ఉద్యానశోభ

టమాటా సాగులో మేలైన యాజమాన్యం..

0

టమాటా పంట సాగు చేసే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ రకాలను ఎంచుకోకపోవడం మరియు అన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంచుకోకపోవడం ద్వారా రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడలు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే టమాటాలో ఆర్క అబిద్‌ మరియు అర్క సామ్రాట్‌ సంకరజాతి రకాలను రైతుల క్షేత్రాల్లో విడుదల చేశారు. వీటి సాగు విధానాలు ఈ క్రింద తెలిపిన విధంగా సాగు చేసుకోవాలి.
వాతావరణం :
టమాటా పంటను సంవత్సరం పొడవునా అన్ని రుతువుల్లోనూ సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలం. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి తట్టుకోలేదు.
నేలలు :
బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీన్ని ఇసుకతో కూడిన గరప నేల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగుచేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు.
నాటే సమయం :
వర్షాకాలంలో జూన్‌-జూలైలో, శీతాకాలంలో అక్టోబర్‌- నవంబరులో, వేసవిలో జనవరి – ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఖరీఫ్‌ మరియు వేసవి సాగుకు అనుకూలం కాదు.
రకాలు :
అర్క సామ్రాట్‌ :
పండ్లు గుండ్రంగా, పరిమాణం పెద్దగా ఉండి, పండు బరువు (90- 100 గ్రా.) ఇది మూడు రకాల తెగుళ్లను తట్టుకుంటుంది. ఆకుమాడు తెగులు (ఎర్లీ బ్లైట్‌), వడలు తెగులు బ్యాక్టీరియా విల్ట్‌ మరియు టమాట వైరస్‌ను తట్టుకుంటుంది. దీని పంటకాలం 140 రోజులు మరియు దిగుబడి హెక్టారుకు 80-85 టన్నుల దిగుబడినిస్తుంది.
అర్క అబిద్‌ :
పండ్లు గుండ్రంగా, మధ్యస్థంగా ఉండి సరాసరి పండు బరువు (90-100 గ్రా.) ఉంటుంది. ఇది అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుంది. ఆకుమాడుతెగులు (ఎర్లీ బ్లైట్‌), వడలు తెగులు (బాక్టీరియల్‌ విల్ట్‌), లేట్‌ బైట్‌ మరియు టమాట విప్‌ కర్ల్‌ వైరస్‌ను తట్టుకుంటుంది. ఈ సంకర జాతి రకాన్ని ఖరీఫ్‌, రబీ మరియు ఎండాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది దీని పంటకాలం 140-150 రోజులు మరియు దిగుబడి హెక్టారుకు 70-75 టన్నులు ఇస్తుంది.
విత్తన మోతాదు :
ఎకరాకు సూటి రకాలకు 200 గ్రా. సంకర జాతి రకాలకు 60-80 గ్రా. విత్తనం కావాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా థైరమ్‌తో లేదా 3 గ్రా. మెటలాక్సిల్‌తో, 2 గంటల తర్వాత 4 గ్రా. ట్రైకొడెర్మా కల్చర్ ‌తో విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో రసం పీల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత శిలీంధ్ర నాశనులతో విత్తన శుద్ధి చేయాలి.
నారు పోయడం :
ఎకరం పొలంలో నాటడానికి 4I1 చ. మీ. విస్తీర్ణం గల, 6 ఎత్తైన ఎనిమిది నుండి పది నారుమళ్లు తోటను తయారు చేయాలి. నారు కుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లను శుద్ధి చేయాలి (100 లీ. మందు ద్రావణం 40 చ.మీ. నారుమడికి). విత్తే ముందు విత్తనాలను 600 సెల్సియస్‌ వేడి నీటిలో 5-10 నిమిషాలు ఉంచి తీయాలి. నారుమడిలో 10 సెం. మీ. ఎడంతో వరుసల్లో 1-1.5 సెం.మీ లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి.
విత్తిన వెంటనే రోజ్‌ క్యాన్‌తో నీటిని చల్లి వరిగడ్డితో నారుమళ్ళను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7-10 రోజుకు) మల్చింగ్‌గా వేసిన వరిగడ్డి లేదా పాలిథీన్‌షీట్‌ తీసివేయాలి. 2-3 వారాల వయసులో నారుకుళ్లు తెగులు రాకుండా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ (2.5 గ్రా/లీ) పిచికారీ చేయాలి. 3 వారాల వయస్సు గల నారుమడికి రసం పీల్చే పురుగు నుండి రక్షణకు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలు 40 చ.మీ నారుమడికి 100 గ్రా. చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి.
నారుమడిని పీకడానికి 2-3 రోజులకు ముందుగా లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్‌ 1 గ్రా. కార్భన్‌డిజమ్‌ ను కలిపి నారుమడి పై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు ధృడపడటానికి గింజ విత్తిన 21-25 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. 21-25 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు.
