గడ్డి, జాజి చెట్టు ఎక్కువ కాలం నిలిచే పువ్వులు, ఆకులు, చెట్టు బెరడు, రెమ్మలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.
ఇ) ఎండిపోయిన పువ్వులతో చేతి పనులు:
నిండిన పువ్వులతో చిత్రాలను తయారు చేసి పటంకట్టి అమ్మడం, గ్రీటింగ్ కార్డులు, కవర్లు, బొకేలు, గాజు పాత్రలు ఇవన్నీ వివిధ రంగులు వాడి ఎండిన పువ్వుల పదార్థాలతో చేయడం లాభదాయకం.
లావేటి గౌతమి, జి. త్రికళ మాధవి, వి. విజయ భాస్కర్
ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట, డాక్టర్ వై.ఎస్.ఆర్ విశ్వవిద్యాలయం,
రైల్వే కోడూరు మండలం, వై.ఎస్.ఆర్ కడప జిల్లా – 516105
ఫోన్ నెంబరు – 8897093584
Also Read: తామర పూల సాగుతో అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నా రైతు