మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

సుస్థిర దిగుబడుల కోసం  వివిధ మెట్ట పంటల్లో ఎరువుల వాడకం  

0

Fertilizers : వివిధ పంటల్లో అధిక దిగుబడుల కోసం కావాల్సిన పోషకాలను ఎరువుల రూపంలో అందిస్తాం. పంటలకు వేసిన ఎరువుల పోషకాల వినియోగ సామర్థ్యంపెరగాలంటే ఎరువులను సమతులంగా వాడాలి. వివిధ పరిశోధనా ఫలితాల ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాల వినియోగ సామర్థ్యం 15-40 శాతం లోపే ఉందని తెలిసింది. రైతులు ఈ పోషకాలను ఎరువుల రూపంలో సిఫారసు చేసిన దానికన్నా 2-3 రెట్లు అధికంగా వాడటం వల్ల పెట్టుబడి ఖర్చుతోపాటు, నేలలో పోషకాల సమత్యులత దెబ్బతిని నేల సారం తగ్గుతుంది. ఫలితంగా దిగుబడులు తగ్గుతున్నాయి. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా నేలలో ఉండే పోషకాల స్థాయిని బట్టి, పంటని, పంటకాలాన్ని, నీటి వసతిని బట్టి, సరైన ఎరువులు, కావాల్సిన మోతాదులో, సరైన పద్ధతిలో పంటకు అవసరమయ్యే కీలక దశలో వేస్తే అధిక, సుస్థిర దిగుబడులతో పాటు పోషక వినియోగ సామర్థ్యం పెరిగి, నేల సారాన్ని సంరక్షించి భావితరాలకు అందించగలం.
ఎరువులు వేసే సమయం:
సరైన సమయంలో ఎరువులు వేస్తే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
1) విత్తటానికి ముందు: నీటిలో కరగని ఎరువులైన రాక్ పాస్ఫేట్, బేసిక్ స్లాగ్, కంపోస్టు.సేంద్రీయ ఎరువుల వంటి వాటిని విత్తే కంటే 2-3 వారాల ముందే వేసుకుంటే కరిగే రూపంలోకి మారి మొక్క తీసుకుంటుంది. ఆమ్ల నేలల్లో లైమ్ (సున్నం), చౌడు నేలల్లో జిప్సం లాంటి వాటిని ఒక నెల ముందే వేసి కలియదున్నితే సమస్యాత్మక భూమి సవరించబడి, పోషకాల వినియోగం పెరిగి మొక్క అభివృద్ధి చెందుతుంది.
2) విత్తేటప్పుడు: విత్తటానికి ఒక రోజు ముందు ఆఖరి దుక్కిలో లేదా విత్తనం వేసే పరికరం (సీడ్ కమ్ ఫెర్టి డ్రిల్)తో వేసుకోవాలి. ముఖ్యంగా అన్ని పంటలకు మొత్తం భాస్వరాన్ని, భాస్వరపు ఎరువులు లేదా కాంప్లెక్సు ఎరువులను విత్తే సమయంలో వేసుకుంటే మొక్క వేరు వ్యవస్థ బలపడుతుంది. కొంత నత్రజని, పొటాషియాన్ని కూడా విత్తే సమయంలో వేసుకోవాలి. జింక్, గంధకం కల్గిన ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి.
3) విత్తిన తర్వాత (పై పాటుగా): పంట కాలాన్ని బట్టి నత్రజని ఎరువులను అవసరమైన దశలో పై పాటుగా వేసుకోవాలి. పొటాషియాన్ని కూడా పూత సమయంలో పై పాటుగా వేసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో పై పాటుగా (యూరియా, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్, 19-19–19 వంటివి) ఎరువులను పంటపై పిచికారి చేసుకుంటే త్వరగా మొక్కకు పోషకాలు అందుతాయి.
4) పంట కాలంలో పలు దపాలుగా వేసుకోవడం: పంట కాలం, అవసరాన్ని బట్టి దీర్ఘకాలిక పంటలకు నత్రజనిని 2-4 సార్లు పై పాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. నేల రకాన్ని, పంట కాలాన్ని బట్టి పొటాషియాన్ని 2-3 దఫాలుగా వేసుకోవాలి. సూక్ష్మపోషక లోపాల తీపత్రను బట్టి కూడా 2-3 సార్లు సూక్ష్మ పోషకాల ఎరువును పిచికారి చేయాలి.

 వివిధ పంటలకు ఎరువులు వేసే సమయం

పత్తి: ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరం, విత్తిన 20, 40, 60 , 80 రోజులకు నత్రజని , పొటాషియం 1/4 వ వంతు చొప్పున 4 సార్లు వేయాలి.

 సోయాచిక్కుడు: రైజోబియం జపానికం కల్చర్ తో విత్తన శుద్ది చేయాలి.
ఆఖరి దుక్కిలో సగం నత్రజని (50 శాతం)+ పూర్తి భాస్వరం,  సగం పొటాష్ వేయాలి. 30-35 రోజులకు (పూత దశలో) మిగతా సగం నత్రజని, పొటాష్ లను వేయాలి. గింజ ఎదుగుదలకు పూత, కాత దశలో లేదా బెట్ట/నీటి ముంపు సమయంలో 2% యూరియా లేదా 1% మల్టి -కె లను  5-7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

 జొన్న:
ఆఖరి దుక్కిలో 25 కిలోల డి.ఎ.పి, 22 కిలోల యూరియా,15 కిలోల ఎం.ఓ. పి వేసుకోవాలి. 30-35 రోజులకు (పూత దశలో) 20- 22 కిలోల యూరియా వేయాలి.

కంది: కంది పంటకు ఆఖరి దుక్కిలో విత్తనంతో పాటే ఎరువులు వేసుకోవాలి.
రైజోబియం కల్చరు 200 గ్రా./ 8 కిలోల విత్తనానికి పట్టించి, పూర్తి నత్రజని,
భాస్వరం వేసుకోవాలి.

ఎరువులు వేసే విధానం:
సరైన విధానంలో ఎరువులు వేస్తే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
నేలలో వెదజల్లడం: విత్తే ముందు పొలంలో ఎరువులను వెదజల్లడం (ముఖ్యంగా మాగాణి పొలాలకు మాత్రమే), జింక్, జిప్సం, సున్నం లాంటి వాటిని వెదజల్లడం వల్ల నేలలో ఉండే సమస్యను నివారించవచ్చు.పైరు వత్తుగా పొలంమంతా పెరిగి వరుసలు లేని పైర్లకు, వేర్లు నేల అంతా అల్లుకొని ఉంటే నీటిలో కరగని ఎరువులు (రాక్ ఫాస్పేట్) దగ్గరగా విత్తనం విత్తే పైర్లలో ఈ పద్ధతి మంచిది. వరి మాగాణులు, పశుగ్రాస పంటలు, ఆకుకూర వంటల్లో వెదజల్లే పద్ధతి వల్ల పోషక వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొలమంతా ఎరువు చల్లడం వల్ల అధిక విస్తీర్ణంలోని మట్టి రేణువులతో కలయిక వల్ల ఎక్కువ
స్థిరీకరణ చెంది, పైరుకు అందదు. కలుపు మొక్కలు ఎక్కువగా ఉపయోగించుకోవడం, చల్లే విధానంలో తేడా ఉంటే పైరు సమానంగా ఎదగకపోవడం పోషకాలు ఆవిరి అవడం లేదా భూమి పొరల్లోకి పోవడం జరుగుతుంది.
 ప్లేస్మెంట్ పద్ధతి: విత్తనానికి లేదా మొక్కలకు దగ్గరలో ఎరువును వేసే పద్ధతి. ఈ పద్ధతిలో 4 రకాలున్నాయి.

  1. పట్టీవలే ఎరువు వేయడం (బ్యాండ్ ప్లేసుమెంట్): మొక్క వరుసకు ఒక పక్కగాని లేదా రెండు వైపులా గాని 4-5 సెం. మీ. లోతైన కాలువ చేసి దానిలో ఎరువులు వేసి మూసివేయాలి.
  2. స్పాట్/ పాకెట్ ప్లేస్మెంట్: ఒక్కొక్క మొక్కదగ్గరలో 4-5 సెం.మీ. లోతైన గుంత తీసి, గుంతలో ఎరువు వేసి మట్టి కప్పాలి. ముఖ్యంగా కూరగాయ పంటలకు వాడాలి.
  3. రింగ్ ప్లేస్మెంట్: పండ్ల తోటల్లో మొక్కల మొదళ్ళకు దూరంగా రింగ్ వంటి కాలువ లేదా గాడి తీసి దానిలో ఎరువు వేసి మట్టితో కప్పాలి.
  4. రెండు మొక్కల వరుసల మధ్య తేలిక నాగలితో చాలు తీసి ఎరువును వేసి కప్పివేయాలి.
    ఫెర్టిగేషన్: సాగు నీటి ద్వారా ఎరువులను పైరు వరుసకు దగ్గరలో అందించే పద్ధతిని ఫెర్టిగేషన్ అంటారు. ఈ పద్ధతి వల్ల ఖరీదైన నీటిలో కరిగే ఎరువులు ముఖ్యంగా నత్రజని, పొటాషియం ఎరువులను అందించవచ్చు తద్వారా ఎరువుల ఖర్చు తగ్గి పోషక వినియోగ సామర్థ్యం పెరిగి, దిగుబడులు పెరుగుతాయి. మొక్కకు నేరుగా అందించే విధానంలో వేర్లను ముంచడం, నాటే ముందు వేర్లను పోషకాల ద్రావణంలో ముంచి నాటుతారు. భాస్వరం లోపం ఉన్న నేలల్లో వరి నారును భాస్వరం ద్రావణంలో ముంచి నాటడం వల్ల మంచి ఫలితం వస్తుంది.
     పోషకాలను మొక్క ఆకులపై పిచికారి చేయడం:
    ఎరువులను నీటిలో కరిగించి, ఆ ద్రావణాన్ని ఆకుల మీద పిచికారి చేయడంవల్ల పోషకాలు నేరుగా మొక్కలకు అందుతాయి. ఈ విధానం వల్ల మొక్కల ఆకులు పోషకాలను త్వరగా గ్రహించడం వల్ల లోప సవరణ జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని, మెగ్నీషియం, సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, బోరాన్ పోషకాలను ఈ పద్ధతిలో సమర్థంగా అందించవచ్చు. కాని ద్రావణం గాఢతను సరిచూసుకొని పంటను బట్టి, పోషకాన్ని బట్టి వాడుకోవాలి.
    వివిధ పంటలకు సిఫారసు చేసిన పోషకాల మోతాదు (కిలోలు/ఎకరానికి):
    1. పత్తి: వానాకాలం లో హైబ్రిడ్ రకాలకు 32 +16 +12 కిలోలు,
    2. సోయాచిక్కుడు వానాకాలం పంటకు 24 +24 +16 కిలోలు,
    3. జొన్న వానాకాలం పంటకు 24 +12 + 8 కిలోలు,
    4. కంది వానాకాలం పంటకు 8 +20 + 0 కిలోలు, యాసంగి పంటకు 16 + 20 + 0 కిలోల చొప్పున నత్రజని+భాస్వరం+పోటాష్ నిచ్చే ఎరువులు వేయాలి.  ఎరువులు వివిధ రకాలుగా వేసుకోవచ్చు. కాని అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
  5. నీటిలో వెంటనే కరిగే నత్రజని, పొటాషియం ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగావేసినట్లయితే మొలక దెబ్బతింటుంది. కావును ఈ ఎరువులను విత్తనానికి దూరంలో వేసే విధానాన్ని ఎంచుకోవాలి.
  6. భాస్వరపు ఎరువులు విత్తనానికి తగిలినప్పటికీ మొలక దెబ్బతినదు.
    భాస్వరం నేలలో కదలదు కాబట్టి విత్తనాలకు, మొక్కకు అతి దగ్గరలో వేస్తే వేర్లకు అందుబాటులో ఉంటుంది. విత్తనాన్ని భాస్వరాన్ని కలిపి వేసుకోవచ్చు.
  7. పప్పుజాతి పంటలకు ఎరువులు దూరంలో వేసుకోవాలి.
  8. వేరు వ్యవస్థను బట్టి లోతుకు పోని పంటలకు బాండ్ ప్లేస్మెంట్, లోతుకు పోయే పంటలకు విత్తనం వరుసకు కింద ఎరువు పడేలా సీడ్ కమ్ ఫెర్టిడ్రిల్ ద్వారా వేసుకోవాలి.

డా. ఎం. సురేష్, డా. కె. భానురేఖ,
డా. బి. రాజేశ్వరి, డా. జి.అనిత, డా.శ్రీధర్ చౌహాన్,
వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
ఫోన్ నం. 8978672595

Leave Your Comments

వరి నాట్లలో ఈ జాగ్రత్తలు పాటించండి

Previous article

వర్షాభావ పరిస్థితుల్లో పంటల్ని ఇలా సంరక్షించుకోండి !

Next article

You may also like