Haemorrhagic Septicemia Disease in Buffalo: ఈ వ్యాధి పాశ్చురెల్లా మల్టీసిడా మరియు పాశ్చురెల్లా హిమోలైటిక అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన అన్ని రకాల ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, పిల్లులు, అడవి జంతువులలోను మరియు మనుషులలో కూడా కలుగు ఒక ప్రాణాంతకమైన వ్యాధి.
Also Read: Identification of Animals: ఆవులను, గేదెలను గుర్తించు వివిధ పద్దతులు.!
వ్యాధి లక్షణాలు:-
వ్యాధి లక్షణాలు 2 విధాలుగా వుంటుంది.
(1) అతి తీవ్రమైన లక్షణాలు:- పశువులు (ముఖ్యంగా చిన్న దూడలు) ఉన్నట్టుండి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో చనిపోతుంటాయి.
(2) తీవ్రమైన లక్షణాలు:- తీవ్రమైన జ్వరం (104-105°F) వుంటుంది. పశువులు దగ్గుతుంటాయి. గొంతు వాచి వుంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా వుంటుంది. తల, గొంతు, గంగడోలు, ఛాతి భాగాలలో చర్మం క్రింద నీరు చేరి పూర్తిగా వాచి వుంటుంది. నీళ్ళ విరోచనాలు, కడుపు నొప్పి వుంటుంది. పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోతుంది. నోటి నుండి జల్లు కారుతూ వుంటుంది. ముక్కులో నుండి బంకగా నీరు, చీము, కొన్ని సందర్భాలలో రక్తపు చారలు కారుతూ వుంటుంది. ఆకలి ఉండదు. పశువులు నీరసంగా ఉంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:
(1) శ్వాసనాళం నుండి ఊపిరితిత్తుల వరకు కోసి చూసినట్లైతే సురగతో కూడిన రక్తపు చారలు వుంటాయి.
(2) ఊపిరితిత్తులలో న్యూమోనియా వుంటుంది. ఊపిరితిత్తుల కణజాలం. చుట్టు ఫైబ్రస్ కణజాలం చేరి ఉండుటను గమనించవచ్చును. (3) శరీరంలోని వివిధ అవయవాలలో (కాలేయం, మూత్ర పిండాలు) రక్తపు చారలు వుంటాయి.
(4) గొంతు దగ్గర వాచి వుంటుంది. దీనిని కట్ చేసి చూస్తే నీళ్ళలాగా కాక జిగటుగా గట్టిగా వుంటుంది.
వ్యాధి నిర్ధారణ:
(1) రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా
(2) పైన వివరించిన వ్యాధి లక్షణాలు ఆధారంగా
(3) పైన వివరించిన వ్యాధి యొక్క చిహ్నముల ఆధారంగా
(4) ముక్కు నుండి కారే ద్రవాలను లేదా గుండె, ఊపిరితిత్తుల నుండి సేకరించిన ఇంప్రెషన్ స్మియర్స్న గ్రామ్స్ లేదా లిష్మన్ స్టెయిన్ చేసి వ్యాధికారక క్రిమిని సూక్ష్మదర్శినిలో గమనించినట్లైతే, బైపోలార్ ఆకారంలో కనిపిస్తుంటాయి.
చికిత్స:-
(1) ఈ వ్యాధి తక్కువ సమయంలో అకస్మికంగా ప్రబలి, చికిత్స చేయడానికి సమయం లేకుండా పశువులను చంపుతుంటుంది.
(2) పశువు చికిత్సకు అనుకూలంగా వుంటే ఈ క్రింది ఔషధమలను ఇవ్వవచ్చు.
1. వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- పోర్టిఫైడ్ ప్రొక్లెయిన్ పెన్సిలిన్ (40 లక్షల యునిట్లు), లేదా ఎనరోఫ్లాక్సాసిన్ లేదా సెఫలోస్పారిన్ లేదా సల్ఫనమైడ్ ఔషదములను నిర్ధేశించిన మోతాదులో, నిర్ధేశించిన కాలం పాటు, దగ్గరలోని పశువైద్యుని సహాయముతో ఉపయోగించినట్లైతే, చాలా వరకు పశువులలో మరణాలను తగ్గించవచ్చు.
2. వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- అతి తీవ్రమైన జ్వరం ఉంటుంది, కావున అంటి పైరెటిక్స్ ఔషదమలను, శోధమును తగ్గించడానికి ఆంటి ఇన్ఫ్లమేటరీ ఔషదములను ముఖ్యంగా స్టిరాయిడ్స్ వంటివి.ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
3. ఆధారము కల్పించు చికిత్స:- పశువు యెక్క స్థితిని బట్టి సెలైన్, విటమిన్స్, ఖనిజ లవణాలు, లివర్ ఎక్స్ట్రా ట్రాక్ట్ మొదలైన ఔషధములను నోటి ద్వారా కాని ఇంజక్షన్ రూపంలో కాని ఇవ్వవచ్చును.
నివారణ:- వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి. ఒత్తిడి కలిగించరాదు. క్షేత్రంలోని పశువులకు పరిశుభ్రమైన నీరు, మంచి పోషక ఆహారం మరియు గాలి అందేటట్లు చూడవలెను. 100 దూడలలో ఈ వ్యాధి సోకితే సూమరు 50-100 వరకు మరణిస్తాయి. కావున వర్షాకాలం రాక ముందు మే నెల చివరిలో గాని, జూన్ మొదటి వారంలో గాని గొంతువాపు టీకాను దూడలకు చెయ్యవలెను. ఈ టీకా ఒకటే కాని లేక గొంతువాపు, గాలికుంటు, జబ్బవాపు టీకాలతో కలిపినది కాని ఇవ్వవచ్చు. ఈ టీకాను 6 నెలలకు ఒకసారి ఇవ్వవలసి యుంటుంది. గొర్రెలలో అయితే 3 మి.లీ. టీకాను 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి.
Also Read: Murrah Buffalo: ముర్రా జాతి గేదెలను ప్రోత్సహించాలి