ఉద్యానశోభ

‘మే’ మాసంలో ఉద్యాన పంటల్లో చేయవలసిన సేద్యపు పనులు..

0

మామిడి: కాయ కోతకు 15-20 రోజుల ముందు నీరు నిలిపివేసినట్లైతే కాయ నాణ్యత పెరుగుతుంది. చల్లని వేళల్లో కాయలు కోయాలి. కాయలను 6-7 సెం.మీ తోడిమలతో కోయవలెను. కాయకు సొన అంటకుండా తల క్రిందులుగా ఉంచి, సొన మొత్తం కారిపోయిన తరువాత, గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ చేసుకోవాలి. పక్వానికి వచ్చిన కాయలను కోసి, రైపనింగ్ ఛాంబర్ లో ఉంచి 100 పి.పి.యం ఇథలిన్ వాయువును ప్రవేశపెట్టి 24 గంటలు ఛాంబర్ తలుపు తెరవకుండా ఉంచాలి. తరువాత బయటకు తీస్తే మంచి రంగు సంతరించుకొని తినడానికి అనువుగా ఉంటాయి. దూర ప్రాంత రవాణా కోసం కాయలను కోసిన తరువాత 10 గంటల్లోపు శీతల గడ్డంగులల్లో 12.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమవద్ద నిల్వ ఉంచాలి.
జామ: ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, కాపు కాసిన కొమ్మలను చివరి నుండి 5-6 సెం.మీ లోపలికి కత్తిరించాలి. మంచి నాణ్యతతో చలి కాలంలో వచ్చే మ్రిగ్ బహర్ పంట కోసం, చెట్లకు నీరు ఇవ్వకుండ బెట్టకు గురిచేయాలి.
అరటి: అరటిగెల తొండంపై నేరుగా ఎండ పడటం వలన, వేడికి మచ్చలు ఏర్పడి ఆ భాగం చనిపోతుంది. ఎండ దెబ్బకు ఏర్పడిన మచ్చలు విస్తరించకుండా వెంటనే లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలి.
నిమ్మ: ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 5-10 గ్రా. సున్నం కలిపి పిచికారీ చేస్తే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వీలుంటుంది. సున్నం పిచికారీ చేశాక 15 రోజులకు యూరియా లేదా పొటాషియం నైట్రేట్(10 గ్రా/లీ. నీటికి) పిచికారీ చేయాలి.
సపోట: ముదురు తోటల్లో నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళల్లో తొడిమతో సహ కోసుకోవాలి.
దానిమ్మ: చెట్లకు పూర్తిగా విశ్రాంతి నివ్వాలి. బాక్టీరియా తెగులును అదుపులో ఉంచటానికి ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారీ చేయాలి.
పనస: కళ్ళు పూర్తిగా విచ్చుకొని, పసుపుపచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కోత తరువాత ఎండిన రెమ్మలను తీసివేసి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రేగు: పాదుల దగ్గర మట్టిని తిరగబెట్టి, నిద్రావస్థ దశలో ఉన్న కాయ తొలుచు పురుగులను నాశనం చేయాలి.
బొప్పాయి: అయిదు నెలలు దాటిన తోటల్లో ప్రతి మొక్కకు 25-30 లీటర్లు నీటిని ప్రతిరోజు డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగేకొద్ది ఆకుముడత, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకు వేపనూనె 2.5 మి.లీ + ఎసిఫేట్ 1.5 గ్రా. +జిగురు 0.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని బట్టి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉధృతి నియంత్రణకు పసుపు రంగు జిగురు అట్టలను, పేనుబంక ఉధృతి నియంత్రణకు నీలం రంగు అట్టలను ఎకరాకు 12-15 చొప్పున పంట ఎత్తులో అమర్చాలి.
టమాట: డ్రిప్ పద్ధతిలో నీటిని అందించడం వలన 30-40% దిగుబడి పెరుగుతుంది. టమాటలో నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయ పగుళ్ళు సమస్య వస్తుంది. కాయ పగుళ్ళు సమస్య నివారణకు క్రమం తప్పకుండా నీటి తడులు అందిస్తూ బోరాక్స్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రతి కిలో యూరియాకు అరకిలో పొటాష్ వాడితే రోగనిరోధిక శక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని తట్టుకోవటానికి వీలుగా మొక్క ఎదుగుదల కోసం 2 శాతం యూరియా ద్రావణం పిచికారీ చేయాలి. కాయ క్రింద కుళ్ళు నివారణకు కాల్షియం నైట్రేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి. వేసవిలో పూత, పిందె నిలవటానికి ఫానోఫిక్స్ 2.5 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం రోజులలో వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే కోత దశలో కాయ పూర్తి ఎరుపు రంగులోకి మారదు. ఒక రకమైన నారంజ పసుపు రంగులోకి మారి కాయ నాణ్యత దెబ్బతింటుంది. పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెంటీగ్రేడ్, రాత్రి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే కాయలు రంగుకి మారవు. కాయలు కొంచెం రంగు మారగానే కోసి నీడలో ఉంచితే తరువాత ఎరుపు రంగులోకి మారుతాయి.
వంగ: కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఉనికిని గమనించవచ్చును. లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. చివరగా పురుగు నివారణకు 2 మి.లీ ప్రొఫినోఫాస్ లేదా 0.4 గ్రా ఇమామక్టిన్ బెంబోయేట్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగును గమనించినట్లైతే నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
బెండ: రసం పీల్చే పురుగులను గమనించినట్లైతే, నివారణకు 2 మి.ల్లీ డైమిధోయేట్ లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్ర నల్లి నివారణకు లీటరు నీటికి 5 మి.ల్లీ డైకొఫాల్ లేదా 1 మి.లీ ప్రోపర్ గైట్ కలిపి పిచికారీ చేయాలి.

మిరప: మిరపలో సెర్కొస్పోరా ఆకుమచ్చ తెగులు గమనించినట్లైతే నివారణకు 2 గ్రా. కార్బండిజమ్+మాంకొజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్+1 గ్రా. ప్లాంటమైసీన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తామర పురుగులను గమనించినట్లైతే, నివారణకు 0.3 మి.లీ స్పైనోసాడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పందిరి కూరగాయలు: పండు ఈగను నివారించుటకు పూత, పిందె దశల్లో మలాధియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. 100 మి.లీ మలాధియాన్+100 గ్రా. చక్కెర/బెల్లం/పులిసిన పండ్ల రసంను లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమీదల్లో పోసి పొలంలో అక్కడక్కడ ఎరగా పెట్టాలి.
బీరకాయ: బీరలో పాముపొడ తెగులు ఆశించడం వలన తెల్ల చారలు ఆకులు మీద కనిపిస్తాయి. నివారణకు 3 మి.లీ వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పుచ్చ: కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఎక్కువ నీరు ఇవ్వకూడదు ఎక్కువ నీరు పడితే, కాయలు పగిలి నాణ్యత తగ్గుతుంది. కోతకు 15 రోజులు ముందు 2 గ్రా బోరాక్స్ ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
కరివేపాకు: పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీల్చివేస్తాయి. నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అల్లం: అల్లం విత్తుటకు అనువైన సమయం. ఎత్తు మడులు జంట కాల్వల పద్ధతిలో అల్లం విత్తితే అధిక దిగుబడులు వస్తాయి.
జీడిమామిడి: తామర పురుగులు పెరుగుతున్న కాయలను, పండ్లను గీకి రసం పీల్చడం వలన గరకు మచ్చలు ఏర్పడి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. కాయ, గింజ తినే పురుగులు కాయ, గింజ మధ్య గల ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించి పండులోని గుజ్జును, గింజలోని పప్పును తింటాయి. వీటి నివారణకు లామ్డా సైహలోత్రిన్ 0.6 మి.లీ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ మార్చి మార్చి వేపనూనె 5 మి.లీ తో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

 డా॥ ఎమ్.వెంకటేశ్వర రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హర్టీకల్చర్,

డా॥ ఎ.నిర్మల అసిస్టెంట్ ప్రొఫెసర్
కె. చైతన్య అసిస్టెంట్ ప్రొఫెసర్
డా॥ ఎ.మనోహర్ రావు సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్,

రాజేంద్రనగర్, హైదరాబాద్, Phone: 9491151524

Leave Your Comments

పొగాకులో సస్యరక్షణ మందుల అవశేషాలు బెడదను అధిగమించడం ఎలా?

Previous article

ధాన్యానికి మద్ధతు ధరలు దక్కాలంటే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ..

Next article

You may also like