Plant Nursery: ప్రతీ పండగకు, పర్వదినానికి, శుభకార్యానికి పూలు కావాల్సిందే. ఇంటి ముందున్న ఖాళీ జాగాలోనో, వెనక పెరట్లోనో పూల మొక్కలు పెంచితే మన ఇంటికి కావాల్సినంతలో పూలు మనమే పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, అన్ని రకాల పూల మొక్కలు పెంచుకోవాలంటే చాలా స్థలం కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటి ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టాలి. అయితే అన్ని రకాల పూల, పండ్ల, ఆయుర్వేద మొక్కలు ఒకే చోట లభించే నర్సరీలో మనకు దొరుకుతాయి.
ఉత్సవాలు, పండగలు, పెండ్లిళ్లు వంటి శుభకార్యాల్లో పూలు కావాల్సి వస్తుంది. గులాబీ, మల్లె, సంపంగి, కనకాంబరంతో పాటు ఎన్నో రకాల ఆకర్శణీయ పూలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటితోనే మండపాలు అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే, ఇంటికి కావాల్సిన పూలను ఎప్పటికప్పుడు తెంపుకునేలా ఇంటి ముందో, వెనకాలో ఏర్పాట్లు చేసుకుంటే తాజాగా ఉండటమే కాకుండా మార్కెట్లో అధిక ధరలు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. రంగురంగుల పూల మొక్కలు మనకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తాయి. నిత్యజీవితంలో మనకు కావాల్సిన పూల మొక్కలను తక్కువ ధరలోనే అందిస్తున్నారు
మన ఇంట్లోని గార్డెన్‌ను ఆకర్శణీయంగా మార్చాలంటే పూల మొక్కల ఎంపిక చాలా ముఖ్యం. మన అభిరుచికి అనుగుణంగా ఉండే పూల మొక్కలను ఎంచుకోవాలి. పూల మొక్కల్లో కొన్ని ప్రత్యేక సీజన్లలోనే పుష్పించి కనుల విందు చేసేవి ఉంటాయి. మరికొన్ని ఏడాదంతా పూస్తుంటాయి. పూల మొక్కలను పెంచే ముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా పువ్వులు దొరుకుతాయంటున్నారు పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ వంటి పూల మొక్కలు ఏడాది పొడవునా పూలనిస్తాయి.
Also Read: Millets Cultivation: వర్షాధార పంటగా చిరుధాన్యాలు సాగు.!
ముందుగా మనం ఉండే ప్రాంతం, వాతావరణం పూల మొక్కల పెంపకానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి. వాతావరణం పడకపోతే అవి త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. నేల స్వభావాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సారవంతమైన నేలలో కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కలు నాటే స్థలంలో కంపోస్టు ఎరువులు వాడాలి. క్రమ పద్ధతి ప్రకారం పూల మొక్కలకు నీరు అందించే విధానాన్ని సిద్ధం చేసుకోవాలి. నీరు అధిక మొత్తంలో నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి. పూల మొక్కల చెంత చెత్త చెదారం, ఎండి రాలిన ఆకులు, పూలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. కొన్ని మొక్కలు నీడలో పెరుగుతాయి.
పూల మొక్కల్లో గులాబీల అందమే వేరు. ఇంటి ముందుంటే ఆ ఇంటికే అందం వస్తుంది. గులాబీ మొక్కలను నాటిన తర్వాత వాటి పెరుగుదలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలాలను బట్టి గులాబీ చెట్లు పెరుగుతుంటాయి. వేసవిలో ఎక్కువ ఎండ ఉండకుండా చూడాలి. ఎండలు మండుతుంటే నీరు ఎక్కువగా ఇవ్వాలి. కుండీల్లో పెంచితే వెలుతురు తగిలే ఏర్పాట్లు చేయాలి.
వానాకాలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. చలికాలంలో రెండురోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. గులాబీల సీజన్ నవంబర్ నుంచి జనవరి వరకు ఉంటున్నందున ఆగస్టులో నాటితే సీజన్‌కు పూలను అందిస్తాయంటున్నారు. చామంతి పూల మొక్కలను నేలపై కుండీల్లోనూ పెంచుకోవచ్చు. చామంతి మొక్కలు నాటేందుకు పొడిబారిన లేదా ఎక్కువ తేమ, నీరు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోకూడదు. ఎల్లో బెల్స్ పూల మొక్కలు అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. వీటికి నిత్యం నాలుగైదు గంటలు సూర్యరశ్మి నేరుగా తగిలే ప్రాంతంలో నాటుకోవాలి. రోజు విడిచి రోజు నీరివ్వాలి.
లిల్లి పూలు.ఈ రకం పూలు శీతాకాలం చివర్లో పుష్పించే దశకు చేరుకుంటాయి. అంటుకట్టడం ద్వారా కొత్త మొక్కల్ని పుట్టించవచ్చు. ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఎండ ఎక్కువగా ఉండే స్థలంలో వీటిని నాటుకోవడం వల్ల ఎక్కువ పూలను పొందవచ్చు. వీటితో పాటు తులసి, దవనం, బంతిపూలు, మందారం, మనీప్లాంట్, నైట్ జాస్మిన్ బోగన్ విలియా వంటి పూల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, మార్కెట్లో ఎన్నో రకాల ఆకర్శణీయమైన పూలనిచ్చే మొక్కలు దొరుకుతున్నాయి. వీటిని కూడా పెరట్లో నాటుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అందమైన పూలను సొంతం చేసుకోవచ్చు.
Also Read: Telangana Govt Schemes For Farmers: రైతులకు భరోసాని ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.!