కరోనా పుణ్యమా అని అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. దాంతో ఆహారంలో అల్లం, వెల్లుల్లి వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు నాన్ వెజ్ లో మాత్రమే వాడే ఈ ఔషధం ఇప్పుడు ప్రతి వంటకంలో వాడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో వెల్లుల్లిని మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. అదే సమయంలో ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉన్నందున ప్రజలు దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడుతారు. సుగంధ పరిమళాలతో నోరూరించే రుచిని అందించే ఈ వెల్లుల్లిని వైద్య రంగంలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
పండించే విధానం :
వెల్లుల్లిని పండించడానికి ముందుగా పొలం పరిస్థితిని గమనించాలి. నేలను సున్నితం చేసి అందులోనీ సాంద్రతను వెలికితీసేందుకు బాగా దున్నుకోవాలి. తర్వాత పొలంని బట్టి సరిపడా ఎరువులు చల్లాలి. రసాయనిక ఎరువులకంటే సేంద్రియ ఎరువులని వాడటం ఇంకా మేలు. కాగా..ఒక హెక్టార్ పొలంలో 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, పొటాష్, సల్ఫర్ జోడించాలి. పొలంలో 100 కిలోల నత్రజనిని ఒకేసారి చల్లవద్దు. నాటు సమయంలో 35 కిలోలు, 30 రోజుల తర్వాత 35 కిలోలు, 45 రోజుల తర్వాత హెక్టారుకు 30 కిలోలు వాడాలి. అనంతరం వెల్లుల్లి నాటాలి. వరుస నుంచి వరుస దూరం 15 సెం.మీ. ఉండాలి. మొక్క నుంచి మొక్కకు దూరాన్ని 10 సెం.మీ.లో ఉంచితే దిగుబడి బాగా వస్తుంది. నాటిన తరువాత చీడపీడలను నిరోధించడానికి పురుగుమందులు పిచికారీ చేయాలి. ఇందుకోసం ఒక లీటరు నీటిలో పెండమెథలిన్ 3.5 నుంచి 4 మి.లీ క్లెయిమ్ మొత్తాన్ని కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. వెల్లుల్లి కింది భాగాల ద్వారానే వేరులు వస్తాయి కనుక నాటుకునే ముందు వెల్లుల్లిపాయలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. నాటిన వెంటనే తప్పని సరిగా నీరుని పట్టాలి. వెల్లుల్లి సాగు అనేది వాతావరణ పరిస్థితులకు చాలా సున్నితంగా ఉండే పంట.
వాతావరణం :
వెల్లుల్లి పంట వాతావరణాన్ని బట్టి దాని బలాన్ని పుంజుకుంటుంది. వివిధ దశల్లో ఈ పంటకు ఎంత తేమ అవసరం పడుతుందో అంతే వెచ్చని వాతావరణం కూడా తప్పనిసరి అవసరం అవుతుంది.అయితే బయటి మార్కెట్లలో వెల్లుల్లి కి సంబంధించి చాలా రకాలు ఉన్నాయి. సో… వేసుకొనే కాలాన్ని బట్టి నేల సాంద్రతను బట్టి రకాన్ని ఎంచుకుంటూ ఉండాలి.
ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి ఎండడానికి సిద్ధముగా ఉన్నపుడు పంట చేతిలోనికొచ్చిందని భావించాలి. వెల్లుల్లి గడ్డలను ఒక వారం పాటు సూర్య రశ్మికి ఎండబెట్టాలి. దీంతో దాని నాణ్యత బాగుంటుంది. సాధారణంగా హెక్టారుకు తొమ్మిది నుంచి పన్నెండు తన్నులు వెల్లులి లభిస్తుంది అని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వెల్లుల్లి దిగుబడిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఈ సాగుతో రైతులు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించవచ్చు.
వెల్లుల్లి ప్రయోజనాలు:
వెల్లుల్లిని పచ్చడి, కూరగాయలు, మసాలా దినుసులలో ఉపయోగిస్తారు. అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, ఆర్థరైటిస్, నపుంసకత్వము, ఇతర వ్యాధులకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు. యాంటీ బాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాల కారణంగా దీనిని వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
Also Read : రైతులకు భీమా చెల్లింపుల్లో రిలయన్స్ ఎగవేత !