పుష్టిగా ఉండే ఆరోగ్యం పౌష్ఠికాహారంతోనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు పండుతున్న పంటలలో పోషకాలు తక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ డబ్బు సంపాయించుకుంటే చాలు ఆహారం కొనుక్కొని తింటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ ఆహారం మన శరీరానికి ఏ మేర లాభం చేకూరుస్తుంది? జరిగే అనర్ధాలు ఏంటి అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ కొందరు మాత్రం విభిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. పండ్లు కూరగాయలు ఎందుకు కొనుక్కోవాలి మనం పండించుకోలేమా అని మిద్దె తోటల పెంపకానికి పునాది వేస్తున్నారు.
ఒకప్పుడు పల్లెలు పచ్చని పైరుతో పలకరించేవి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివసించేవారు. కానీ ఇప్పుడు పల్లెలు కాస్త కాంక్రీటు మాయం అయిపోతున్నాయి. ఇక పట్టణాల గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చూద్దామన్నా భూమి కనిపించకుండా మొత్తం సిమెంట్ తో కప్పబడి ఉంటున్నాయి. దీంతో కాలుష్యం పెరిగి అంటూ రోగాలు ప్రబలుతున్న పరిస్థితి. కానీ కొందరు మాత్రం ఇంటిని పచ్చని పేరుతో నింపేస్తున్నారు. మిద్దెపై చిన్నపాటి పల్లె వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సేంద్రియ ఎరువులని వాడుతూ పూలు, పండ్ల మొక్కలు, కూరగాయలు తదితర పంటలు పండిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మిద్దె తోటల సంస్కృతి బాగా విస్తరిస్తుంది. మిద్దె తోట అనేది ఒక వ్యాపకంగా చేస్తున్నారు కొందరు. విత్తనాల సేకరణ, ఎలా విత్తుకోవాలి, చీడపీడలు, తెగుళ్ళు వస్తే తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ, కోత వంటి అంశాలపై విజ్ఞానం పొందుతున్నారు. ఇంట్లో ఉన్న వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, ఆకుకూరల వంటి వాటితో వర్మీకంపోస్ట్, జీవామృతం, ఘనామృతం తయారీల గురించి ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డాబాలు, బహుళ అంతస్తుల భవనాలు, బాల్కనీల్లో కొద్దిపాటి స్థలాల్లో పంటలను పండించేస్తున్నారు.
ఇంట్లో ఉండే పాత డబ్బాలు, ప్లాస్టిక్ బకెట్లు, థర్మోకోల్ డబ్బాలనే కుండీలు ఉపయోగిస్తూ మొక్కలు పెంచుతున్నారు. కొన్ని మొక్కలకు మార్కెట్‌లో లభించే గ్రో బ్యాగ్‌లనూ వాడుతున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వారి ఇంటిపై ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. బెండ, గోరు చిక్కుడు, సొరకాయ, మిర్చి, వంగ, బీర, దొండ, టమాటా, మునగ వంటి కూరగాయలు, పొన్నగంటి, గోంగూర వంటి ఆకుకూరలు, వామి, తులసి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. ఇక పూల మొక్కల సంగతి సరే సరి. ఒక్కసారి డాబా పైకి వెళితే చాలు చిన్నపాటి తోట మనకు స్వాగతం పలుకుతుంది. ఈ కలుషితమైన ఆహారం మాని ముందు ముందు ఎవరి పంట వాళ్లే పండించుకుంటారేమో అనేలా మారిపోయింది.
#GrowingYourOwnFood #TerraceGarden #middethotalu #agriculturelatestnews #eruvaaka