ఉద్యానశోభ

ఆగస్టు మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు

0

flowersమామిడి : మొక్కల వరుసల మధ్య దున్నుకోవాలి,పాదుల్లో కలుపు లేకుండా చేయాలి. ఆకు జిల్లేడు, గూడుకట్టు పురుగు కనిపిస్తే, గుళ్లను నాశనం చేసి పురుగుమందు పిచికారీ చేయాలి. లేత ఆకులు తినే ఆకుతేలు,లేత ఆకుల నుండి రసం పీల్చే తేనె మంచు పురుగు,ఆకులను కత్తిరించే పెంకు పురుగు,రెమ్మ తొలిచే పురుగు,ఆకు తొలిచే పురుగుల ఉధృతిని గమనించి నివారణ చర్యలు చేపట్టాలి.ఆకులపై వచ్చే ఆంత్రాక్నోస్‌ మచ్చలు,ఆకు అంచులను చివర్లను బూడిద రంగులోకి మార్చే పెస్టలోషియా, ఆకులపై వచ్చే కుంకుమరంగు మచ్చ రోగం ఉధృతిని గమనించి అవసరమైతే, కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ G 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ G 2.5 గ్రా.ఫెర్రస్‌ సల్ఫేట్‌ G 2 గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ G 2 గ్రా. బోరాన్‌ కలిపి పిచికారీ చేయాలి.
జామ : జామ ఆకులు ఎరుపు రంగులోకి మారవచ్చును.దీనికి కారణం భాస్వరం, పొటాష్‌, జింకు లోపాలు వీటి నివారణకు రసాయినిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.లీటరు నీటికి 4 గ్రా. జింకు సల్ఫేట్‌, 2 గ్రా. బోరాన్‌లను కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు ఆశించిన చెట్లకు 3 గ్రా. చొప్పున కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి మందు ద్రావణాన్ని చెట్ల పాదుల్లో పోయాలి. పశువుల ఎరువుతో పాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రా. వేపపిండి G నులిపురుగు గుడ్లను ఆశించి నష్టపరిచే పాసిలోమైసిన్‌ లిలేసినస్‌ శీలింధ్రంను 25 గ్రా. వేయాలి.
చినీ,నిమ్మ : ఎండు కొమ్మలను కత్తిరించి, 1 శాతం బొర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారీ చేయాలి. మంగునల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ ఫెన్జాక్వీన్‌ లేదా స్పైరోమెసిఫెస్‌ 0.8 మి.లీ. చొప్పున 15-20 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
అరటి : అరటి తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. ఆకు మచ్చ తెగులు గమనిస్తే ప్రోపికొనజోల్‌ 0.1 శాతం లేదా టెబుకొనజోల్‌ G ట్రైఫాక్సీస్ట్రోబిన్‌ 1.4 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి రెండు, మూడు సార్లు 25 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
సపోట: పూత మొదలు అయ్యేటప్పుడు మొగ్గ తొలుచు పురుగు నివారణకు వేపగింజల కషాయం 5 శాతం లేదా వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి చిగుర్లు వచ్చే దశలో పిచికారీ చేయాలి.
బొప్పాయి : సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ G 1 గ్రా. బోరాక్స్‌ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు మిధైల్‌ యూజినాల్‌ ఎరలను ఎకరానికి 4-5 చొప్పున అమర్చాలి.
సీతాఫలం : పిండినల్లి నివారణకు 1 మి.లీ. ఫాస్పోమిడాన్‌ లేదా డైక్లోరోవాస్‌ లీటరు నీటికి పిచికారీ చేయాలి. అక్షింతల పురుగులను (బదనికలు) తోటల్లో వదలాలి 50 గ్రా. ఫాలిడాల్‌ పొడిని చెట్ల పాదుల్లో వేయాలి.
దానిమ్మ : తోటల్లో అంతరకృషి చేసి, చెట్ల పాదుల్లో తవ్వి కలువు లేకుండా శుభ్రం చేయాలి.
ఉసిరి: తామర పురుగు నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయ పంటలు :
వంగ, బెండ : ఈ పంటల్లో మొవ్వ, కాయ తొలుచు పురుగు నివారణకు తలవాల్చిన కొమ్మలను తుంచి, పుచ్చు కాయలను ఏరి నాశనం చేయాలి. ప్రొపెనోఫాస్‌ 2 మి.లీ. లేదా సెపర్‌మెత్రిన్‌ 1 మి.లీ. చొప్పున లీటరు నీటిలో కలిపి రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తరువాత పిచికారీ చేయాలి.
టమాట: పచ్చదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల చివర్ల పసుపు పచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెల లాగ కనిపిస్తాయి. దీని నివారణకు డైమిధోయేట్‌ లేదా మిధైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ : మధ్యకాలిక రకాలను ఈ నెలలో నారు పోసుకోవచ్చును.
ఉల్లి : 30 సెం.మీ. దూరంలో బోదెలు చేసి దానికి రెండు వైపులా 10 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి. వానాకాలంలో అగస్టు నెల మొదటి 15 రోజులు లోపల నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.
చేమగడ్డ : వర్షాలు అధికమై, గాలీలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు త్వరగా వృద్ధి చెంది ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు మెటలాక్సిల్‌ ఎం.జెడ్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి తెగులును అరికట్టవచ్చును.
వార్షిక మునగ : ఎకరాకు 250 గ్రా. గింజలను పాలిథీన్‌ సంచులలో విత్తుకొని, 35-40 రోజుల తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.బహువార్షిక రకాలను కూడ ఈ నెలలో నాటుకోవచ్చును.బహువార్షిక రకాలను 5-8 సెం.మీ. మందం, 90-100 సెం.మీ. పొడవు గల కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చును. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి.
సుగంధద్రవ్య పంటలు :
మిరప : రెండో వారం వరకు విత్తనాన్ని ఎద బెట్టుకోవచ్చును. జూలై మాసంలో ఎదబెట్టిన తోటల్లో ఒత్తు పీకి, పాదుల మధ్య 30-45 సెం.మీ. దూరం ఉండేలా చూడాలి మొదటి దఫా ఎరువులను (65 కిలోలు యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) వేయాలి. ఆరు వారాల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. సూటి రకాలైతే పాదుకు 2 మొక్కలు, సంకర రకాలైతే పాదుకు ఒక మొక్క చొప్పున నాటుకోవాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ. పాదుకు మధ్య 30-45 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. నాటటానికి 10 రోజుల ముందే పొలం చుట్టూ 2-3 వరుసల్లో జొన్న/మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఆముదం, బంతి మొక్కలను ఆకర్షక పంటలుగా వేయాలి. నారు వేర్లను ఇమిడాక్లోప్రిడ్‌(5 మి.లీ./10 లీ.) మందు ద్రావణంలో 20 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి.
పసుపు : కలుపు తీత, అంతరకృషి చేపట్టాలి. విత్తిన 30 రోజులకు మొదటి దఫా నత్రజని ఎరువు యూరియా రూపంలో ఎకరానికి 50 కిలోలు అదే మోతాదు వేపపిండితో కలిపి వేయాలి. అధిక తేమ శాతం వలన వచ్చే ఇనుపధాతు లోపాన్ని 10 లీటర్ల నీటికి 50 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ రెండుసార్లు పిచికారీ చేయాలి.
జీడిమామిడి : తోటల్లో కత్తిరింపులు మరియు ఎరువులు వేయడం వంటివి.ఈ మాసంలో కూడ చేపట్టవచ్చును.
పూలతోటలు :
గులాబీ : గులాబీ తోటల్లో వచ్చే నల్లమచ్చ, ఆకుతినే పురుగు నివారణకు మచ్చలు ఆశించిన ఆకులను తీసివేసి లీ.నీటికి 1 గ్రా. కార్బెండిజమ్‌ మరియు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి.
చామంతి : కొత్తగా నాటాలనుకునేవారు ఈ మాసంతంలోపు వేర్లతో కూడిన కత్తిరింపు లేదా పిలకలను నాటుకోవాలి. పాత తోటల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మట్టిని ఎగదోసి పైపాటుగ ఎరువులను వేయాలి.

డా॥ ఎమ్‌. వెంకటేశ్వర రెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (హార్టికల్చర్‌)
డా॥ ఎ. నిర్మల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టికల్చర్‌)
కె. చైతన్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టికల్చర్‌)
డా॥ ఎ. మనోహర్‌ రావు, ప్రొఫెసర్‌ యూనివర్సిటీ హెడ్‌.
ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల,
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్‌ హైదరాబాద్‌, ఫోన్‌ : 9491151524.

Leave Your Comments

ప్రోట్రేలలో మిరప నారు పెంచడంలో మెళకువలు

Previous article

Foxtail Millets: అండుకొర్రల సాగు వర్షాభావ పరిస్థితులకు సరైన సమాధానం

Next article

You may also like