ఉద్యానశోభ

ఉద్యాన పంటలు పండిస్తున్న..అంతర్గాము

0

రోజు రోజుకి వ్యవసాయం తీరు మారుతున్నది. మన రైతులు తెలివితో సాగు చేస్తున్నారు. ఉపాయంతో ఉద్యాన తోటల్ని పెంచుతున్నారు. లాజిక్ తో లాభాలు గడిస్తున్నారు. మోటు వ్యవసాయానికి, మూస పద్ధతులకు స్వస్తి పలికి ఉద్యాన సిరులు పండిస్తున్నారు. అలాంటి ఒక ఆదర్శ గ్రామమే అంతర్గాము. ఎనిమిది రకాల పండ్ల తోటలతో జగిత్యాల జిల్లాలోనే “హార్టికల్చర్ హబ్” గుర్తింపు పొందిన ఆ రైతుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జగిత్యాల జిల్లా రైతులు సాంప్రదాయేతర పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో తీరు సాగు విధానాలను అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్గాము నుంచి మొదలుపెడితే మల్యాల మండలం గొర్రెగుండం వరకు ప్రతీ రైతుకొక ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఆధునిక సాగు విధానాలు అవలంభిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నవారే . పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయాన్నిచ్చే తోటలను సాగు చేస్తున్నారు.
అంతర్గాము – గొర్రెగుండం గ్రామాల మధ్య ఎనిమిది రకాల పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. శతాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతాలు మామిడితోటలకు పేరు పొందాయి. కాలగమనంలో మామిడి తోటల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వకాలానికి సంబంధించిన మామిడితో పాటు, బంగినపల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచుతున్నారు. ఈ ప్రాంతం నుంచి విదేశాలకు మేలు రకమైన మామిడికాయలు ఎగుమతి అవుతున్నాయి. ఎస్సారెప్సీ కాలువ నీరు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా, ఎస్సారెప్సీ పునరుజ్జీవనం విధానం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో నీటి వసతి పుష్కలంగా ఉంది. దీంతో రైతులు కొత్త పంటలను సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్గాము గ్రామంలో ప్రస్తుతం నాలుగు రకాల పండ్లతోటలు సాగవుతున్నాయి.
అంతర్గాము గ్రామంలో సుభాష్ రెడ్డి అనే రైతు రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసి ఫలసాయం పొందిన తోలి వ్యక్తి గా సుభాష్ రెడ్డి గుర్తింపు పొందాడు. అలాగే తైవాన్ జామతో పాటు, సాంప్రదాయ జామతోటలను సైతం సుభాష్ రెడ్డి ఐదెకరాల్లో సాగు చేస్తున్నాడు. గతేడాది నుంచి ఏడాదికి మూడు దఫాల్లో సుభాష్ రెడ్డి జామ పంట సాయాన్ని పొందుతున్నాడు. ఐదు ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామంలో దాదాపు యాభై ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. అరటితోటలతో పాటు బొప్పాయి తోటలు సైతం గ్రామంలో పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
గొర్రెగుండం గ్రామానికి చెందిన సాయిని వేణుగోపాల్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన వాతావరణంలో తట్టుకునే జామ, ఆపిల్ బేర్ తోటలను పరిశీలించాడు. ఐదెకరాల్లో మామిడి ప్రత్యామ్నాయంగా ఆపిల్ బేర్ ను ఎంచుకున్నాడు. ఆపిల్ బేర్ కు సంబంధించిన మొక్కల రకం తైవాన్ బర్ లో ఎరుపు, ఆకుపచ్చ రెండు రకాలు ఉండగా, ఆకుపచ్చ రకం కాయలు వచ్చే మొక్కలను సాగు చేస్తున్నాడు. ఏడాదిలో రెండుసార్లు ఫలసాయాన్ని పొందడానికి కొంత కృషి చేస్తే ఏడాదంతా ఫలసాయం పొందేందుకు సైతం అవకాశాలున్నాయని పేర్కొన్నాడు వేణుగోపాల్. ఆపిల్ బేర్ కాయల పరిణామాన్ని బట్టి మార్కెట్ లో రెండు రకాలుగా పేర్కొంటారు. వంద గ్రాములు పైచిలుకు ఉంటే ఏ గ్రేడ్ గా, అంతకు తక్కువ బరువు ఉంటే బీ గ్రేడ్ గా చెబుతారని, ఏ గ్రేడ్ కు మంచి ధర పలుకుతుందని, బీ గ్రేడ్ కాయలకు కొంత తక్కువ ఆదాయం వస్తుందంటున్నారు. మామిడి ఎకరానికి 40 చెట్లు వస్తే, ఆపిల్ బేర్ 90 నుంచి 100 వరకు వచ్చే అవకాశం ఉంటుందని దిగుబడి రీత్యా కూడా ఒక్కో ఆపిల్ బేర్ చెట్టు నుంచి 20 కిలోల వరకు వచ్చే అవకాశం వుంటుందన్నాడు. గొర్రెగుండం గ్రామ శివారులో సాయిని వేణుగోపాల్ తో పాటు రామన్నపేట గ్రామానికి చెందిన మరో రైతు బొడిగె గంగ నర్సయ్య తనకున్న పదెకరాల్లోనూ ఆపిల్ బేర్ తోటలను సాగు చేస్తున్నాడు.

Leave Your Comments

సాగు భూముల్లో..అధికంగా భాస్వరం

Previous article

ఉలవలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Next article

You may also like