ఉద్యానశోభ

Betel Nut Farming: అధునాతన పద్ధతులలో వక్కసాగు.!

1
Betel Nut Farming
Betel Nut Farming

Betel Nut Farming: హిందూ సాంప్రదాయం ప్రకారం వక్క లేదా పోకచెక్క అపురూప వస్తువు. పూజా కార్యక్రమాల్లో వక్కలు వాడే ఆచారం కొనసాగుతుంది. వివాహాది శుభకార్యక్రమాల్లో అందించే తాంబూలాలలో మూడు తమలపాకులు, రెండు వక్కలు ఉండాలన్నది సాంప్రదాయం. చిన్న చిన్న గ్రామాల్లో కూడా వక్కపొడి అమ్మే దుకాణాలు అనేకం. ప్రస్తుతం మనవాళ్ళు వాడే కారా, జరదా కిళ్ళీలు పచ్చి వక్క లెకుండా తయారు కావు. మత్తు పదార్థాలు తాగినవారు, ఆ దుర్వాసన రాకుండా వుండటం కోసం వక్కపొడి నమిలి ఊసేయటం అలవాటు. అంతటి ప్రాధాన్యత కలిగిన వక్కను మనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవటం మినహా మరో గత్యంతరం లేదు. అలాంటి వక్కసాగుపై దృష్టి సారించారో అభ్యుదయ రైతు. వక్కసాగుకు అనువైన సమాచారం తెలుగులో లేకున్నా, ప్రభుత్వ ప్రోత్సాహం కరువైనా 25 ఏళ్ళుగా వక్క సాగుచేస్తూ, కష్టాలు పడుతూ, నష్టాలు భరిస్తూ వక్క సాగులో అనుభవం సముపార్జించుకుంటూ, ఆ సాగు అనుభవాలను రైతులకు అందిస్తూ ముందుకు సాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కవ్వగుంట గ్రామానికి చెందిన దావులూరి విజయసారధి.

Betel Nut Farming

Betel Nut Farming

Also Read: Heliconia Crop: కొబ్బరి మరియు ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతరపంటగా హెలికోనియా.!

తాను కొనుగోలు చేసిన 40 ఎకరాల్లో వక్కను అంతరపంటగా నాటారు విజయసారధి. కొబ్బరి, కోకో, మిరియం, కాఫీ లాంటివి అంతర పంటలుగా వుండేవి. 1996లో వక్కను నాటి, క్రమక్రమంగా అనుభవం సముపార్జించుకున్నారు. విజయసారధి చేపట్టిన పైరు, సాగు విధానాలు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే, కొందరు హేళన చేశారు. అందుకు బలమైన కారణం వుంది. అంతకు ముందు ఆయనకు వ్యవసాయంలో ప్రవేశం లేదు. సినీ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతూ వ్యవసాయంలో కాలు మోపటం, అతి విలువైన పంటలను ఎంచుకోవటం, కొత్త, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టటం చాలా మంది రైతులను ఆశ్చర్యపరచింది. వారి మాటలు పెడచెవిన పెట్టిన సారధి, తాను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు నడిచి, అతి విలువైన పంటలు పండిస్తూ ముందుకు నడిచి, ప్రస్తుతం తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వక్క మొక్కల కొరత అధికంగా ఉండటం వల్ల మొక్కలు పెంచి రైతులకు అందిస్తున్నారు.

ఆ రోజుల్లో ఆంధ్రలో వక్క మొక్కలు లభ్యం కానందున కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ‘మంగళ’, ‘శ్రీమంగళ’, ‘సుమంగళ’, ‘మంగళ ఇంట్రెసా’, ‘మోతీనగర్‌’ లాంటి సంకరజాతి మొక్కలు తెప్పించి నాటారు. వాటి సాగు విధానం గురించిన సమచారం అందుబాటులో లేనందున కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తరచుగా వెళుతూ, అక్కడి సాగు పద్ధతులను ఆకళింపు చేసుకొని, కవ్వగుంటలోని తన తోటలో అమలు పరచుకుంటూ, కష్టాలు, నష్టాలు కూడా భరించారు. వక్క సాగు అనుభవం సముపార్జించుకున్న విజయసారధి హైబ్రిడ్‌ వక్క రకాలకు స్వస్తి పలికి ‘‘మోతీ’’ అనే లోకల్‌ రకంపై దృష్టి నిలిపారు. దిగుమతి  చేసుకున్న రకాలు ఫిబ్రవరి-జూన్‌ నెలల మధ్య పూత పూసి, కాపుకు వచ్చేవవటం, మార్చి నుంచి ఎండల తీవ్రత పెరిగి పూలు, పిందెలు రాలిపోవటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయేది.

అటు తర్వాత సాగులోకి తచ్చిన ‘మోతీ’ అనే దేశవాళీ రకం సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో పూతకు వచ్చి, శీతాకాలంలోని చల్లదనం వల్ల పిందెలు, కాయలు రాలటం తక్కువగా వుండి, అధిక దిగుబడి ఇస్తున్నట్లు గ్రహించారు. ప్రస్తుతం తన పొలం మొత్తం దేశవాళీ రకంనే సాగుచేస్తూ, ఎకరానికి అంతర పంటగా 700 మొక్కలు నాటి, మొక్కకు సుమారు 4 కిలోల దిగుబడి సాధిస్తూ, ముందుకు సాగుతున్నారు.
వక్క ఒకటే కాకుండా కొబ్బరిచెట్లు కూడా వుండటం వల్ల, మొక్కల వరుసల మధ్య దూరం 11 అడుగులు, మొక్కల మధ్య దూరం 6 అడుగులుగా సాగు కొనసాగిస్తునారు. కాలక్రమంలో కోకో, కాఫీ లాంటి వాటిని పూర్తిగా తొలగించారు. వక్క, కొబ్బరిచెట్లకు మిరియంతో పాటు వెనిల్లాను పాకిస్తూ ముందుకు సాగుతున్నారు.

సేంద్రియ సాగు:
తోటలో ఏ మొక్కలు పెరుగుతున్నా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం పూర్తిగా నిషేధం. సేంద్రియ ఎరువులే ఆ పంటలకు శరణ్యం. ఆ తోటలో ఉత్పత్తవుతున్న కొబ్బరి, వక్క, మిరియం లాంటి వాటికి మంచి ధర లభిస్తుండటంతో చుట్టుప్రక్కల రైతులు కూడా ఆ విధంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. విజయసారధి ప్రవేశపెట్టిన అంతర పంటల సాగు విధానం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా పరిశీలించి, ఆ విధానాలను ప్రవేశపెట్టమని ఉద్యానశాఖకు అప్పుడే ఆదేశాలిచ్చారు.

కాయలపై పీచు ప్రధాన సమస్య!
ప్రతి పంటకు ఏదో ఒక అవరోధం, అడ్డంకి వుంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ వక్క విషయంలో దానిపై వుండే పీచు పెద్ద అవరోధంగా తయారైంది. చెట్టు నుంచి రాలిన వక్కకాయలు పచ్చిగా వుండి, పీచుము విదిలించలేవు. ఎండలో ఎక్కువ రోజులు ఆరబెడితే కాని, ఆ పీచు ఊడి రాదు. కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి, కొద్ది దిగుబడులు సాధించినప్పుడు ఆరుబయట ప్రదేశంలో కాయలు ఆరబెట్టవచ్చు. 40 ఎకరాల నుంచి వస్తున్న అధిక దిగుబడులు ఆరుబయట ఆరబెట్టటం సాధ్యం కాదు. అంత ప్రదేశం వుండదు. ఈ ఇబ్బంది పడలేక పదేళ్ళ క్రితమే పీచు వలిచే యంత్రం కొన్నారు. అది పనిచేయటం మానేసింది. వక్క కాయలపై పీచు వలిపించటానికి సారధి కొంతకాలం శ్రమ పడ్డారనక తప్పదు.

సోలార్‌ డ్రయ్యర్‌!
మనుష్యులతో కాని, కరెంటుతో కాని పనిలేని ‘‘సోలార్‌ డ్రయ్యర్‌’’ వారి దృష్టిలో పడిరది. వెనక ముందు ఆలోచించకుండా, తన తోటలో ఒక డ్రయ్యర్‌ అమర్చారు. డ్రయ్యర్‌లో ఎండటానికి మనుష్యులు అవసరం లేదు. సోలార్‌ డ్రయ్యర్‌కు నాలుగు లక్షలు ఖర్చు చేశారు. ప్రాథమిక దశలో దాని పని తీరు బాగుండటం వల్ల మరో మూడిరటిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. చెట్ల వద్ద పోగు చేసిన వక్క కాయలను తెచ్చి ఈ సోలార్‌ డ్రయ్యర్‌లో పోస్తారు. ఉష్ణోగ్రతను పెంచటానికి ఈ డ్రయ్యర్‌ ఉపయోగపడుతుంది. బయట 35 డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదైతే, అదే ప్రదేశంలో ఏర్పాటు చేసిన డ్రయ్యర్‌ లోపలి ఉష్ణోగ్రత 62 నుంచి 65 డిగ్రీలుగా వుంటుంది. చెట్ల నుంచి రాలిన వక్క కాయలను బహిరంగ ప్రదేశంలో 30`40 రోజులు ఎండలో ఆరబెట్టాలి. అదే డ్రయ్యర్‌లో వేసి 12 నుంచి 15 రోజులు వుంచితే చాలు. బయట ఎండబెట్టిన కాయలు 6-7 అంగుళాలకు మించిన మందం వుండటానికి వీల్లేదు. డ్రయ్యర్‌లోని కాయలు 12 నుంచి 15 అంగుళాల మందం వున్నా ఇబ్బంది వుండదు.

కాయలపై పీచు వలవటం సమస్యే!
డ్రయ్యర్‌లో వుంచిన కాయలపై పీచును తొలగించటానికి, డ్రయ్యర్‌లో ఎండిన కాయలను బహిరంగ ప్రదేశంలో పోసి, ఆరబెట్టి ట్రాక్టరు చేత తొక్కించటం ప్రారంభిస్తారు. అలా తొక్కించటం వల్ల కాయలపై వుండే పీచు 75 శాతం తొలగిపోతుంది. మిగిలిన భాగాన్ని మనుష్యుల చేత ఒలిపించి, గ్రేడిరగ్‌ చేస్తున్నారు. టన్ను కాయలను తొక్కించి గ్రేడిరగ్‌ చేయిస్తే 65 శాతం గింజలు వస్తాయి. మిగిలిన 35 శాతం చెత్త. అలా భారీగా ఉత్పత్తయిన చెత్తను తొలగించటానికి ప్రదేశం లేక తగలబెట్టటం సహజంగా జరిగేదే! సారధి అలా చేయటం లేదు. ఆ చెత్తను బస్తాలకు ఎత్తించి, ఖాళీ ప్రదేశంలో పోయించి, దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యర్థాలను కూడా అర్థవంతంగా మార్చటంలో ఆయన కృతకృత్యులవుతున్నారు. ఆ సిరివనంలోని ఉత్పత్తులను కొనుగోలు చేయటం కోసం గతంలో కొనుగోలుదారులు స్వయంగా వచ్చేవారు. ఇప్పుడలాంటిది లేదు. అక్కడి ఉత్పత్తులపై నమ్మకం పెంచుకున్న వ్యాపారులు, వారికి అవసరమైన సరుకు కోసం విజయసారధి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసి, సరుకును తమకు అవసరమైన చోటుకు తెప్పించుకోవటం కొనసాగుతోంది. వారికి అవసరమైనంత సరుకు వుందని తాను చెప్పిన తర్వాతనే డబ్బు బ్యాంకులో జమచేయమని విజయసారధి షరతు పెడుతున్నారు.

