ఉద్యానశోభ

చామంతి సాగు – యాజమాన్య పద్దతులు

0

                చామంతి శీతాకాలంలో పూస్తుంది.సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిన్నపూలు), పట్నం చామంతి (మధ్యస్థ పూలు),పెద్దసైజు పూలుగలవిగా విభజించవచ్చు.

నేలలు :
తేలికపాటి నేలలు అనుకూలం.ఉదజని సూచిక 6.5 – 7.0 మధ్య ఉండాలి.మురుగు నీటి పారుదల సరిగా లేని ఎడల మొక్కలు చనిపోతాయి.
నాటే సమయం :

  • చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు మాత్రమే బాగా పెరుగుతాయి.
  • పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది.
  • అందుకు జూన్‌ – జులైలో నారు మొక్కలను నాటినట్లయితే నవంబరు – డిసెంబరులో పూస్తాయి.
    నాటడం :
    చామంతి మొక్కలను 30 – 20 సెం.మీ. ఎడంగా నాటుకోవాలి.ఎకరానికి రూ. 55,000 – 60,000 మొక్కలు నాటవచ్చు.
    ప్రవర్ధనం :
  • పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలు కోయడం అయిపోయిన తరువాత ఫిబ్రవరి – మార్చి మొక్కల నుండి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి.
  • మొక్కలను కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది.వేర్లు తొడిగిన పిలకల్ని జూన్‌ – జూలైలో నాటుకోవాలి.
  • మొక్కలను 30 – 20 సెం.మీ. ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు రూ. 55,000 – 60,000 మొక్కలు అవసరమవుతాయి.
    తలలు తుంచడం (పించింగ్‌) :
    నారు నాటిన నాలుగు వారాల తరువాత చామంతి మొక్కల తలలను తుంచివేయాలి.
    ఈ విధంగా చేయడం వల్ల నిలువు పెరుగుదల ఆగి పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి.
    దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది. పంట కూడా కొంత ఆలస్యంగా వస్తుంది.
    రకాలు :
  • పసుపు పూల రకాలు : భసంతి, కో.1, ఎల్లోగోల్డ్‌, రాయచూర్‌, సిల్పర్‌ (హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సాగుచేసే రకాలు
  • తెలుపు పూల రకాలు: రత్లామ్‌ సెలక్షన్‌, బగ్గి, ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.6
  • ఎరుపు పూల రకాలు : రెడ్‌ గోల్డ్‌, కో.2
  • బెంగుళూరు, కల్తిర్‌, సోలాపు, రాయచూర్‌ పసుపు రకాలు, పేపర్‌వైట్‌ (దేశీవైట్‌), రాజావైట్‌ అనే తెలుపు రకాలు పెంట్‌, ఐస్‌క్రీం, జంబో, కాఫీ, డికాషన్‌, చందమామ, పూర్ణిమ తదితర హైబ్రిడ్‌ రకాలను సాగు చేస్తున్నారు. హైబ్రిడ్‌ రకాలు తెలుపు, పసుపు రంగుల్లోనూ ఉంటాయి.బెంగుళూరు, జంబో,పేపర్‌వైట్‌, రాజావైట్‌, రకాలు వర్షాకాలం ప్రారంభంలో వేయాలి.
  • ఎరువులు :నాటుటకు ముందు ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, కోడి ఎరువు, 60 – 80 కిలోల నత్రజని 30 – 40 కిలోల భాస్వరం మరియు 60 – 80 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి.
  • హార్మోన్ల వాడకం : 100 పి.పి.యమ్‌. (100 మి.గ్రా.లను లీ. నీటిలో) నాఫ్తలిన్‌ ఎసిటిక్‌ ఆమ్లాన్ని మొగ్గ దశ కంటే ముందుగా పిచికారి చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. 100 – 150 పి.పి.యం జిబ్బరిల్లిక్‌ ఆమ్లాన్ని పిచికారి చేస్తే 15 – 20 రోజుల్లో త్వరగా పూతకి వస్తుంది.

నీటి యాజమాన్యం:

  • చామంతి ఆరుతడి పంట కావడంతో నీటి అవసరం పెద్దగా ఉండదు. ఎర్ర నేలల్లో ఐదు రోజులకొకసారి నల్లరేగడి నేలల్లో ఏడు రోజులకొకసారి నీరు పెట్టాలి.
  • నాటిన మొదటి నెలలో వారానికి 2 – 3 సార్లు, అటుపిమ్మట వారానికి ఇక తడి ఇవ్వాలి.
  • చామంతి మొక్కలు వంగిపోకుండా వెదురు కర్రతో ఊతమివ్వడం మంచిది.

సస్యరక్షణ పురుగులు :
చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగులు, ముడత, ఆకుతొలుచు పురుగు ఎక్కువగా నష్టం కలుగజేస్తాయి.
పచ్చ పురుగు :
ఈ గొంగళి పురుగులు ఆకులను తినివేయడమే కాక పూలను కూడా పాడుచేస్తాయి. నివారణకు మలాథియాన్‌ 5 శాతం పొడి 8 కిలోలను గాని లేక క్వినాల్‌ఫాస్‌ పొడి 8 కిలోలు ఎకరా విస్తీర్ణంలో చల్లుకోవాలి.లేదా ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకొని నివారించవచ్చు.
తామర పురుగులు :
ఇవి గుంపులు, గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. నివారణకు డైమిథోయేట్‌ 1.5 మి.లీ. లేక కార్బరిల్‌ 50 శాతం పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్క ఎదిగే సమయంలో ఎక్కువగా పేను, దోమ, నలుపు, పసుపు తెగుళ్ళు అధికంగా కనిపిస్తాయి. వీటినివారణకు కషాయాలను వాడవచ్చు.లేదా క్రిమిసంహారక మందుల్లో తెగుళ్ళకు మోనోజెబ్‌ (ఎమ్‌ 45), క్యాబ్రియోటాప్‌, అక్రోబట్‌ వంటి మందులు, పేను,దోమలకు ఎసిఫేట్‌ను వాడాలి. మొగ్గ దశలో పచ్చపురుగు, నల్లపురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు బెంజర్‌, సైపర్‌ మెత్రిన్‌ వంటి మందులు పిచికారి చేయాలి. మొగ్గ సైజు పెంచేందుకు లియోసిన్‌ మందు పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పూలు పూసే సమయంలో పూలను తొలచే పురుగులు కనిపిస్తాయి. వీటిని వెంటనే నివారించకపోతే దిగుబడే కాదు పూల నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ సమమంలో గాఢత తక్కువగా ఉన్న మందులు పిచికారీ చేయాలి.

సస్యరక్షణ తెగుళ్ళు :
ఆకుమచ్చ :
నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి.నివారణకు మాంకోజెబ్‌ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వేరుకుళ్ళు తెగులు :
మొక్కలు అకస్మాత్తుగా వడలిపోతాయి.భూమిలో నాటిన కటింగ్‌లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు మురుగునీరు నిలువకుండా ఏర్పాటు చేయాలి. బ్లైటాక్స్‌ 3 గ్రా. లేదా 2.5 గ్రా. కాప్టాన్‌ 3 గ్రా. లీటరు నీటిలో కలిపిన మందుతో నేలను బాగా తడిపి తెగులును అరికట్టవచ్చు. నారు వేసే ముందు నత్రజని లేదా యమ్‌`45 మిశ్రమంలో కొద్దిసేపు ఉంచాలి.ఇలా చేయడం వల్ల వేరుకుళ్ళును ముందుగానే నివారించవచ్చు.నాటిన నాలుగు రోజుల తరువాత పూర్తిస్థాయిలో నీరు పెట్టాలి. డ్రిప్‌ సౌకర్యం ఉంటే అవసరం లేదు. 25 నుండి నెల రోజుల మొక్కలపై వేపనూనెను పిచికారి చేస్తే చీడపీడలు పెద్దగా ఆశించవు.మొదళ్ళ వద్ద కూడా వేపపిండిని వేస్తే వేరుకుళ్ళు రాదు. 45 రోజుల తరువాత ఒకసారి,మూడు నెలల తరువాత ఒకసారి యూరియా,డిఏపిని కలిపి మొక్క దగ్గర వేయాలి.

దిగుబడి :
నారు నాటిన తరువాత సుమారు నెల రోజులకు చామంతి మొక్కల తలలను తుంచివేయడం వల్ల పక్క కొమ్మలు ఏర్పడి అధిక పూల దిగుబడి పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుండి 75 – 120 పూలను పొందవచ్చు. జూన్‌ – జూలైలో నాటిన మొక్కలు డిసెంబరు – జనవరి వరకు పూత పూసి కోతకొస్తాయి. ఒక పంటకాలంలో దాదాపు 10 – 15 సార్లు పూలు కోయవచ్చు.ఎకరాకు దాదాపు 5 – 8 టన్నుల దిగుబడి వస్తుంది.

Leave Your Comments

మొక్కజొన్న కత్తెరపురుగు – సమగ్ర సస్యరక్షణ

Previous article

ప్రోట్రేలలో మిరప నారు పెంచడంలో మెళకువలు

Next article

You may also like