ఉద్యానశోభ

మామిడి మాగవేసే పద్ధతులు..

0
మామిడిలో కోత దశలో మెళుకువలు: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా రైతులు మామిడి కాయ తెంపడం అనే ప్రక్రియ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. మే – జూన్ నెలల్లో చాలా రకాలు కోతకు వస్తాయి. జులై నాటికి కోత దాదాపుగా పూర్తవుతుంది. రాయలసీమ ప్రాంతంలో చాలా రకాలు మే నుంచి జులై వరకు కోతకు వస్తాయి. కాయ పక్వతకు వచ్చినప్పుడే కోతను చేపట్టాలి. పండ్ల కోసం బాగా ముదిరిన కాయలను మాత్రమే కోయాలి. అలాగైతే అవి సక్రమంగా పండి మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. ఒకసారి చెట్టు నుంచి కాయను కోసిన తర్వాత చెట్టు పైన పొందే కాయ నాణ్యతను పెంపొందించలేం. కాయ పరిపక్వ దశకు చేరకముందే సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. బంగినపల్లి లో పంచదార టి.ఎస్ . ఎస్. లో 9 శాతం, దశలలో 8.5 శాతం వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. కాయలో వచ్చే కొన్ని మార్పులను బట్టి అది పూర్తిగా ముదిరింది లేనిది తెలుసుకోవచ్చు. కొన్ని మామిడి రకాల్లో పండు పసుపు రంగుకు మారటం, మరి కొన్ని రకాల్లో పక్వత తెలియజేస్తూ బూడిదలాంటి పొర ఏర్పడుతుంది. కాయతొడిమకు దగ్గరగా రంగుమార్పు, కాయ తుంచితే కాయ నుంచి వచ్చే జీడీ ( సొన) సాంద్రత తగ్గడం కాయకోతకు సూచనలు కాయలు కోసేటప్పుడు అవి కిందపడి దెబ్బతగలకుండా కొక్కెంలా కట్టిన వెదురు కర్రతో కోయాలి. మామిడిలో పరిపక్వ దశను బట్టి మూడు రకాలుగా గుర్తించారు.
మొదటి పరిపక్వ దశ:
కాయ నిండు ఆకారం చెట్టుపై పొంది లేదా ఆకుపచ్చరంగు కలిగి ఉంటుంది. తెల్లని మచ్చలు అంతగా స్పష్టంగా కనిపించవు. అలాగే బూడిద పొడి కూడా అంత స్పష్టంగా కనిపించదు. ఈ దశలో కాయలు 95 – 100 రోజుల్లో 7 – 9 శాతం పంచదార కలిగి ఉంటాయి. వీటి నిల్వ వ్యవధి 20 – 25 రోజులు. ఈ దశలో కాయలు సముద్రం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఇందుకు రీఫర్ కంటైనర్లు ఉపయోగించాలి.
రెండో పరిపక్వ దశ:
ఈ దశలో లేత ఆకుపచ్చ కంటే మరికొంత తెలుపురంగు కలిగి తెల్లని మచ్చలు స్పష్టంగా ఏర్పడుతాయి. కాయపైన బూడిద పొడి అద్దినట్లు కనిపిస్తుంది. ఈ దశ కాయలు 100 – 105 రోజుల్లో 9 – 10 శాతం పంచదార కలిగి ఉంటాయి. వీటి నిల్వ వ్యవధి 17 – 20 రోజులు. ఈ దశలో అతి తక్కువ సమయంలో బంగినపల్లి, తోతాపురి లాంటి రకాలను విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు.
మూడో పరిపక్వ దశ:
ఈ దశలో కాయ పూర్తిగా పక్వము పొంది 11 – 12 శాతం పంచదార కలిగి ఉంటాయి. ఈ కాయలు 108 – 110 రోజుల్లో కోయవచ్చు. వీటి నిల్వ వ్యవధి 10 – 12 రోజులు మాత్రమే. కోసిన 1 – 2 రోజుల్లో పండుగా మారుతుంది. కొన్ని సంధర్భాల్లో చెట్టుపై పండుగా మారుతుంది. ఈ దశలో కాయలను ఇతర రాష్ట్రలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను స్థానిక మార్కెట్లో అమ్ముకోవాలి. సాధారణంగా రైతులు మామిడి కోతను కర్ర చివర కొక్కెం లేదా చిక్కం కట్టి కోయటం అలవాటు. ఇందుకు బదులుగా దాహేలి పరికరాన్ని ఉపయోగించాలి. దీనికి నైలాన్ వల ఉండి, పైన పళ్ళు గల ఇనుపచక్రం ఉంటుంది. ఇది వుపయోగించి కాయలను దెబ్బ తగలకుండా 5 – 7 సెం. మీ. తొడిమెతో కోస్తే కాయ నాణ్యత దెబ్బతినకుండా సాఫీబర్న్ లేకుండా ఉంటుంది. కాయకోతను నిర్ణయించడానికి పండ్లను పంపే మార్కెట్ల దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కాయలను కోయాలి.
