Soybean Cultivation and Processing: భారతదేశంలో సోయాబీన్ (గ్లైసిన్ మాక్స్) విస్తీర్ణం, ఉత్పత్తి, వాణిజ్యం మరియు ఆర్థిక లావాదేవీల పరంగా ప్రధాన నూనె గింజల పంట. సోయాబీన్ అతి ముఖ్యమైనటువంటి, అత్యంత చౌకగా దొరికే ప్రోటీన్స్‌కు మూలాధారం. సోయాబీన్ ప్రోటీన్స్‌లో మానవ శరీరానికి కావలసిన అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆసిడ్స్ దొరికే శాకాహార ఆహారం. సోయాబీన్ నుండి తయారుచేసే పాలు మరియు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెట్లో అధిక మోతాదులో ప్రోటీన్స్ కలిగిన ఆహార పదార్థాలు.
వీటిని ప్రోటీన్స్ కోసమే కాకుండా వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం మరియు పాలలో ఉండే లాక్టోస్ లేకపోవడం వలన దీన్ని విరివిగా అన్ని రకాల ఆహార పదార్థాలలో సోయాబీన్ విలువ ఆధారిత ఉత్పత్తులు కలుపుతారు. సోయాబీన్ పోషక విలువల పరంగా చాలా శ్రేష్టమైనది. ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, ఐరన్, జింకు, క్యాల్షియం, ఐసొఫ్లవోన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు దొరికే చౌకైన ఆహార ధాన్యం. మన దేశంలో 2021-22 సంవత్సరంలో సుమారు 28.0 మిలియన్ హెక్టార్లలో నూనె గింజల సాగు చేయడం ద్వారా సుమారు 33.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను ఉత్పత్తి చేయడం జరిగింది.
గత సంవత్సరం సుమారు 12.87 మిలియన్ హెక్టార్లలో సోయాబీన్ సాగు చేయడం జరిగినది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వానకాలంలో సుమారు 12.04 మిలియన్ హెక్టార్లలో సోయాబీన్ పంట అక్టోబర్ మాసంలో కోతకు సిద్ధంగా ఉంది. ఇది మొత్తం వాన కాలంలో సాగు చేస్తున్న నూనెగింజల్లో సుమారు 63.5% దేశవ్యాప్తంగా సుమారు 13.5 మిలియన్ టన్నుల సోయాబీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది దేశంలోని మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో సుమారు 40 శాతం. ప్రస్తుతం మనదేశంలో సోయాబీన్ ప్రధాన నూనె గింజల పంట. తెలంగాణలో గత సంవత్సరం సుమారు 0.38 మిలియన్ హెక్టార్లలో సోయాబీన్ సాగు చేయడం జరిగినది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 0.27 మిలియన్ టన్నుల సోయాబీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలోని మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో సుమారు 38 శాతం. ప్రస్తుతం తెలంగాణలో వేరుశెనగ తర్వాత సోయాబీన్ ప్రధాన నూనె గింజల పంట. తెలంగాణలో పూర్వపు ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలలో సోయాబీన్‌ను అధిక మోతాదులో సాగుచేస్తున్నారు. రాష్ట్ర సోయాబీన్ సాగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాటా సుమారు 39.6 శాతం మరియు ఉత్పత్తిలో 38.2 శాతం.
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న సోయాబీన్ సాగు, ఉత్పత్తి, సోయాబీన్ నిల్వ, నాణ్యమైన విత్తనాల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా విలువలు జోడిరచి రైతులకు మంచి గిట్టుబాటు ధరతో పాటు, ప్రజలకు నాణ్యమైన, బలమైన పోషక ఆహార పదార్థాలను మరియు గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, సోయాబీన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించ వలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరలలో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో సోయాబీన్ ప్రధాన ముడిసరుకుగా విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలతో పాటు సోయాబీన్ నుండి తీసిన నూనె మరియు సోయా లిసితిన్, సోయా ప్రోటీన్ల పౌడర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ల మాంసం, మీల్ మేకర్స్, సాస్ మరియు గ్రేవీస్, పొడి చేర్పులు, బేకింగ్ మిశ్రమాలు, టేస్ట్ మేకర్స్, మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల, సౌందర్య సాధనాలు, రోగనిరోధక ఏజెంట్, ఫార్మాస్యూటికల్స్ అప్లికేషన్స్ మరియు సబ్బులు తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.
