Plants Cultivation: రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, టమాట ఇలా ఏదో ఒక పంటను సాగు చేస్తారు. లేదంటే మామిడి, జామ, ద్రాక్ష, కొబ్బరి, బత్తాయి వంటి దీర్ఘకాల తోటలను పెంచడం పరిపాటిగా మారింది. వాతావరణం అనుకూలిస్తే లాభాలు లేదంటే నష్టాలు, మన రైతులు ఎప్పుడు కూడా ఒక పంటపైన ఆధారపడి ఉంటారు. రెండు, మూడు రకాల పంటలు వేస్తే ఒక్క పంట కాకపోయిన మరో పంట కలిసి వస్తుంది. కానీ మన రైతులు మాత్రం ఎప్పుడు కూడా ఒక పంటమీదే ఆధారపడి ఉంటారు. కానీ ఓరైతు మాత్రం తన పొలంలో వేల రకాల మొక్కల్ని పెంచుతూ, వైవిధ్యమైన వనాన్ని సృష్టించారు.
100కు పైగా ఆయుర్వేద మొక్కలు
తెలంగాణలోని రంగారెడ్డిజిల్లాలోని రైతు తన 10 ఎకరాల్లో సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, వెల్వెట్ యాపిల్, వాటర్ యాపిల్, జబోటిక, మిరాకిల్‌ఫ్రూట్, జామ, మామిడి, సపోటా వంటి 50 రకాలకు పైగా దేశవాళి పండ్ల రకాలూ, అశ్వగంధ, శంఖపుష్టి, అడ్డసరం, జీవ కాంచన ఇలా 100కు పైగా ఆయుర్వేద మొక్కలూ, దాల్చినచెక్క, లవంగం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు, శ్రీగంధం, ఎర్రచందనం, నేరేడు వృక్షాలు, గులాబి, సంపంగి, పారిజాతం తదితర పుష్పాలూ ఇలా 280 జాతులకు చెందిన 9 వేల మొక్కలకు నిలయం ఆవ్యవసాయ క్షేత్రం. ఆక్షేత్రం సారథి హైదరాబాద్‌కు చెందిన సుఖవాసి హరిబాబు. తనకున్న 10 ఎకరాల్లో వున్న ఇక్క బోరు సాయంతో వీటన్నింటినీ సాగు చేస్తున్నారు జీవవైవిధ్యానికి తన క్షేత్రాన్ని చిరునామాగా తీర్చిదిద్దారు.
Also Read: కాసుల వర్షం కురిపిస్తున్న వాక్కాయ సాగు.!
వ్యవసాయాన్ని ఇష్టంతో చేస్తున్న హరిబాబు గతంలో రియల్ ఎస్టేట్, టీవి రంగాల్లో పని చేశారు. రైతు కుటుంబాల జీవిత గాథలు ఇతివృత్తంగా తీసుకుని దర్శక నిర్మాతగా జీవనతీరాలు, జీవనసంధ్య, సీరియళ్లను తీశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియళ్లకి 6 నంది అవార్డులను అందుకున్నారు. గచ్చిబౌలి లో కొంత పొలం కొని ఉద్యాన పంటలను పండించారు. 2013లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల పొలం కొన్నారు. మామిడి, సపోటా, తీపిచింత వంటి వృక్ష జాతి మొక్కల్ని నాటారు. మొక్కలు బలంగా పెరిగేందుకు వీలుగా ఎర్రమట్టి, ఆవుపేడ, ఆముదపుపిండి కలిపిన కంపోస్టు ఎరువును ఆ గోతులలో వేశారు. మొక్కల మధ్యలో సుగంధద్రవ్య మొక్కల్ని నాటారు. చైనా, వియాత్నాం, జమైకో, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాలకు చెందిన 40 రకాల వృక్ష జాతుల్ని శృంగేరి, బెంగళూరు, మంగళూరు, కాసర్‌గట్, కడియం నర్సరీల నుంచి తెప్పించారు. వాటితో పాటు ఆ క్షేత్రంలో వాజ్‌పాయి పండ్లు, అబ్దుల్‌కలాం పుష్పాలు. చరకుడు, శుశ్రూశుడి పేర్లతో ఆయుర్వేద మొక్కలు విభాగాలు ఏర్పాటు చేశారు.
అంతా సేంద్రియమే
తన పొలంలో పండించే పంటలకు సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తున్నారు. సుభాషపాలేకర్ స్ఫూర్తితో ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి వాడుతున్నారు. అలాగే పొన్నుస్వామి నూనెల విధానాన్ని పాటిస్తున్నారు. ఈపద్ధతిలో వేప, ఆముదం, కానుగ, పత్తితవుడు, విప్ప, చేపకుసుమ వంటి నూనెలతో మిశ్రమం తయారు చేసి ఆద్రవణాన్ని నీటిలో కలిపి మొక్కల పైన పిచికారి చేస్తున్నారు. వీటి కారణంగా గత రెండు సంవత్సరాల్లో తోటలో చీడ పీడల సమస్య తలెత్తలేదని తోటలో పండే కాయల నుంచి నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారాయన. ఒకే పంటపై ఆధారపడే విధానానికి రైతులు స్వస్తి చెప్పాలి. కాస్త పొలం వున్నా అందులో రెండు రకాల మొక్కలు సాగు చేయాలి. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుంది.
Also Read: మిర్చి నారు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!