నాటటం :
వర్షాకాలంలో 60I45 సెం.మీ శీతాకాలంలో 60.30 సెం.మీ వేసవిలో 45.30 సెం.మీ దూరంలో నాటుకోవాలి.
ఎరువు :
చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలో భాస్వరం (150 కిలో సూపర్‌ ఫాస్పేట్‌) మరియు 24 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువును (40 కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) వేయాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమపాళ్లుగా చేసి నాటిన 30,45 మరియు 60వ రోజున పై పాటుగా వేసి బోదలో ఎగరేయాలి పూత దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8-12 కిలో చొప్పున బోరాక్స్‌ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరానికి 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేసినట్లయితే జింకు లోపం రాకుండా ఉంటుంది. నాటిన తర్వాత 30,45 రోజులకు లీటరు నీటికి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ను కలిపి పిచికారీ చేసినట్లయితే 20 శాతం దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మి.గ్రా. 24 డి మందు 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మి.లీ ప్లాన్‌ ఫిక్స్‌ 4 లీ / నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత, పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.
కలుపు నివారణ, అంతరకృషి :
కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్‌ 1.0 లీ. (తేలిక నేలలు), 1.20 లీ. (బరువు నేలలు) 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలోపు తడినేలపై పిచికారీ చేయాలి. మెట్రిబుజిన్‌ అనే మందును 300 గ్రా. మోతాదులో నాటిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి వరుస మధ్య పిచికారీ చేయాలి. నాటిన 30`35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పొలంలో కలు పు లేకుండా, మొదటి నాలుగు వారాల్లో అంతరకృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.
పొడవుగా పెరిగే హైబ్రీడ్‌ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా కర్రను పాతి ఊతం ఇవ్వాలి. అంతేకాక కాయలు నేలకు తగిలి చేడిపోకుండా కాపాడవచ్చు, వేసవి టమాట పంటకు ఎండ తీవ్రత తగ్గించుటకు ప్రతి 2-3 వరుసల టమాటాలకు రెండు వరుసల మొక్కజొన్న పండును ఉత్తర దక్షణ దిశలో విత్తుకోవాలి.
నీటి యాజమాన్యం :
భూమిలో తేమనుబట్టి 7 -10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది. డ్రిప్‌ పద్ధతిలో నీటిని అందించినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు.
ఊతం ఇవ్వడం :
టమాటా మొక్కలను వెదురు బొంగు, జిఐ వైర్ల సాయంతో ఏర్పరచిన ట్రెల్లీస్‌ పైకి పురికొస సాయంతో పాకించడం వల్ల బాగా గాలి, వెలుతురు తగిలి తెగుళ్ళ బెడద తగ్గించవచ్చు. అంతేకాకుండా కాయలు నేలకు తగలవు కాబట్టి కాయకుళ్ళు తగ్గి మంచి నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు.
దిగుబడి మరియు ఆదాయ వ్యయ నిష్పత్తులు :
రైతులు సాగు చేసినా అర్క అబిద్‌, అర్క సామ్రాట్‌ మరియు లక్ష్మి సంకర జాతి రకాలు ఈ క్రింద పట్టికలో తెలపబడ్డాయి.
1 సంకరజాతి రకం : అర్క అబిద్‌
దిగుబడి టన్నులు/హెక్టరుకు : 47.04
పెట్టుబడి : 1,05,462
మొత్తం ఆదాయం రూ. హెక్టారుకు : 3,76,320
నికర ఆదాయం రూ. హెక్టరుకు : 2,70,858
ఆదాయ వ్యయం నిష్పత్తి: 1:2.55
2.సంకరజాతి రకం: అర్క సామ్రాట్‌
దిగుబడి టన్ను/హెక్టరుకు: 45.25
పెట్టుబడి: 1,05,462
మొత్తం ఆదాయం రూ. హెక్టారుకు: 3,62,000
నికర ఆదాయం రూ. హెక్టరుకు : 2,56,538
ఆదాయ వ్యయం నిష్పత్తి: 1:2.43
3.సంకరజాతి రకం: లక్ష్మి
దిగుబడి టన్ను/హెక్టరుకు : 34.13
పెట్టుబడి : 1,05,462
మొత్తం ఆదాయం రూ. హెక్టారుకు : 2,73,040
నికర ఆదాయం రూ. హెక్టరుకు : 1,67,578
ఆదాయ వ్యయం నిష్పత్తి : 1:1.58
లక్ష్మి సంకరజాతి రకం కన్నా అర్క అబిద్‌ దిగుబడి 27.3 శాతం మరియు అర్క సామ్రాట్‌ 23.5 శాతం ఎక్కువగా ఉంటుంది.

Leave Your Comments

విదేశాల బాట వీడి.. కూరగాయల సాగు

Previous article

ఆముదం సాగు – యాజమాన్య పద్ధతులు

Next article

You may also like