మన వ్యవసాయం

Ginger cultivation: అల్లం సాగులో సస్యరక్షణ చర్యలు

0

Ginger  రాష్ట్రంలో సుమారుగా 10,000 ఎకరాల విస్తీర్ణంలో అల్లం సాగు చేయబడుతున్నది.

 అల్లం వల్ల ఉపయోగాలు: ఇది సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అన్ని వంటకాల్లో విరివిగా వాడతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీళ్ళతో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీన్ని ఉదర, పంటి సంబంధమైన రోగాలకు బాధా నివారిణిగా, ఔషధంగాను ఉపయోగిస్తారు. ఎక్కువ కాండం కలిగి, తక్కువ పీచుతో, తక్కువ షూటు కలిగిన అల్లాన్ని ఎండబెట్టి, పొడి చేసి, వివిధ పదార్ధాల తయారీకి ఉపయోగిస్తారు. అల్లంలో ఉన్న ఒలియోరేసిన్ ను ‘జింజిబరిన్’ అంటారు. దీన్ని ఎండిన అల్లం నుండి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో వేరుచేస్తారు.

 దుంపకుళ్ళు ఈగ : దీని పిల్ల పురుగులు మెత్తని కుళ్ళు ఆశించిన దుంపలను మరియు కాండాన్ని తొలిచి లోపలి పదార్థాన్ని తినేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు వేడి వాతావరణంలో దుక్కులు లోతుగా దున్నాలి. దుంప కుళ్ళును తట్టుకునే, పీచు తక్కువగా వుండే అల్లం రకాలను సాగు చేయాలి. మురుగు నీటి కాలవలు ఏర్పాటు చేసి నీరు నిలవకుండా చేయాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను సన్నటి ఇసుకతో కలిపి తోటంతా సమంగా వేసుకోవాలి.

ఆకుముడత పురుగు : వీటి లార్వా ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ మరియు ఒక మి.లీ శాండోవిట్ ఒక లీటరు నీటికి చొప్పున 200 లీటర్ల మందునీరు ఎకరానికి కలిపి మందు ద్రావణం ఆకులపై పిచికారి చేయాలి.

మొవ్వు తొలుచు పురుగు ఈ పురుగు మొవ్వును తొలచటం వలన మధ్య కొమ్ము చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. +శాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2 మి.లీ. +శాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. +శాండోవిట్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారి చేయాలి.

దుంపకుళ్ళు తెగులు : అధిక నష్టం చేసే ఈ తెగులు వలన ఎకరాకు 10-20 క్వింటాలు దిగుబడులు తగ్గుతాయి. మురుగు నీటి కాలువలు లేకపోతే దుంపకుళ్ళు సమస్య తీవ్రమవుతుంది. 50 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం. భూమిలో మరియు కొమ్మలపై ఈ వ్యాధికారక శిలీంధ్రాలు జీవించి వుండి నీరు ద్వారా వ్యాపిస్తాయి. ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అవుతాయి. చర్మం వదులుగా ఉండి ఊడి వస్తుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి.

నిల్వలో కూడా ఈ తెగులు ఉధృతి పెరిగి దుంపలు కుళ్ళిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన తెగులు సోకని దుంపలను నాటడానికి ఎన్నుకోవాలి. విత్తనశుద్ధి పాటించాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేపపిండి ఎరువును వేసుకోవాలి, సరైన ఎరువుల యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన మొక్కల మొదళ్ళలో మెటలాక్సిల్ లేదా మాంకోజెబ్ 5 గ్రా. లీటరు నీటిలో కలుపుకొని పోసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా., లేదా ట్రైకోడెర్మా విరిడి 5 గ్రా. లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న 4-5 మొక్కలకు మరియు వరుసల్లోని పాదులను ముంపుగా తడపడం వలన దుంప కుళ్ళు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

త్రవ్వకం: సాధారణంగా అల్లం పంట కాలపరిమితి 9-10 నెలలు. అల్లం దుంపలు ఏప్రిల్-మే నెలల్లో నాటు కొంటే నవంబర్, డిసెంబరు, జనవరి మాసాలలో త్రవ్వకానికి వస్తాయి. ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం, ఆకులు, మొక్కల మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు.

అల్లాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి పంటకోత యొక్క సమయాన్ని నిర్ణయించాలి. ప్రధానంగా అల్లాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పచ్చి అల్లం (గ్రీన్ జింజర్) కొరకు దుంపలు విత్తిన 6 మాసాల తరువాత త్రవ్వడం ప్రారంభించాలి. ఎండు అల్లం కొరకు ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోవడం ప్రారంభమైనప్పుడు అంటే నాటిన 8 నెలల తరువాత కోత ప్రారంభించాలి.

Leave Your Comments

Integrated farming : సమగ్ర వ్యవసాయం తో లాభాలు

Previous article

CASTOR CULTIVATION: వానాకాలపు ఆముదం సాగు చేసే రైతులకు సూచనలు

Next article

You may also like