ఆయా జిల్లాల ఉత్పత్తి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలు సోయాబీన్ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మా లైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని 3 (ఆదిలాబాద్, నిర్మల్ మరియు కామారెడ్డి) జిల్లాలోని రైతులు, యువతీ యువకులు మరియు సూక్ష్మ మరియు చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆ జిల్లాలో కేటాయించబడిన సోయాబీన్ మరియు వాటి విలువ ఆధారిత సోయాబీన్ నూనె, సోయా పాలు, పన్నీరు, మల్టీ గ్రీన్ ఆట, వివిధ మసాలా దినుసులలో ముడిసరుకుగా, సోయా సాస్, బలవర్ధకమైన చిన్న పిల్లల మాల్ట్ ఆహారం తయారు చేయడంలో, సోయా పట్టీలు, స్నాక్స్, ఇతర దినుసులతో ఎనర్జీ బార్స్ మొదలైనవి సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లు అయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-2020) అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లులలో ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల్లో సుమారు 31.8% పిల్లలకు వయసుకు తగ్గ బరువు లేదు, 33.1% మంది పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేదు మరియు 70.0% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సోయాబీన్‌ను అధికంగా పండిరచే జిల్లా అయినా ఆదిలాబాద్ పరిస్థితులు గనుక చూసినట్లయితే జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో అలాగే గిరిజన ప్రాంతాలలో ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల్లో సుమారు 52.0% పిల్లలకు వయసుకు తగ్గ బరువు లేదు, 45.7% మంది పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేదు మరియు 76.3% పిల్లలు రక్తహీనత తో బాధపడుతున్నారు.
జిల్లాలో పోషకాహార లోపాలు అధిగమించాలంటే ముఖ్యంగా చిరుధాన్యాలు, జొన్నలు మరియు సోయాబీన్ తో తయారుచేసిన మిల్లెట్ – సోయా ఆధారిత ఆహార పదార్థాల తయారీ మరియు వినియోగం పైన గిరిజన ప్రాంతాల రైతులకు మరీ ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి, మిల్లెట్స్- సోయాతో వివిధ ఆహార పదార్థాలు స్థానిక ఆహార పంటలతో బలవర్ధకమైన ఆహార పదార్థాలను తయారీ మరియు వినియోగము పైన అవగాహన కల్పించడం ద్వారా చిన్నపిల్లలు, మహిళలూ మరియు గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాలను అధిగమించడానికి ఆస్కారముంది. చిరుధాన్యాలు – సోయాబీన్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా చక్కెర వ్యాధి, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు, స్థూలకాయత్వం వంటివి రాకుండా ఉపయోగపడతాయని కూడా అవగాహన లేదు.
విలువ ఆధారిత సోయాబీన్ ఆహార పదార్థాల తయారీ: సోయాబీన్ నూనె:
ఒక టన్ను సోయాబీన్ నూనె ఉత్పత్తికి సుమారు 2.0 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. నూనె తీసిన తర్వాత ఉండే గానుగ చెక్కను ఎండబెట్టి మరియు పొడి చేస్తారు. నూనె తీసిన గానుగ చెక్కను వివిధ ఆహార పదార్థాలలో ముడిసరుకుగా వాడుతారు. సోయా ప్రోటీన్ కాన్సెంట్రేట్, సోయా ప్రోటీన్ ఐసోలేట్ వంటి అత్యంత విలువైన ప్రోటీన్ ఉత్పత్తులు నూనె తీసిన గానుగ చెక్క నుండి తయారు చేస్తారు. మార్కెట్లో దొరికే చిన్న పిల్లల ఆహారం మరియు బలవర్ధకమైన ప్రోటీన్ ఆధారిత ఆహారపదార్థాలలో వీటిని కలుపుతారు. ఇటువంటి మిషన్‌లకు అధిక వ్యయం ఖర్చవుతుంది.
మీల్ మేకర్స్: నూనె తీసిన గానుగ చెక్క పిండికి గోధుమపిండి, మొక్కజొన్న పిండి కలిపి ఎక్స్- ట్రుడర్ అనే యంత్రం ద్వారా మీల్ మేకర్స్ తయారుచేస్తారు. తక్కువ ఖర్చుతో సుమారు ఆరు నుండి ఎనిమిది లక్షల వ్యయంతో ఎక్స్- ట్రుడర్ అనే యంత్రం ద్వారా మీల్ మేకర్స్ తయారు చేయవచ్చు. మీల్ మేకర్స్‌ను సోయా చెంకుస్ అని కూడా పిలుస్తారు. వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తింటారు.
Also Read: Cabbage and Cauliflower Cultivation: క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో మెళుకువలు.!
ప్లాంట్ బేస్డ్ మీట్స్: ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తరుగుతున్న వనరులు, పెరుగుతున్న జనాభా, జంతువుల ( మేక, గొర్రెలు, కోడి మరియు ఇతర పశువు మాంసము ) నుండి తయారు చేసిన మాంసము తినడం వలన ప్రబలుతున్న వ్యాధులు అనారోగ్యం గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ మాంసకృత్తుల మరియు ఇతర పోషక విలువలు కలిగి ఉన్న ప్లాంట్ బేస్డ్ మీట్స్ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా రకాల ప్లాంట్ బేస్డ్ మీట్స్‌లో సోయా ప్రోటీన్ మూల ఆధారం.
బేకరీ ఉత్పత్తులు: నూనె తీసిన గానుగ చెక్క పొడి, సోయా ఆయిల్, సోయా లెసిథిన్, సోయా ప్రోటీన్ కాన్సెంట్రేట్ మరియు సోయాబీన్ పిండి మొదలైన వివిధ బేకరీ ఉత్పత్తులలో ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.
నూడిల్స్, పాస్తా మరియు వెర్మీసలి మొదలైన ఫాస్ట్ ఫుడ్స్ :
నూనె తీసిన గానుగ చెక్క పొడిలో సుమారు 38-42% వరకు ప్రోటీన్లు ఉంటాయి. గోధుమ పిండితో పాటు నూనె తీసిన సోయాబీన్ గానుగ చెక్క పొడిను కలపడం వలన నాణ్యమైన ప్రొటీన్లతో పాటు మంచి బలవర్థకమైన ఆహారం తయారవుతుంది. సుమారు ఆరు నుండి పది లక్షల వ్యయంతో పాస్తా మరియు వెర్మీసలి తయారుచేసే మిషన్‌ను కొనడానికి.
మల్టీ గ్రీన్ ఆట: గోధుమ పిండితో పాటు 5 నుండి 12 రకాల వివిధ ప్రధాన ధాన్యాలు, తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, మెంతులు , సోయాబీన్ లేదా నూనె తీసిన సోయాబీన్ గానుగ చెక్క పొడి కలపడం వలన నాణ్యమైన మల్టీ గ్రీన్ ఆట తయారు చేస్తున్నారు. వేయించిన 10-15% సోయాబీన్ ను కలుపుతున్నారు.
బేవరేజెస్, చాక్లెట్స్ మరియు ఇతర స్వీట్స్: సోయాబీన్ పిండి, సోయా ప్రోటీన్ కాన్సెంట్రేట్, సోయా ప్రోటీన్ ఐసోలేటస్, సోయా లెసిథిన్, నూనె తీసిన సోయాబీన్ పిండి మొదలైనవి విరివిగా కలిపి ప్రపంచ వ్యాప్తంగా బేవరేజెస్, చాక్లెట్స్ మరియు ఇతర స్వీట్స్ తయారు చేస్తున్నారు.
సోయా పాలు, పన్నీరు, ఇతర స్వీట్స్: సోయాబీన్ గింజలను నానబెట్టి వేడి నీళ్ళు కలిపి రుబ్బడం ద్వారా చిక్కని పాల లాంటి పదార్థం తయారవుతుంది. తదనంతరం వాటిని ఒక జాలి లేదా బట్ట ద్వారా వడపోయడం వలన మనకు చిక్కని సోయా పాలు తయారవుతాయి. వాటిని బాగా వేడి చేసి చల్లార్చి బెల్లం లేదా చక్కెర కలుపుకుని పాలలాగా తాగవచ్చు. సోయాపాలలో నిమ్మరసం, లేదా వెనిగర్ కలిపి పాలను విరగ్గొట్టి పన్నీరుగా మార్చవచ్చు. సోయా పన్నీర్‌ను సోయా టోఫు అని కూడా పిలుస్తారు. సోయా పన్నీర్ ద్వారా వివిధ రకాల స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ కూర కూడా వండుకుని తినవచ్చు.
మానవ ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యంలో కూడా సోయాబీన్ యొక్క పాత్ర ఎనలేనిది. సోయాబీన్ సాగు ద్వారా పంట మార్పిడి చేపట్టడం వలన నేల కోత మరియు భూసార క్షీణత తగ్గించి ఆరోగ్యమైన నేల తయారీకి ఉపయోగపడతాయి. ముఖ్యమైన పంటలో అంతర పంటగా, పంట మార్పిడిలో ప్రధాన పంటగా సోయాబీన్ సాగు చేసినట్లయితే ఎక్కువ మట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సోయాబీన్ సాగు చేసినట్లయితే నేలలో జీవవైవిద్యం మెరుగుపడుతుంది మరియు సూక్ష్మజీవుల ద్వారా నేలలో నత్రజని స్థాపన కూడా జరుగుతుంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, నాణ్యమైన విత్తనాల అభివృద్ధి, మొలక శాతం పెంపొందించే విధంగా చర్యలు మరియు సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల, తెగుళ్ళ నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన నిల్వ, పంట నిల్వ , ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా వివిధ ఆహారపదార్థాల తయారీలో ప్రధాన ముడిసరుకుగా వాడినట్లయితే లాభంతో పాటు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తక్కువ ఖర్చుతో చిన్న పిల్లల నుండి వృద్ధులకు బలమైన పోషక ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. తద్వారా ఆరోగ్య తెలంగాణను సాధించవచ్చు. అంతేకాకుండ రైతు స్థాయిలో మరియు వినియోగదారుని స్థాయిలో ధరల స్థిరీకరణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
-ఎ. పోశాద్రి, వై. ప్రవీణ్ కుమార్, యం. సునీల్ కుమార్,
యం. రఘు వీర్, జి. శివ చరణ్, ఎ. రమాదేవి, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, ఫోన్ : 9492828965
Thanks & Regards
M. Madhubala, Associate Editor
Eruvaaka Magazine
M. 7075751969
Also Read: Sorghum cultivation: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా అవశేష తేమ పై జొన్న సాగు లాభదాయకం
Must Watch: