ఆంధ్రప్రదేశ్మత్స్య పరిశ్రమవార్తలు

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

0

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1.2 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. అంతేగాకుండా 41 శాతం దేశ చేపల ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తుంది. దీనివల్ల రూ.195000 కోట్ల విదేశీ మారకద్రవ్యం కూడా గత సంత్సరం రావడం జరిగింది. ఈ సంత్సరం జనవరి నుంచి మార్కెట్ ధరలు చూసుకుంటే దిగువ చూపిన విధంగా ఉండటం గమనించవచ్చు.

జనవరి నుంచి సెప్టెంబర్ వరకు:
కట్ల, శీలావతి, మోసు ధరలు కిలోకు రూ.95 – 105, రూప్ చంద్ రూ. 97- 100, ఫంగస్(జెల్లా) రూ.65- 68 చొప్పున ఉన్నాయి.

  • గత సెప్టెంబర్ నుంచి చేపల ధరలు క్రమేపి పెరగడం గమనించవచ్చు. ప్రస్తుతం కట్ల, శీలావతి, మోసు ధరలు కిలోకు రూ.124 – 126, రూప్ చంద్ రూ. 124- 127, ఫంగస్(జెల్లా) రూ.82- 84 ఉన్నాయి. ఈ పెరిగిన ధరల వల్ల ఆక్వా రైతులు నిరాశ వదిలి, ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లభిస్తున్నందువల్ల కొంతమేర వారికి ఉపయోగకరంగా ఉంది.

గత సెప్టెంబర్ వరకు చేపల ధరలు తగ్గడానికి కారణాలు:
1. చేప మేతలు(దాణా) ధరలు పెరగడం 2. చెరువుల లీజు ధర పెరగడం 3. చేప పిల్లల ధర పెరగడం 4. ఫంగస్, రూప్ చంద్ ధరలు మార్కెట్లో తక్కువగా (కిలో 80- 90) ఉండటం,
రైతులు శ్రద్ధ చూపించక పోవడం వల్ల చేపల రైతులు ఆందోళనలో ఉండటం జరిగింది. అయితే పైన చెప్పిన విధంగా గత సెప్టెంబర్ నుంచి చేపల ధరలు గణనీయంగా పెరగడంతో ముఖ్యంగా రూప్ చంద్, ఫంగస్ చేపలు పెంచే రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం రూప్ చంద్, ఫంగస్ చేపల సాగు గత సంత్సరంతో పోలిస్తే 10 – 15 శాతం సాగువిస్తీర్ణం పెరిగింది. అలాగే వెన్నామి రొయ్యల సాగు, ధరలు పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇతర జిల్లాలు అన్నీ కలిపి 37560 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ప్రతి సంత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి 6.8 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. రైతులు ప్రతి ఏటా మూడు పంటలు తీస్తున్నారు. అవి..వేసవి కాలం పంట, శీతాకాలం పంట, వర్షాకాలంపంటల్లో వెన్నామి రొయ్యలను ఏపీలో సాగుచేస్తున్నారు.

వేసవి పంట ధరలు:
గత వేసవిలో సాగుచేసిన వెన్నామి రొయ్యల మార్కెట్ ధరలు మార్చి నెల 2024 లో దిగువ చూపిన విధంగా ఉన్నాయి…
20 కౌంట్ రొయ్యల ధర రూ.620లు, 30 కౌంట్ రొయ్య ధర రూ. 475 లు, 40 కౌంట్ రొయ్య ధర రూ.410 లు, 50 కౌంట్ రొయ్య ధర రూ.350 లు, 60 కౌంట్ రొయ్య ధర రూ.310 లు, 70 కౌంట్ రొయ్య ధర రూ. 290 లు, 80 కౌంట్ రొయ్య ధర రూ.270 లు, 90 కౌంట్ రొయ్య ధర రూ.260 లు, 100 కౌంట్ రొయ్య ధర రూ.250 చొప్పున ఉన్నాయి.
ఈ సంత్సరం వేసవి కాలం సాగులో మంచి ధరలు ఉన్నప్పటికీ సాగు విషయంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా… సీడ్ సరిగా విజయవంతం కాకపోవడం, ఎకరానికి వేయాల్సిన రొయ్యల సాంద్రత తగ్గించడం, నీరు కలుషితమవ్వడం, వ్యాధుల ఉధృతి, సరైన తల్లి రకాల లైన్లు దొరకకపోవడం.

శీతాకాలం పంటల ధరలు:
గత సంత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకు శీతాకాలం పంటలో ధరలు పరిశీలిస్తే…
20 కౌంట్ రొయ్యల ధర రూ.525లు, 30 కౌంట్ రొయ్య ధర రూ. 385 లు, 40 కౌంట్ రొయ్య ధర రూ.350 లు, 50 కౌంట్ రొయ్య ధర రూ.305 లు, 60 కౌంట్ రొయ్య ధర రూ.280 లు, 70 కౌంట్ రొయ్య ధర రూ. 260 లు, 80 కౌంట్ రొయ్య ధర రూ.240 లు, 90 కౌంట్ రొయ్య ధర రూ.230 లు,100 కౌంట్ రొయ్య ధర రూ.220 చొప్పున ఉన్నాయి.
ఈ సీజన్లో మార్కెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం గమనించడం జరిగింది. దీనికి కారణం ముఖ్యంగా ఈక్వేడార్ దేశం వెన్నామి రొయ్యలను తక్కువ ధరలకు(భారత దేశం కన్నా) అమెరికా, యూకే, చైనా దేశాలకు సరఫరా చేయడం వల్ల ఒక్కసారిగా వెన్నామి సాగు రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఫీడ్ ఖర్చులు కూడా పెరగడం వల్ల రైతులు ఒక్కసారిగా రొయ్యల సాగును గణనీయంగా తగ్గించి, చేపల సాగు వైపు దృష్టి మళ్లించారు.

వర్షాకాలంలో ధరలు…
వర్షాకాలంలో వెన్నామి రొయ్యల ధరలు గమనించినట్లయితే..
30 కౌంట్ రొయ్యల ధర రూ. 425 లు, 40 కౌంట్ రొయ్య ధర రూ.325 లు, 50 కౌంట్ రొయ్య ధర రూ.285 లు, 60 కౌంట్ రొయ్య ధర రూ.265 లు, 70 కౌంట్ రొయ్య ధర రూ. 245 లు, 80 కౌంట్ రొయ్య ధర రూ.225 లు, 90 కౌంట్ రొయ్య ధర రూ.215 లు, వంద కౌంట్ రొయ్య ధర రూ.205 చొప్పున ఉన్నాయి.

ఈ వర్షాకాలంలో ధరలు తగ్గడానికి కారణాలు..
విపరీతమైన వర్షాలు, ఈక్వేడార్ దేశ మార్కెట్ పోటీ ఉండడం, చెరువు నీరు కలుషితమవ్వడం, తల్లి రొయ్య రకాలు సరైనవి లేకపోవడం, వాతావరణ అసమానతలు కారణాలుగా పేర్కొనవచ్చు.
ప్రస్తుతం చేపలు, రొయ్యలకు మంచి ధరలు పలుకుతున్నాయి. దీనికి కారణాలను పరిశీలిస్తే .. కేంద్ర ప్రభుత్వం దాణా ఎగుమతులపై సుంఖం(జి.ఎస్.టి.) తగ్గించడంతో దాణా రేట్లు తగ్గడం, తల్లి రొయ్య ఎంపికలో రైతులు ఆలోచన సరళి మార్చుకోవడంగా తెలుస్తోంది.

ధరల స్థిరీకరణకు సూచనలు:

  • కేంద్ర ప్రభుత్వం తల్లి రొయ్యల పెంపక కేంద్రాలను నెలకొల్పడం
  •  చేపలు, రొయ్యల మేతల ముడిపదార్థాల ధరలు అదుపులో ఉంచడం
  • రైతుకు సాంకేతిక సలహాలు,యాజమాన్య పద్దతులపై విషయం నిపుణులతో అవగాహన కల్పించడం
  • చేపలు, రొయ్యలు సాగుచేసే రైతులకు పంట నష్టం వంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రోత్సహించడం
  • ప్రత్యామ్నాయ చేపలు, రొయ్య జాతులను సాగులో ప్రవేశ పెట్టడం
  • చేపల మార్కెట్ ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంచుకోవడం
  • రొయ్యలు/ చేపల నిల్వ కోసం శీతలీకరణ కేంద్రాలు, గిడ్డంగులు, ఐస్ ఫ్యాక్టరీలు వంటి సౌకర్యాలు కల్పించడం
  • ఆక్వా ల్యాబ్ లు, పరిశోధన కేంద్రాల ద్వారా రైతుకు సాగుపైన అవగాహన కల్పించడం
  • మార్కెట్ ధరలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
  • చేపలు, రొయ్యల విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించి ఆక్వా రైతులను ఆదుకోవడం.

డా.కె. వీరాంజనేయులు, మత్స్య శాస్త్రవేత్త, డా. క్రాంతికుమార్,
డా. రాజేంద్రప్రసాద్, డా. ప్రవీణ్ బాబు, కేవీకే, పందిరిమామిడి.

Leave Your Comments

నూతన శనగ రకం ఎన్.బి.ఇ.జి.- 833…సాగులో రైతు అనుభవం  

Previous article

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

Next article

You may also like