Farming Techniques in Dryland: తెలంగాణలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సరాసరి సంవత్సర వర్షపాతం 906 మి.మీ. కాగా, ఇందులో 76% వర్షం నైరుతి ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. తెలంగాణలో ఎర్రనేలలు 54%, నల్లనేలలు 23%, ఒండ్రు నేలలు 9% . మరియు మిగతా నెలలు 7% ఉన్నాయి. ఈ అన్ని నెలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతుంది.
భూసంరక్షణ: వర్షం తక్కువగాను మరియు సకాలంలో పడక పోవటం వలన పంటల దిగుబడిలో చాలా వ్యత్యాస ముంటుంది కావున మెట్టసాగులో భూసంరక్షణ మరియు ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్దతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించవచ్చు.

Farming Techniques in Dryland
ఎర్ర నేలలు: ఎర్రనేలలు లోతు తక్కువ మరియు నీటిని నిల్వ వుంచుకొనే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో అధిక వర్షం లేక ఎడతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీరు ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వారా… సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవటం జరుగుతుంది. వీటిని రక్షించటానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మెట్ట వ్యవసాయాభివృద్ధిలో భూసంరక్షణ చాలా ప్రాధాన్య మయినది.
- వాలుకడ్డంగా దుక్కిదున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు.
- పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు. చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు తేమ సంరక్షించబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగు నీరు బయటకు వెళ్ళుటకు వీలవుతుంది లేదా ప్రతి 2.4 నుండి 3.6 మీ.. అంతరంలో దుంపనాగలితో గొడ్డు చాలును ఏర్పాటు చేయాలి.
- బెట్టపరిస్థితులలో ఒకటి లేక రెండుసార్లు దంతి సహాయంతో తేలికగా అంతరకృషి చేస్తే దుమ్ము దక్షకు కవచంగా ఏర్పడి తేమ సంరక్షించబడుతుంది.
- రెండు శాతం వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 ఘనపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేయాలి.
- నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరాకు 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి, కాయలు బాగా వూరడానికి అవకాశముంటుంది. వర్షపు నీరు బాగా భూమి లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది..
- జొన్న, వేరుశనగ పంటల్లో అంతరపంటగా కందిని వేసేటప్పుడు, కందితోపాటు ఒరవడిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే, ఒరవడి అరికట్టబడటమే కాకుండా, అధిక నికరాదాయం పొందవచ్చు.
నల్ల నేలలు: నల్ల నేలలకు నీటిని నిల్వ వుంచుకొనే శక్తి అధికం. వర్షపు నీరు త్వరగా ఇంకనందువలన ఎక్కువ శాతం నీరు, మట్టి కొట్టుకొని పోతుంది. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూసంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతులను అవలంభించాలి.

Black Soil Lands
Also Read: Dryland Agriculture Problems: మెట్ట ప్రాంత పంటల ఉత్పత్తి లో సమస్యలు మరియు యాజమాన్యం.!
ఎర్రనేలలకు కాంటూరు గట్ల మాదిరిగా నల్ల నేలలకు 0.8 ఘనపు మీటర్ల గ్రేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్ల పైభాగాన 0.1-0.25 శాతం వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరచి, ఈ కాలువలను పెద్ద కాలవలతో కలిపి, నేల కోత లేకుండా, నీటిని బయటికి పోయేలా చేయాలి. వెడల్పాటి బోదెలు-కాలువలుగా నేలను తయారుచేసి, వెడల్పాటి బోదెలపైన విత్తుకోవాలి. కాలువలు మురుగు నీటిని బయటికి పంపడానికి ఉపయోగపడతాయి.
లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్ధతి అనుకూలం లేదా మూడు మీటర్ల వెడల్పుతో, 20 సెం.మీ. ఎత్తు గల వెడల్పాటి బోదెలు చేసి విత్తుకొన్న మంచి దిగుబడులు వస్తాయి. బోదెల ప్రక్కన కాలువలు, తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఉపయోగపడతాయి. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.
అనువైన పంటలు మరియు విత్తే సమయం: వర్షం వచ్చే సమయాన్ని మరియు నేల స్వభావాన్ని బట్టి పంటలను నిర్ణయించుకోవాలి.
-ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
-డా. కె.శైలజ, డా.కె. పవన్ చంద్రారెడ్డి, డా.ఎస్.హెచ్.కె. శర్మ మరియు డా. జి. జయశ్రీ
Also Read: Dryland Agriculture: మెట్ట వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తారు.!
Must Watch: