Fenugreek leaves : చెంచలి ఆకులో ఎన్నో పోషకాలు – మరెన్నో ఔషధ గుణాలు ప్రకృతిలో ఎన్నో రకాల పోషక, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. వర్షాకాలంలో పొలాల గట్లపై, బీడు భూముల్లో, పంటపొలాల్లో, రోడ్లవెంట సహజంగా ఎక్కడపడితే అక్కడ పెరిగే చాల రకాల మొక్కల్ని కలుపు మొక్కలుగా, పిచ్చి మొక్కలుగా భావించి తీసి పారేస్తుంటాం. అయితే వీటిల్లోనూ ఎంతో విలువైన పోషక, ఔషధ గుణాలుంటాయి. ఇలాంటి కోవలోకి చెందిందే చెంచలాకు. శాస్త్రీయంగా దీనిని డైజెరా మురికేటా అని పిలుస్తారు. ఇది తోటకూర కుటుంబానికి చెందింది. దీనిలోని పోషక గుణాలు తెలిసిన కొంత మంది పల్లె వాసులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనులు ఇప్పటికీ దీనిని ఆహారంగా, ఔషధంగా, ఆకుకూరగా వాడుతున్నారు. వాత, పిత్త, కఫ దోషాలను పొగొడుతుందని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో చెంచలి ఆకును ఎక్కువగా ఉపయోగిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో చెంచలి ఆకును తోటకూర మాదిరి ఆకుకూరగా వండుకుంటారు. మిగతా ఆకుకూరలలాగే దీనిని వేరే కూరగాయలతో, పప్పుతో, టోమాటోతో గాని వండుకోవచ్చు. ఈ మొక్కలోని అన్ని భాగాలు ఆకులు, పూలు, గింజలు, కాండం ఉపయోగపడతాయి. చూడటానికి ఇది తోటకూరలాగే ఉంటుంది. పూలు గులాబి రంగులో, కాయలు గుండ్రంగా ఉంటాయి. చెంచలి ఆకులో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు; ఫ్లవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, ఫీనాల్స్ వంటి వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చెంచలి ఆకును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తహీనత సమస్యలను అరికడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల అది ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. విటమిన్-ఎ ఉన్నందున కంటి చూపు సమస్యల నుంచి కాపాడుతుంది. చెంచలి ఆకు రసం తీసుకోవడం ద్వారా కిడ్నీలలో రాళ్ళు, ఇతర మూత్రపిండ సమస్యలను దూరం చేయవచ్చని చెబుతారు. బాలింతలలో పాలు ఎక్కువగా రావడానికి ఈ మొక్క వేర్ల కాషాయం తోడ్పడుతుంది. చెంచలి ఆకును ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్ వంటి అనేక సమస్యలకు హెర్బల్ మెడిసిన్ గా దీనిని ఉపయోగిస్తారు. ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచితే త్వరగా మానిపోతాయని చెబుతారు.
చెంచలి ఆకులో ఎన్నో పోషకాలు – మరెన్నో ఔషధ గుణాలు
Leave Your Comments