సిరివనంగా కీర్తింపబడుతున్న విజయసారధి తోటలోకి కాలు పెడితే పంటలు పరిశీలించటానికి వచ్చామనిపించదు. ఒక నందనవనంలోకి ప్రవేశించినట్లుగా వుంటుంది. 2 ఎకరాలను ఒక బిట్టుగా విడగొట్టి మడులుగా మార్చారు. ఏ బిట్టును తిలకించాలన్నా నడిచి వెళ్ళాల్సిన అవసరం వుండదు. కంకర రోడ్లు ఏర్పరచారు. నాలుగు చక్రాల మోటారు వాహనంపై తిరుగుతూ ఆ తోటలోని పంటలను పరిశీలించవచ్చ్చు. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి, ఈ పంటల సాగు విధానాలను పరిశీలించి వెళుతుండటం విశేషం.

సెలవు లేని ‘‘నెలవు’’
ఈ తోటలో పనిచేయటానికి కవ్వగుంట, దిబ్బగూడెం, శ్రీరామవరం, గార్లమడుగు గ్రామాల నుంచి కూలీలు వస్తుంటారు. రోజుకు 50 మంది ఆడవాళ్ళు, 20 మంది మగవాళ్ళు ఈ తోటలో పనిచేయటం విశేషం. సెలవంటూ వుండదు. వారికి ఇతర పని వుండి పనిలోకి రాకపోతే సరి. లేకపోతే నెలలో 30 రోజులూ ఆ తోటే నెలవు. ఇక్కడ పని పురమాయించే అవసరం వుండదు. కొందరు చెట్ల క్రింద కాయలు ఏరుతుంటారు. మగవాళ్ళూ వాటిని ప్రత్యేక ప్రదేశానికి మోస్తుంటారు. డ్రయ్యర్‌లో పోస్తుంటారు. ట్రాక్టరుతో తొక్కటం, గ్రేడిరగ్‌ చేయటం . . .ఇలా ఎవరి పని వారిదే. వేళకు రావటం, నిర్ధారించిన సమయం పనిచేసి ఇళ్ళకు వెళ్ళిపోవటం. మరునాడు వచ్చి, తాము వదిలిన పనిలో నిమగ్నమౌతుంటారు. 40 ఎకరాలకు అవసరమైన నీటిని అందించటానికి బోరు బావులున్నాయి. వాటికి మోటార్లు అమర్చి, డ్రిప్‌ విధానంలో నీటిని అందించటం చాలా కాలంగా కొనసాగుతుంది.

కొసమెరుపు!
ఈ తోటలోని ప్రతి అంగుళం సేంద్రియ పదార్థంతో నిండి, సారవంతంగా మారింది. ఆకుల్లో రాలిపడిన కాయలు పని మనుషులకు కనిపించక, మొక్కలుగా తయారవుతున్నాయి. అలాంటి వాటిని వృథా చేయటం ఇష్టం లేక, పరిశీలనకు వచ్చిన రైతులకు ఇచ్చేవారు. అలా మొక్కలను ఆశించే వారి సంఖ్య పెరిగింది. నాణ్యమైన దేశవాళీ కాయలు వేరుచేసి, మళ్ళలో నాటటం ప్రారంభించారు. అవి మొలకెత్తిన రెండు మూడు నెలల తర్వాత మేలుజాతి మొక్కలను ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి రైతులకు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ జరుగుతున్న పనితీరు చూస్తే అది ఒక తోట అనిపించదు. ఒక పరిశోధనాలయం అనిపిస్తుంది. 25 ఏళ్ళ క్రితం పరిశీలనా దృక్పథంతో ప్రారంభించిన ఆ సిరివనం ఇప్పుడు సిరులు కురిపించే దశకు చేరింది.

Also Read: Seed Law: విత్తన చట్టం ఉల్లంఘించిన శిక్షలు తప్పవు.!

Leave Your Comments

Heliconia Crop: కొబ్బరి మరియు ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతరపంటగా హెలికోనియా.!

Previous article

Smallpox in Goats: మేకలలో వచ్చే మశూచి వ్యాధి/ పాక్స్‌/బొబ్బ రోగం.!

Next article

You may also like