Grow bag Cultivation: వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడచిన 5 దశాబ్దాల్లో సాగులో అనేక విప్లవాత్మక మార్పులకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక నూతన విధానాన్ని రైతులు ఆవిష్కరిస్తూ ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు వ్యవసాయ పరిశోధనా క్షేత్రం లో బ్యాగ్ సేద్యం పరిచయం చేశారు. నేలలో నేరుగా నాటడం కన్నా బ్యాగుల్లో సారవంతమైన మట్టి నింపి అధిక దిగుబడులు సాధించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
భూసారం లేకపోయినా పరవాలేదు
పంటల దిగుబడి బాగా రావాలంటే భూసారం బాగా ఉండాలి. ఏటా వరదలు, కరువు పరిస్థితులతో చాలా భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. అయినా రైతులు కంగారు పడాల్సిన పనిలేదు. తాజాగా సేంద్రీయ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం నూతన విధానాన్ని ఆవిష్కరించారు. తునికిలో రామానాయుడు వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో బ్యాగులో మట్టిని నింపి పెద్ద ఎత్తున సేంద్రీయ కూరగాయలు సాగు చేశారు. ఆ విధానాలను కేవీకే శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి మేలైన విధానంగా కొనియాడారు.
బెడ్లపై పూలు, కూరగాయల సాగు
ఎత్తైన బెడ్లు తయారు చేసుకుని పూలు, కూరగాయలు, పండ్లు సాగు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎత్తు బెడ్లపై వేసవిలో కాకర సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరాకు 4.48 టన్నుల సేంద్రీయ కాకర దిగుబడులు సాధించినట్టు తునికి కేవీకే ప్రకటించింది. 12.5 సెంట్లలో కాకర సాగు చేసి 1000 విత్తనాలు నాటారు. ఎత్తైన బెడ్లపై నాటి అధిక దిగుబడి సాధించినట్టు రైతు శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎత్తైన బెడ్లపై మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందించారు. ఏప్రిల్ 17 నుంచి జులై 12 వరకు రెండు నెలలపాటు పంట దిగుబడి వచ్చిందని. వెయ్యి మొక్కల నుంచి 560 కిలోల దిగుబడి సాధించారు. ఒక్కో మొక్క ద్వారా సగటున 0.56 కిలోల దిగుబడి సేంద్రీయ పద్దతిలో సాధించారు. సగటున ఎకరాకు 1.92 లక్షలు ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: Grapes Orchard: ద్రాక్ష పండ్ల తోటని ఇలా మొదలు పెట్టి, సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!
బ్యాగుల్లో కాకర సాగు ఇలా
ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంట అదీ కూడా సేంద్రీయ విధానంలో దిగుబడులు తీసిన రైతు శాస్త్రవేత్త అనేక కొత్త విషయాలు ప్రకటించారు. బ్యాగుల విధానంలో ఎకరాకు 8 టన్నుల సేంద్రీయ కాకర పంట పండించారు. అంటే ఎత్తైన బెడ్ల కన్నా బ్యాగులో మట్టి నింపి చేసిన సేంద్రీయ సాగులోనే అధిక దిగుబడులు సాధించినట్టు పరిశోధనల్లో వెల్లడైంది. కాకర విత్తన 75 రోజులకు పంట కోత మొదలైంది. 175 రోజుల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంది. 25 సెంట్ల భూమిలో బ్యాగు విధానంలో కాకర సాగు చేసి 2 టన్నుల సేంద్రీయ దిగుబడులు సాధించారు. ఎకరాకు 2.4 లక్షలు ఖర్చవుతుందని రైతు శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
టమాటా, పుదీనా, క్యాబేజీ
కాకరతో పాటు బ్యాగుల విధానంలో టమాట , పుదీనా, క్యాబేజీ కూడా పండించి మంచి దిగుబడులు సాధించారు.25 సెంట్లలో 1566 బ్యాగులు పెట్టారు. వీటిలో మట్టి నింపి టమాట సాగు చేసి 3.64 టన్నుల దిగుబడి సాధించారు. 616 బ్యాగుల్లో కాకర సాగు చేసి 2 టన్నుల దిగుబడి సాధించగా, 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు నాటి 374 కిలోల దిగుబడి తీశారు. ఇక 180 బ్యాగుల్లో ఒక్కో దానిలో రెండేసి మొక్కలు నాటారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కో టమోటా మొక్క ఒక పుదీనా మొక్క నాటారు. మొత్తం 435 కిలోల టొమాటో, 83.6 కిలోల పుదీనా దిగుబడి సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పారు.
Also Read: Mango Orchards: మామిడి తోట ప్రతి సంవత్సరం కాయలు రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ?