Coral Reef Degradation: సృష్టిలో చూడాల్సింది చాలా ఉంది. అందమైన ప్రకృతి మన కళ్ళముందే ఉన్నప్పటికీ మన అదేం గమనించకుండా మన పనిలో మనం ఉంటాము. కానీ ఒక్కసారి సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి చూస్తే ఎంత అందంగా ఉంటుందో చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. సముద్రం అడుగు భాగంలో అందంగా రంగురంగులతో పగడపు దిబ్బలు ఉంటాయి. అయితే వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం, అధికంగా చేపల వేట కారణంగా పశ్చిమ హిందూ మహాసముద్రంలోని పగడపు దిబ్బలు ప్రమాదంలో పడినట్లు తేలింది. వచ్చే 50 ఏళ్లలో అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికాభివృద్ధి వైపు పురోగమిస్తుండగా, భూగోళ ఉష్ణోగ్రత పెరగడం మానవజాతిని ప్రభావితం చేస్తుందని అది మరింత హీనమౌతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎన్నో జీవరాశులు కనుమరుగయ్యాయి. అంతెందుకు 2009-18 సంవత్సరాల మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 శాతం పగడాల దిబ్బలు కనుమరుగయ్యాయని తాజా సర్వే తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మహాసముద్రాలు మరింత వేడెక్కి.. నీటి అడుగున వున్న జలచరాలు చనిపోయే అవకాశముందని సర్వే హెచ్చరిస్తోంది.
Also Read: వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం డబ్బులను విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి
ఇంతకీ పగడ దిబ్బలు అంటే ఏంటి? … పగడ దిబ్బల గురించి చిన్నప్పుడు విని ఉంటాము. కానీ వాటి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఈ పగడ దిబ్బలు సముద్ర అడుగు భాగాన చేరి సముద్రంలో నివసించే ఎన్నో జీవరాశులకు నిలయంగా మారింది. అయితే పొల్యూషన్, ఉష్ణోగ్రత కారణంగా ఇవి విరివిగా దెబ్బ తింటున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా తీరంలో దిబ్బలు ఎక్కువగా దెబ్బతిన్నాయని సర్వే చెప్తుంది. అలాగే 40 సంవత్సరాల్లో 73 దేశాల్లో 11,700 చదరపు కిలోమీటర్ల మేర నాశనమయ్యాయి. ఇక ఆయా ద్వీప దేశాలలోని పగడపు దిబ్బలు అధిక ముప్పులో ఉన్నాయని చెబుతున్నారు. తూర్పు, దక్షిణ మడగాస్కర్, కొమొరోస్, మస్కరీన్ దీవులలోని నాలుగు ఉపప్రాంతాల్లో ఇప్పటికే దిబ్బలు అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపారు సైంటిస్టులు.
అయితే క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్ట్ ద్వారా పగడ దిబ్బలను రక్షించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ మేరకు పగడ దిబ్బలను సంరక్షించేందుకు చర్యలు మొదలు పెట్టారు. క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు సముద్ర జలాలను ఆకాశంలోకి వెదజల్లే టర్బైన్ ను వాడుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా సముద్ర జలాలు ఆవిరిగా మారి సూక్ష్మమైన ఉప్పు కణాలు మాత్రమే వాతావరణంలో తేలుతాయని, వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలుగా ఏర్పడతాయని చెప్తున్నారు నిపుణులు. ఈ విధంగా కొన్ని నెలలు తరబడి చేస్తే మునపటి వాతావరణంలా మార్పు చెంది పగడపు దిబ్బలు సురక్షితంగా ఉంటాయంటున్నారు.
Also Read: పోర్టబుల్ కంటైనర్‌లో అజోల్లా పెంపకం యొక్క ప్రయోజనాలు