Agricultural Works: ప్రస్తుతం రైతు సోదరులు యాసంగిలో సాగు చేసిన పంటలను కోసే పనులలో ఉన్నారు. పంట కోతల అనంతరం రైతు సోదరులు వేసవిలో ఈ క్రింది వ్యవసాయ పనులను చేపట్టి వచ్చే పంటకాలానికి సన్నద్ధం కావాలి.
1. పంట అవశేషాలు :
సాధారణంగా రైతులు ఖరీఫ్ మరియు రబీ కాలంలో పండిరచిన పంటల అవశేషాలను కుప్పలుగా వేసి తగలబెడుతున్నారు. దీని వలన పొలం శుభ్రపడి, దున్నడానికి తయారవుతుంది. కానీ ఈ పద్ధతి వలన వాతావరణ కాలుష్యం జరుగుతుంది. కాబట్టి ఈ పంటల అవశేషాలను రెండు విధాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. రోటావేటార్ సహాయంతో పంట యొక్క అవశేషాలను ముక్కలుగా చేసి భూమిలో కలియదున్నడం వలన, ఆ పంటకు వేసిన పోషకాలు తిరిగి నేలకు లభించును. మరియు నేలలో సేంద్రీయ గుణం పెరగటం వలన నేలలో నీరు నిలువ ఉండు సామర్ధ్యం పెరుగును. రెండవది పంట యొక్క అవశేషాలను సేకరించి, వాన పాములకు సేంద్రీయ వ్యర్ధ పదార్థాలుగా అందించి, రెండు నెలల్లో నాణ్యమైన వర్మి కంపోస్టుగా తయారు చేసుకోవచ్చు. ఈ వర్మికంపోస్టును పంట పొలాలకు వేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును.
2. సేంద్రియ ఎరువులు :
పొలంలో పశువుల ఎరువు, కంపోస్టు, చెరువు మట్టి గానీ వెదజల్లడం వలన నేల సారవంతమవుతుంది మరియు తేమ నిలువ చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది. లేదా దున్నే ముందుగా పొలంలో ఆవుల మందలు కానీ గొర్రెల మందలు కానీ, మేకల మందలు కానీ వదలడం వల్ల అవి విసర్జించే మల, మూత్రాలు భూమిలోకి చేరడం వలన సేంద్రియ పదార్ధము పెరిగి, భూసారం అభివృద్ధి చెందడమే కాకుండా, ఆ తరువాత వేసే పంటలలో సూక్ష్మపోషక లోపాలను నివారించవచ్చు.
3. లోతు దుక్కులు :
వేసవి (ఏప్రిల్-మే) నెలల్లో అడపా దడపా కురిసే వానలను సద్వినియోగించడానికి మాగాణి భూములను, మెట్ట భూములను, బీడు భూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు లేదా ఎండు దుక్కులు అంటారు. 3 సంవత్సరాల కొకసారి పెద్ద మడక లేదా ఎం.బీ నాగలి లేదా డిస్క్ నాగలి లేదా చిజేల్ నాగలి సహాయంతో 25-30 సెం.మీ. లోతు వరకు దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల భూమి లోపలి గట్టి పొరలు చీలిపోతాయి. అధిక వర్షాల సమయంలో కూడా నేల కోతకు గురికాదు. నేల గుల్లబారి నీరు బాగా ఇంకుతుంది. నేలలో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లో ఉన్న కలుపు విత్తనాల వేర్లు బయటపడి, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. సేంద్రియ పదార్ధాల లభ్యత పెరుగుతుంది. భూమి లోపల నిద్రావస్థలో ఉన్న పురుగుల ప్యూపాలు, వ్యాధికారక క్రిములు వేడికి చనిపోతాయి.
Also Read: Value Addition Palmyrah: తాటి పండు ఆవశ్యకత మరియు విలువ ఆధారిత ఆహార పదార్దాలు.!

Agricultural Works:
3.1 పురుగుల యాజమాన్యం :
పంటలను ఆశించే అనేక రకాల పురుగులు, పంట కోత దశలో వాటి నిద్రావస్థ దశలను నేలలో గాని, ఎండు ఆకులలో గాని, కొయ్య కాడలలో గాని ఉంటాయి. అవి అలాగే నేలలో వుండి మళ్ళీ తొలకరిలో పంటలను వేసినప్పుడు పంటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలో వున్న లార్వాలు, ప్యూపాలు బయటపడతాయి. వాటిని పక్షులు ఏరుకొని తినడం, ఎండ తీవ్రత వల్ల ఈ పురుగుల దశలు చనిపోతాయి. అనంతరం పంటకు వీటి బెడద తగ్గుతుంది.
3.2 తెగుళ్ళ యాజమాన్యం :
కేవలం పురుగులే కాకుండా వివిధ రకాల తెగ్గుళ్ళు కూడా పంటలను ఆశించి, అపారమైన నష్టాన్ని కలుగచేస్తాయి, ముఖ్యంగా వేరుకుళ్ళు, నారుకుళ్ళు, కాండం కుళ్ళు కలుగ చేసే శిలీంద్రాలు నేలలో వుండి పంటలను ఆశించి నష్టపరుస్థాయి. వీటి శిలీంద్ర బీజాలు భూమిలో నిల్వ వుంటాయి. దుక్కుల వల్ల భూమిలో పలు పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేల పైకి వస్తాయి. ఇవి ఎండ వేడిమికి గురై వ్యాధి కలుగచేసే శక్తిని కోల్పోతాయి. పంట లేని సమయం లో ఈ శిలీంద్రాలు కలుపు మొక్కలపై ఉంటూ మళ్ళి ఆ నేలలో పంట వేసినప్పుడు దానిని ఆశిస్తాయి. వేసవి దుక్కుల వల్ల కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేల పై పొరల్లోకి చేరటం వల్ల ఎండ తాకిడికి గురై నశిస్తాయి. కాబట్టి శిలీంద్ర జీవిత దశలు ఆగిపోవడం లేదా ఆలస్యమవడం ద్వారా తదుపరి పంటలను తెగ్గుళ్ళ బారి నుండి రక్షించుకునే అవకాశం వుంటుంది.
3.3 కలుపు యాజమాన్యం :
పొలంలో పంట లేని సమయంలో మొక్కలు లేదా పిచ్చి మొక్కలు పెరగడం సహజం. వివిధ రకాల కలుపు మొక్కలు, నేలలో నీరు, పోషకాలను గ్రహించి పంట పెరుగుదలను తగ్గించటమే కాకుండా అనేక రకాల పురుగులకు, శిలీంద్రాలకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. వేసవి దుక్కుల వల్ల నేలలో పాతుకుపోయిన కలుపు మొక్కలు చనిపోతాయి, ఎండ తాకిడి వల్ల వాటి తాలూకు గింజలు నశించి పోవడం వల్ల తరువాత పంటలో కలుపు చాలా తక్కువగా ఉంటుంది. కలుపు యాజమాన్యం పై పెట్టె ఖర్చు కూడా తగ్గుతుంది.
4 పచ్చి రొట్ట పంటలు :
వేసవిలో లోతు దుక్కులు చేసిన తరువాత నీటి వసతి వుంటే వేసవి పంటలుగా పెసర, మినుము, పిల్లిపెసర, జనుము, అలసంద వంటి పచ్చిరోట్ట, పశుగ్రాస పైరులను సాగు చేసుకోవచ్చు. చవుడు నెలల్లో పచ్చి రొట్టగా జీలుగు పైరు సాగు చేయటం మంచిది. తమ ప్రాంతాల్లోని నేల, నీరు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకొని (జనుము, పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చి రొట్ట పైర్లను) తొలకరి వర్షాలు కురవగానే విత్తిన తర్వాత 50% పూత దశ (45-60 రోజులు)కు రాగానే భూమిలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరిగి, ఖరీఫ్ మరియు రబీలో వేసే పంటలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. చౌడు భూముల్లో లవణశాతం తగ్గుతుంది.
5 భుసార పరీక్షలు :
వేసవిలో భూసార పరీక్షలు జరిపించుకొని, అందుకు అనుగుణంగా ఖరీఫ్ మరియు రబీ పంటలు వేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును. భూసార పరీక్ష చేయకుండా విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేల భౌతిక లక్షణాలు క్షీణించి వేసిన ఎరువుల వినియోగ సామర్ధ్యం తగ్గి, దిగుబడుల్లోను తగ్గుదల కనిపిస్తోంది. నేలలోని పోషకాల సమతుల్యం దెబ్బతిని సూక్ష్మధాతులోపాలు ఏర్పడతాయి. నేలలో సారం తగ్గిపోయి చౌడు, ఇతర సమస్యలు వస్తాయి. నేల లక్షణాలు, నేల సారం, నేలలోని లోపాలు తెలుసుకొని దానికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.
6. నమూనా సేకరణ :
వేర్లు పైపైన ఉండే వరి, జొన్న, మొక్కజొన్న, వేరు శనగ పంటలకు, 6 అంగుళాల లోతులో నమూనాలు సేకరించాలి. వేర్లు లోతుగా వెళ్ళే ప్రత్తి, చెరుకు లాంటి పంటలకు 12-18 అంగుళాల లోతులో మట్టి నమూనాలు సేకరించాలి. పొలంలో పంటలు లేని సమయంలో నమూనాలు సేకరించాలి. నేలపై ఉన్న చెత్త చెదారాన్ని ఏరివేసి వేసే పంటను బట్టి ఆంగ్ల అక్షరం ‘‘వి’’ ఆకారంలో గుంతను త్రవ్వి అంచుల వెంట ఒక అంగుళం మందాన 8-10 చోట్ల నమూనాలను సేకరించాలి. మట్టి తడిగా వుంటే నీడలో ఆరబెట్టాలి. పెడ్డలను నలగోట్టాలి. సేకరించిన మట్టిని ప్లాస్టిక్ షీటుపై పొరగా వేసి, చదును చేసి నాలుగు సమభాగాలుగా విభజించి, ఎదురెదురుగా ఉన్న భాగాలను తీసివేయాలి. మిగిలిన దానిలో పావు కిలో మట్టిని ఒక ప్లాస్టిక్ లేదా గుడ్డ సంచిలో వేసి, భుసార పరీక్ష కేంద్రానికి పంపాలి. పరిక్ష ఫలితాలు వచ్చాక, ఎంత అవసరమో అంతే ఎరువు వేయాలి.
7. విత్తనాలు మరియు ఎరువుల సేకరణ :
రాబోయే పంటకాలానికి కావలసిన విత్తనాలను మరియు ఎరువులను గుర్తింపు పొందిన సంస్థల నుంచి సేకరించుకుని భద్రపరచుకొంటే, అనుకున్న రకాలను పొలంలో వేసుకోవచ్చును. పైవిధంగా వేసవిలో వివిధ రకాల వ్యవసాయ పనులను చేపట్టి వచ్చే పంటకాలానికి రైతాంగం సన్నద్ధం కావాలి.
Also Read: Kiwi Cultivation: కివీ సాగు ఆమె జీవితాన్నే మార్చేసింది.. 24 ఏళ్ల కాశ్మీరీ యువరైతు విజయం.!