సర్పిలాకార తెల్లదోమ (రోగోస్ వైట్ ప్లై ) నాలుగేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చి ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను వణికిస్తోంది. దేశంలోని కొబ్బరి తోటలతో పాటు 200 రకాలకు పైగా పంటలపై వేగంగా విస్తరిస్తూ సాగుదారులను నష్టాలకు గురి చేస్తోంది. ఈ కొత్త రకం తెల్ల దోమ నియంత్రణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. సర్పిలాకార తెల్లదోమలను సమర్థవంతంగా ఎదుర్కొనే మిత్ర పురుగులను తయారు చేయడమే కాకుండా.. వాటి ఉత్పత్తి కోసం రాష్ట్రంలో రెండుచోట్ల ల్యాబరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. సర్పిలాకార తెల్లదోమ విదేశీ మొక్కల ద్వారా దేశంలోకి చొరబడిన కొత్త రకం దోమ. 2016లో కడియం నర్సరీలలో దీనిని గుర్తించినప్పటికీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గడచిన రెండేళ్లుగా చాపకింద నీరుగా దేశమంతా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉద్యాన పంటలను దెబ్బ తీస్తోంది. మన రాష్ట్రంతో పాటు కొబ్బరి సాగు ఎక్కువగా వున్న కేరళ, గోవా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గడ్, గుజరాత్, బీహార్, అస్సోమ్ వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొబ్బరితో పాటు అంతర పంటల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. కొబ్బరిలో 25 – 30 శాతం , ఆయిల్ పామ్ లో 35 శాతం, అరటి ఇతర పంటల్లో 15 నుంచి 25 శాతం విస్తీర్ణంలో వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు.
సర్పిలాకార తెల్లదోమ రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఐదు దశల్లో వృద్ధి చెందే ఇది మాములు తెల్లదోమ కన్నా ఐదు రేట్లు పెద్దది. దీని జీవితకాలం 40 – 45 రోజులు. ఇవి ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీల్చేసి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల ఏర్పడే లెప్టోగైజీఫియమ్ అనే బూజు కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ దోమలు ఆకుల కింద తెల్లటి వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి ఉధృతి తీవ్ర స్థాయిలో వున్నప్పుడు, ఆకులే కాదు రెమ్మ, మొదళ్ళు, పువ్వులు, కాయలు సైతం తెల్లని దూది లాంటి పదార్థంతో నిండిపోతాయి. ఈ ప్రభావం వల్ల 20 – 30 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
నివారణ:
సర్పిలాకార తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించేందుకు ఆముదం పూసిన పసుపు రంగు అట్టలను కాండంపై ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి తక్కువగా ఉంటే మిత్ర పురుగు డైకో క్రైసా ఆస్టర్ కు చెందిన 100 – 150 గుడ్లు, ఎక్కువగా ఉంటే 300 – 500 గుడ్లు చొప్పున విడుదల చేయాలి. తగిన మిత్ర పురుగులు లేకపోతే ఒక శాతం వేపనూనెకు 10 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా 15 రోజులకొకసారి పిచికారీ చేయాలి.