గులాబీ సాగులో అధిక పూల దిగుబడుల కోసం …
గులాబీలో నాణ్యమైన పూల ఉత్పత్తి కోసం మొక్క అడుగుభాగంలో ఉన్న కొమ్మలను క్రమ పద్దతిలో ఉంచాలి. నాటిన వెంటనే పూలు రాకుండా ఎక్కువ పక్క కొమ్మలు వచ్చే విధంగా అనువైన పరిస్థితులు కల్పించినట్లయితే మార్కెట్ కు అవసరమైన పూలు వస్తాయి.
దృఢమైన కాండం వచ్చే విధంగా చేసుకోవచ్చు. సాధారణంగా కోత సమయంలోనే ఒకటి లేదా రెండు ఆకులు మాత్రమే ఉంచి మిగతా కాడ భాగం పువ్వుతోసహా కత్తిరించాలి. ఈ విధమైన కత్తిరింపుల వల్ల కాడ మీద ఉన్న నిద్రాణ స్థితి (డార్ మెన్సీ) లో ఉన్న మొగ్గలు కొత్త పూకొమ్మలుగా ఏర్పడి పూలు వస్తాయి.
సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎగుమతికి అనుకూలమైన కాలంగా పరిగణిస్తారు. మిగతా సమయాలలో పూలను స్థానిక మార్కెట్ కు పంపించడం లేదా మొక్కల నుంచి పూలను తీసికోకుండా విశ్రాంతి నివ్వటం ద్వారా మొక్కలు బాగా అభివృద్ధి చెందేలా చేసి తర్వాత సీజన్ లో పూలను ఎగుమతి చేస్తారు. ఈ విధంగా మొక్కలకు ఒకటి లేదా రెండు నెలల పాటు ఎరువులు, నీరు ఇవ్వకుండా విశ్రాంతినిచ్చి ఆ తర్వాత కత్తిరింపులు చేసి నీరు, ఎరువులను ఇస్తారు. కాని ఇలా చేయటం వల్ల ఎక్కువగా బలహీనమైన కాడలు రావడం జరుగుతున్నట్లు గమనించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మొక్కలకు తేలిక పాటి తడులు, ఎరువులు ఇస్తూ పూమొగ్గలు బఠాని గింజ పరిమాణంతో ఉన్నప్పుడు తుంచివేయడంతో పాటు తర్వాత వస్తున్న పక్క కొమ్మలను కూడా తుంచి వేయటం ద్వారా మొక్కలకు తగిన విశ్రాంతి కలుగుతుంది.
డా. గద్దె జ్యోతి, డా. జెహ్రా సల్మా,
డా.ఎస్.ప్రణీత్ కుమార్,
పూల పరిశోధనా స్థానం,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం
రాజేంద్రనగర్, హైదరాబాదు.