కాయలను మాగవేయడం
మానవుని ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మామిడి కాయలను శాస్త్రీయ పద్ధతిలోనే మాగవేయాలి. కానీ మార్కెట్లో 90 శాతం పైగా మామిడి కాయలను కాల్షియం కార్బైడ్ అనే విషపూరిత రసాయనం ద్వారా మాగవేస్తున్నారు.
సరైన పక్వ దశకు చేరని మామిడి కాయలను ఘనపదార్థంగా ఉన్న కాల్షియం కార్బైడ్ ను కాగితం పొట్లాలల్లో కట్టె మామిడి కాయల మధ్య ఉంచుతారు. ఇది ఎసిటిలీన్ అనే విషపూరితమైన వాయువును విడుదల చేసి పక్వ దశకు చేరని మామిడి కాయలపైన పండిన రంగులో పసుపు పచ్చగా, కాయ లోపల కాండం తెల్లగా తయారవుతుంది. దీని ద్వారా పండించిన మామిడి కాయలను వినియోగించిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ద్వారా క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, నీటి అల్సర్ వ్యాధులకు గురవుతున్నారు.
శాస్త్రీయ పద్ధతిలో మాగవేత:
కేంద్ర ప్రభుత్వంలోని భారత ఆహార భద్రతా ప్రాధికార సంస్థ నియమ నిబంధనల ప్రకారం మనిషి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మామిడి పండ్లను రైపెనింగ్ చాంబర్ లో ఇథలిన్ ఉపయోగించి పండించాలి. రైపెనింగ్ చాంబర్ లో 100 ppm సాంద్రతలో, వాయు రూపంలో 15 – 18 డిగ్రీల సెం. గ్రే ఉష్ణోగ్రత, 90 – 95 శాతం తేమను నియంత్రించి 24 – 48 గం.లు సరైన పక్వ దశలో మామిడి కాయలను ఉంచాలి.
మామిడి కాయలను గాలిచొరబడే ప్లాస్టిక్ పెట్టెలో ఒక దానిపై ఒకటి పేర్చి రైపెనింగ్ చాంబర్ గోడలకు తగలకుండా 4 – 6 అంగుళాల దూరంలో ఉంచాలి. మామిడి కాయల ప్లాస్టిక్ పెట్టెలను రైపెనింగ్ చాంబర్ లో 75 శాతం వైశాల్యంలో మాత్రమే పేర్చి 25 శాతం ఖాళీ ఉంచడం ద్వారా గాలి చాంబర్ లో పూర్తిగా ప్రసరించి కాయలన్నీ ఒకేలా పండుతాయి.
రైపెనింగ్ చాంబర్ లో విధిగా ఉండాల్సినవి:
రైపెనింగ్ చాంబర్ గాలి చొరబడని, ఉష్ణోగ్రతను నియంత్రించే ఇన్సులేషన్ చేసిన గది.
ఉష్ణోగ్రతను నియంత్రించే యంత్రాలు.
తేమను నియంత్రించే పరికరాలు/ యంత్రాలు.
గాలిని వ్యాప్తి చేసే యంత్రాలు
ఇథలీన్ వాయువును విడుదల చేసే యంత్రాలు
నిరంతర విద్యుత్తు సరఫరా
ఉష్ణోగ్రత, తేమశాతం, ఇథలీన్ కార్బన్ డై ఆక్సయిడ్  సాంద్రతను సూచించే ఎలక్ట్రానిక్ బోర్డు.

                                                 కె. భవ్యశ్రీ, డా. కె. రాజేష్, డా. ఆర్. సతీష్, టి. అరుణ్ బాబు
Leave Your Comments

ప్రకృతి విధానంలో బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగు..

Previous article

పశుపోషణలో ఖర్చుల తగ్గింపుకు 10 సూత్రాలు..

Next article

You may also like