ఉద్యానశోభ

వేసవిలో కొత్తిమీర సాగు ..

0

వంటలకు రుచిని, సువాసన ఇచ్చే కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన అన్ని కాలాలలో విరివిగా దొరికినా వేసవిలో మాత్రం కొత్తిమీర కొండ ఎక్కి కూర్చుంటుంది. ఎందుకంటే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వలన ధనియం గింజల్లో మొలక శాతం తక్కువగా ఉండటంతో పాటు ఆకుల పెరుగుదల కూడా తగ్గుతుంది. అందుకే వేసవి వచ్చిందంటే కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే కొత్తిమీర సాగులో కొన్ని మెళకువలు పాటించాలి. అధిక గిరాకీ అందిపుచ్చుకునేందుకు పందిర్ల కింద కొత్తిమీర సాగు చేయడం ద్వారా లాభసాటిగా ఉంటుంది.
కొత్తిమీర రకాలు:
సింధు, సాధన, స్వాతి, సుధా, ఎపిహెచ్ యు ధనియా – 1 వేసవికి అనుకూలం.
విత్తన మోతాదు:
వేసవిలో మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనం ఎక్కువగా వాడాలి. ఒక సెంటు మడికి 250 గ్రా. విత్తనం సరిపోతుంది.
విత్తన శుద్ధి:
ఒక కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ కలిపి విత్తే 2,3 రోజుల ముందు విత్తన శుద్ధి చేసి ఉంచాలి.
విత్తే విధానం:
వేసవిలో అధిక దిగుబడి రావాలంటే ఎత్తైన నారుమడులను అంటే 3 అడుగులు వెడల్పు, 6 అంగుళాల ఎత్తు, తగినంత పొడవు ఉండి చిన్న మడులను చేసుకొని విత్తుకోవాలి. వేసవిలో విత్తనాన్ని 1 సెం.మీ. లోతులో పడేటట్లు విత్తుకుంటే ఎక్కడా మొలక శాతం తగ్గదు.
ఎరువులు:
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు ఆఖరి మడులలో దంతిగానీ, అరక తోలినప్పుడు వేసుకోవాలి. ఒక సెంటు మడికి 350 గ్రా. యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫెట్, 150 గ్రా. మ్యురేట్ ఆఫ్ పొటాష్ లను వాడుకోవాలి. పశువుల ఎరువుతోపాటు వానపాముల ఎరువు అందుబాటులో ఉంటే వాడుకుంటే భూమి గుల్లబారి బాగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. విత్తిన 20 రోజులకు 10 లీటరు నీటికి జిబ్బరెలిక్ ఆమ్లం 0.1 గ్రా. కలిపి ఎదుగుదల బాగా ఉండి తక్కువ సమయంలో ఎక్కువ కోతలు కోసుకోవచ్చు.
నీటి యాజమాన్యం:
వేసవిలో సాగు చేయడం వలన రోజుకు రెండు సార్లు మడులను తడపవలసి ఉంటుంది. వీలైనంత వరకు మడులను ఉదయం లేదా సాయంత్రం తడుపుకుంటే మంచిది. అవసరానికి మించి తడుపుకుంటే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి పదునును బట్టి నీటి తడులను ఇచ్చుకోవాలి.
సస్య రక్షణ:
వేసవిలో మాగుడు తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 1 గ్రా. కార్బండిజమ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లీటరు నీటికి కలిపి వారం లేదా 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర సాగులో అధిక ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే ఒకేసారి విత్తుకుంటే, ఒకేసారి కోతకు వచ్చినా మార్కెటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది.  కొత్తిమీర 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సుమారుగా ముందు ఎదిగిన మొక్కలను 30 నుంచి 35 రోజులలోనే కోతకు తీసుకోవచ్చు. అదే విధంగా కోత సమయాన్ని బట్టి కిలో కొత్తిమీర 35 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతుంది. అందువల్ల వేసవిలో మంచి గిరాకీ ఉంది కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని కొత్తిమీరను సాగు చేసినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు.

Leave Your Comments

కీరదోస పంట సాగుతో లక్షల్లో లాభాలను పొందుతున్న యూపీ రైతు..

Previous article

మామిడి పండ్లు సహజంగా పండినవని గుర్తించడం ఎలా..

Next article

You may also like