Nutritional Backyard Gardening: పెరటి తోటలు/ పోషకాహార పెరటి తోటల పెంపకం అనగా ఇంటి ప్రాగణంలో (పరిసరాలలో) వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్ల మొక్కలను పెంచడము. తద్వారా ఇంటిల్లిపాది పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందిచడం.
పోషకాహార పెరటి తోటల వలన కలిగే ప్రయోజనాలు
పోషకాలతో కూడిన తాజా పండ్లు, కూరగాయలు ఇంటిల్లిపాదికి సంవత్సరం పొడుగునా లభిస్తాయి. రసాయన రహిత కూరగాయలు, పండ్లు దొరుకుతాయి.
1. అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. పోషక తోటలోని ఉత్పత్తిని అమ్మటం వలన కొంత ఆదాయమును పొందడమే కాక కురగాయలకు అయ్యే రోజువారి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంటిలోని పిల్లలు కూడా శ్రమ చేయడంలోని ఆనందాన్ని, తోటను పెంచే పద్దతులను నేర్చుకుంటారు.
2. మార్కెట్లో లభించే కూరగాయల కన్నా పెరటి తోటలోని కూరగాయలకు రుచి ఎక్కువ
3. పెరటి తోట పెంపకం మానసిక ఆహ్లాదానికి, శారీరకవ్యాయామానికి చక్కటి ప్రత్యామ్నాయము.
4. ఇంటిల్లపాదికి మానసిక, శారీరక, పోషక ఆరోగ్యానికి చిరునామాయే పోషకాహార తోటలు.
సరియైన సాగుకు పాటించవలసిన పద్ధతులు :
1. స్థలం
ఎంపిక: మంచినీటి వసతి కలిగి బాగా సూర్యరశ్మి తగిలే అనువైన నేలను ఎంపిక చేసుకోవాలి.
2. తోట యొక్క పరిమాణము: సరిపడా, తగినంత ఉండాలి. ఐదుగురు ఉండే కుటుంబ సభ్యులకు సంవత్సరం పొడవునా కూరగాయలు అందించుటకు 220 మీ. స్థలం సరిపోవును.
3. లేఅవుట్ : ఆయా ప్రాంతాలోని వ్యవసాయ వాతావరణ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘ చతురస్రాకార తోటకు ప్రాధాన్యత ఇవ్వాలి.
పోషకాహార తోటల పెంపకానికి మార్గదర్శకాలు :
1. మొక్కల ఎంపిక: బహువార్షిక మొక్కలైన మునగ, కరివేపాకు మొదలైన వాటిని పెరటి తోటలో ఒక వైపున నాటుకోవాలి. ఆ చెట్ల నీడ మొక్కల మీద పడకుండా ఉండేలా మరియు అంతర సాగుకు అడ్డురాకుండా నాటుకోవాలి. బహువార్షిక మొక్కలకు స్థలం కేటాయించిన తరువాత మిగిలిన భాగాన్ని 6-10 సమ భాగాలుగా చేసుకుని ఏక వార్షిక కూరగాయలను నాటుకోవాలి. తోటకు మధ్యలో మరియు నాలుగు వైపుల నడిచే దారి కలుగచేయాలి.
2. కంచె ఏర్పాటు : పెంపుడు జంతువుల నుండి రక్షణ కలిగించుటకు కంచె ఏర్పాటు చేయాలి. ఇనుము తీగలతో చేసిన కంచె విచ్చలవిడిగా తిరిగే జంతువుల నుండి రక్షించగలుగుతుంది. తీగజాతి మొక్కలతో కంచెపైన పంట వేసుకోవచ్చు. ఉదా: బీర, కాకర గుమ్మడి, దొండ
3. ఆరోగ్యకరమైన నారును పెంచుట: నర్సరీలో పెంచిన / నారుమడి తయారుచేసి తోటలో నాటినప్పుడు, మూడు నుండి నాలుగు వారాల వరకు కావలసిన నీటి మోతాదు తగ్గును. చీడ పీడలను అరికట్టడం తేలిక. పోషకాహార తోట పెంపకంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే జాతుల కన్నా ఎక్కువ కాలం ఉండి నిలకడగా దిగుబడి ఇచ్చే జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక తేనె పట్టును ఏర్పాటు చేసుకోవడం వలన కుటుంబానికి కావలసిన తేనె కూడా లభిస్తుంది. మొక్కలలో పరపరాగ సంపర్కము జరుగుతుంది. మరియు తేనె కూడా లభిస్తుంది.
4. మడులను ఎత్తుగా తయారుచేయడం వలన నీరు నిలిచి పోవడం జరగదు. మట్టి త్వరగా గట్టి పడదు మరియు కలుపు యాజమాన్యం తేలికగా ఉంటుంది.
5. భూసారమును నిర్వహించుట: సేంద్రీయ మరియు ఖనిజాలు కలిసిన ఎరువులు మంచి ఫలితాలు ఇస్తాయి. సహజ సేంద్రీయ పదార్థాలు వాడడం వలన నేలలోని పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటు మట్టిని పుష్టిగా ఉంచటానికి ఖనిజ లవణాల లోప పోషక వ్యాధులను నివారించవచ్చు.
సహజ-సేంద్రీయ ఎరువు పెరటిలోని ఆకు, అలము మరియు వంట చేసినప్పుడు వచ్చే కూరగాయల వ్యర్థ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. స్థలము బట్టి పెరటి తోటలో ఒక వైపున కంపోస్ట్ గుంటను ఏర్పాటు చేసుకోవాలి. స్థలం ఉన్నదాన్ని బట్టి వర్మి కంపోస్ట్ అనగా వానపాముల ఎరువు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
Also Read: Paddy Nursery Management: వరి పంటలో – నారుమడి పెంపకము.!
కూరగాయలలో ఉండే పోషక విలువలు :
పిండి పదార్థాలు : బంగాళదుంపలు, ఎర్రదుంపలు, చేమ, కంద మొదలగునవి.
మాంసకృత్తులు : చిక్కుళ్ళు, బఠానీలు, బీన్స్ రకాలు.
విటమిస్ ‘ఎ’ : పాలకూర, తోటకూర, ఎర్రదుంపలు, గుమ్మడి, క్యారెట్, క్యాబేజి, మెంతులు, టమోట, బొప్పాయి, కొత్తిమీర మొదలగునవి (పసుపు నుంచి కాషాయం రంగు వరకు కలిగిన కూరగాయలు మరియు పండ్లలో విటమిన్ ‘ఎ’ అధికంగా ఉంటుంది.)
‘విటమిన్ ‘సి’: టమోట, క్యాబేజిపువ్వు, నూలు-కోలు దుంపలు, కాకర, ముల్లంగి, తోటకూర.
కాల్షియం : బీట్ రూట్, తోటకూర, మెంతికూర, ఉల్లి, కొత్తిమీర, టమోట మొదలగునవి.
పొటాషియం : ఎర్రదుంపలు, బంగాళాదుంపలు, కాకర, ముల్లంగి, బఠానీ.
పాస్ఫరస్: వెల్లుల్లి, బఠాణీలు, కాకర మొదలగునవి.
ఐరన్: కాకర, తోటకూర, మెంతికూర, పుదీన, పాలకూర, మునగాకు, గోంగూర.
ఆయాకాలాల్లో అనువైన కూరగాయలు :
శీతాకాలం : బంగాళదుపంలు, క్యాబేజి, క్యారెట్, మెంతులు, ఆవాలు, బీట్ రూట్, ఉల్లి, వెల్లుల్లి, పెద్ద చిక్కుడు, బఠాణీ, కొత్తిమీర మొదలగునవి.
ఎండాకాలం : (మార్చి – జూన్) దొండ, గోరుచిక్కుడు, టమోట, మిరప, బెంగుళూరు మిర్చి, సొరకాయ, దోసకాయ, పుచ్చకాయ, చేమ, తోటకూర మొదలగునవి.
వర్షాకాలం : దొండ, చిక్కుడు, బఠాణీ, గోరుచిక్కుడు, టమోట, తీగజాతి కూరగాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఎర్రదుంపలు
మొదలగునవి.
పోషక పంటల ఎంపిక:
పండ్లు, కూరగాయల మొక్కలను కుటుంబ సభ్యుల అభిరుచిని బట్టి ముఖ్యంగా మహిళలు పిల్లలు అభిరుచిని బట్టి ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక మొక్కల నుండి దృఢమైన, ప్రాంతీయ వాతావరణానికి, నేలలకు అనువైనవి మరియు సాధారణ క్రిములను, వ్యాధులను తట్టుకోగలిగే రకాలను ఎంపిక చేసుకోవాలి. మెరుగైన రకాలను సాంప్రదాయ మొక్కలను ఎంచుకోవడం మూలంగా జీవ వైవిధ్యాన్ని, కుటుంబ ఆహారపు ఆచారాలను నిలుపుకోవచ్చు.
Also Read: Pulses Cultivation Management: అపరాలలో సస్యరక్షణ.!