Grow Rose: సృష్టిలో ఎన్ని రకాల పూలు ఉన్నప్పటికీ… ఆ పువ్వు ప్రత్యేకతే వేరు..పరిమళంతో ఆకట్టుకుంటూ..రంగూ రూపుతో ఆకర్షించే సకలగుణాల సౌందర్యం రోజా సొంతం. ప్రస్తుతం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న మహిళలు గులాబీ మొక్కలను పెంచుతున్నారు. అయితే గులాబీ కొమ్మలను ఇలా నాటుకుంటే 100% సక్సెస్ అవుతారని అంటున్నారు.
గులాబీ మొక్కను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టెర్రస్ గార్డెనర్ మాధవి గారి మాటల్లో చూద్దాం…గులాబీ కొమ్మల్ని ముదురు, మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకుని ఎంచుకోవాలి. అదేవిధంగా కొమ్మలు గ్రీన్ కలర్ లో ఉండేలా చూసుకోవాలి. తర్వాత కింద భాగంలో కత్తిరించాలి. తర్వాత కొమ్మల్ని పై భాగాన ఒక జానెడు మేర ఎంచుకుని కత్తిరించుకోవాలి. అయితే పక్కన ఏమైనా కొమ్మలు ఉంటే వాటిని కూడా తీసివేయాలి. అలా అన్ని కొమ్మలు ఒకే సైజులో ఉండేలా చూడాలి.
కుండీల్లో ఆ కొమ్మల్ని పెట్టేముందు కింద భాగాన కొంత మేర ఆకుపచ్చ లేయర్ ని తీసివేయాలి. అలా చేయడం ద్వారా ఎక్కువ వేర్లు పెరుగుతాయి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం తేనే , మరి కొంచెం కలబంద గుజ్జు తీసుకోని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొమ్మల కింద భాగాన ఆ మిశ్రమాన్ని పట్టించి కుండీలో కన్నాలు చేసుకుని ఒక్కొక్క కొమ్మను కుండీలో అమర్చుకోవాలి. దీన్ని మొక్కకు ఇచ్చే రూటింగ్ హార్మోన్ అని కూడా అంటారు. అయితే మరో కుండీ తీసుకుని అందులో తేనే, కలబంద మిశ్రమం లేకుండా కేవలం కత్తిరించిన కొమ్మల్ని మాత్రమే అమర్చుకోవాలి. అలా కొంతసేపటి తర్వాత పైపైన కొంచెం నీళ్లను చల్లుకోవాలి. తర్వాత పాలిథీన్ కవర్ ని కుండీలకు అమర్చి పక్కన పెట్టుకోవాలి.
వారం రోజుల తర్వాత ఆ రెండు కుండీలను ఒకసారి గమనించాలి. వారం తర్వాత రెండు కుండీలలో ఉన్న కొమ్మలకు చిన్న చిన్న చిగుళ్ళను మీరు గమనిస్తారు. మళ్ళీ రెండు వారాల తర్వాత ఆ రెండు కుండీలను మళ్ళీ ఒకసారి తెరిచి చూడాలి. రెండు వారాల తర్వాత రెండు కుండీలలోనూ చిగురించిన ఆకులను చూడవచ్చు. అయితే ఒక్కసారి ఆకులు వృద్ధి చెందిన తర్వాత ముందుగా అమర్చిన పాలిథీన్ కవర్లకు పైన భాగంలో రెండు రంధ్రాలను చేసుకోవాలి.
ఆకులు వచ్చాక వాటికి శ్వాస అనే ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి అలా కవర్లకు రంధ్రాలను చేసుకోవాలి. ఇలా మరో వారం అలా కవర్లతోనే ఉంచి తర్వాత కవర్లను తీసివేసి మొక్కను ఎండకు పరిచయం చేయాలి. దాని వల్ల మొక్కకు సూర్యరశ్మి అంది మొక్క మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది.