Dragon Cultivation: డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఈ పండులో ఎన్నో పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క కాక్టస్ అనే జాతికి చెందినది కనుక దీన్ని సహజంగానే ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే సామర్థ్యం మరియు అతి తక్కువ యాజమాన్య అవసరం కలిగి ఉంటుంది. ఈ పంటను ఒక్కసారి వేసినట్లయితే 20 సంవత్సరాల పాటు ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. ఇంతటి మంచి లక్షణాలు గల డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్‌ను ఎంతగానో ఆకర్షించడం చేత దీన్ని సాగు చేసే ప్రాంతం, ప్రదేశాలు పెరిగిపోయాయి. మనదేశంలో ఈ పండును సాగుచేయడం 1990 నాటి నుండి ఆచరణలో ఉన్నప్పటికీ దీని దిగుబడి మాత్రం గడిచిన 2020 సంవత్సరం నుండి విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వాణిజ్య ఉత్పత్తులను ప్రోత్సహించే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు దీని అధిక ఉత్పత్తి కారణాలు.
Also Read: Dragon Fruit Propagation: కట్టింగ్ల ద్వారా డ్రాగన్ ఫ్రూట్ ప్రవర్ధనం
డ్రాగన్ ఫ్రూట్ పుట్టుకకి సరైన ఆధారాలు లేనప్పటికీ ఉష్ణమండల ప్రాంతాల్లో మెక్సికో, సెంట్రల్ అమెరికా మరియు ఉత్తర దక్షిణ అమెరికాలో దీని పుట్టినిల్లు అని భావిస్తారు. ప్రపంచంలో దాదాపు 93 శాతం డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి వియత్నాం, చైనా మరియు ఇండోనేషియా నుండే వస్తుంది. అధిక దిగుబడి వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటుంది. వీటి ప్రయోజనాల్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం కృషి చేస్తోంది.
డ్రాగన్ ఫ్రూట్ యొక్క శాస్త్రీయనామం హైలోసెరియస్ కాక్టస్. ఈ పండును పిటాయా/ పిటాహయా అని పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో ఉంటుంది. ఈ పండు చుట్టూ ఉన్న రేకులు పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని గుజ్జు తెలుపు రంగులో ఉండి మధ్యలో చిన్న నల్లని గింజలుంటాయి.
ఈ గింజలు చూడడానికి అరటి పండు గింజల్లాగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పండ్లలోని గుజ్జు గులాబీ రంగులో ఉండేలా మార్పులు చేశారు. ఈ పండు కొంచెం ఖరీదైనది. ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఒక్కో పండు సుమారు 70 నుండి 100 రూపాయలు ఉంటుంది వీటి రుచి విషయానికొస్తే ఈ పండు కొంచెం తీపి కొంచెం పుల్లగా ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ పోషక విలువలు (100 గ్రాములు)
ప్రోటీన్లు `1.1 గ్రాములు, కొవ్వు`0.57 గ్రాములు, గ్లూకోజు`5.7 గ్రాములు, ఫ్రక్టోసు` 3.2 గ్రాములు, పిండిపదార్థాలు `11.75 గ్రాములు, పీచుపదార్థాలు `1.34 గ్రాములు, శక్తి `67.70 క్యాలరీలు, విటమిన్-సి ` 3.0 గ్రాములు, తైయామిన్ బి1 `0.02 8-0.043 మిల్లీ గ్రాములు, రైబోఫ్లెవిన్ బి2 `0.043-0.045 మిల్లీ గ్రాములు, నియాసిన్ బి3` 2.8 మిల్లీ గ్రాములు, క్యాల్షియం `10.2 మిల్లీ గ్రాములు, ఐరన్ `3.37 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం `38.9 మిల్లీ గ్రాములు, జింక్ `0.35 మిల్లీ గ్రాములు, పాస్పరస్ `27.5 మిల్లీ గ్రాములు, పొటాషియం`272.0 మిల్లీ గ్రాములు, సోడియం `8.9 మిల్లీ గ్రాములు.
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు:
. డ్రాగన్ ఫ్రూట్‌లో అధిక పోషక విలువలు విటమిన్లు మినరల్స్ పీచుపదార్థాలు మెండుగా ఉండటం చేత దీన్ని ఒక సంపూర్ణ ఆహారం అని చెప్పవచ్చు.
. ఇందులోని తక్కువ క్యాలరీలు బరువు తగ్గాలి అనుకునే వారికి ఉపయోగపడతాయి
. దీనిలోని పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించడానికి గట్ బ్యాక్టీరియాను పెంచడానికి తోడ్పడి జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లోని కెరోటినాయిడ్స్ ఫ్రీరాడికల్స్ నుండి కాపాడి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది.
. ఈ పండు బ్లడ్ షుగర్‌ని అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాకుండా ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఎన్నో రకాల గుండె సమస్యల నుండి కాపాడుతుంది.
. ఇందులోని విటమిన్ సి కెరోటినాయిడ్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి.
. ఈ పండులోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
. డ్రాగన్ ఫ్రూట్ బాడీ మెటబాలిజం క్రమబద్ధీకరణకు బాగా ఉపయోగపడతాయి.
. దీనిలోని అత్యధికంగా ఫాస్పరస్ మరియు క్యాల్షియం ఎముకలు మరియు పళ్ల ఆరోగ్యానికి మంచిది.
. చర్మ సౌందర్యానికి మరియు వృద్ధాప్యంలో చర్మంలో వచ్చే మార్పుల నుండి విటమిన్ సి (కొల్లుజిన్ తయారు చేయడంలో ముఖ్య పాత్ర) అధికంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ రక్షణ కల్పిస్తుంది.
ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ పండుని కేవలం పండుగానే కాకుండా మిల్క్ షేక్, జామ్, జెల్లీలు, జూస్, క్యాండీ, వైన్ గా మార్చి కూడా తీసుకోవచ్చు. ఏ కాలంలో వచ్చే వాటిని ఆ కాలంలో తినడం ద్వారా ఎన్నో రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చు.
డా. బి. అనిలా కుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్స్ అండ్ న్యూట్రిషియన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ Ê రీసెర్చ్ సెంటర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్.
Also Read: Dragon Fruit Nursery: డ్రాగన్‌ఫ్రూట్ నర్సరీ యాజమాన్యం