Fenugreek Farming: వాతావరణం : మెంతి ని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత మంచు అనుకూలం. గింజల కోసం అయితే రబీ కాలంలో, ఆకు కూరగా సంవత్సరమంతా నీటి పారుదల కింద పండించవచ్చు.
నేలలు : వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలిక పాటి నేలల్లో సాగుకు అనుకూలం. అధిక ఆమ్ల,క్షార లక్షణాలు గల భూములు పనికి రావు. 6.0 – 7.0 ఉదజని సూచిక కలిగిన సారవంతమైన ఇసుక నేలలు మరియు మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలలు అనుకూలం.
విత్తే కాలం : గింజల కొరకు అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు, ఆకుకొరకు సంవత్సరమంతా విత్తుకోవచ్చు.
విత్తటం : నల్లరేగడి నేలల్లో ఎకరానికి 12 కిలోల విత్తనం వాడి, గొర్రుతో వరసకు మధ్య 30 సెం.మీ. వరసలో మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.
- తేలిక నేలల్లో ఎకరానికి 6 కిలోల విత్తనం వాడి, పైన తెల్పిన దూరంలో విత్తుకోవాలి.విత్తేముందు కార్బండైజిమ్ 1 గ్రా.,కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
- ఎకరానికి 600 గ్రా. చొపూన రైజోబియం కల్చర్ తో విత్తన శుద్ధి చేయటం వలన దిగుబడులు పెరుగుతాయి.
Also Read: మెంతి సాగుతో అధిక ఆదాయం…
ఎరువులు :
- ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతోబాటు, 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను వేసుకోవాలి.
- ప్రతి ఆకుకోత తర్వాత 40 కిలోల అమ్మోనియం సల్ఫేటు వేసి నీరు కట్టాలి.
అంతర కృషి :
- విత్తిన వెంటనే పెండిమిధాలిన్ బరువైన నేలల్లో అయితే ఎకరానికి 1.3 లీ., తేలిక నేలల్లో అయితే 1 లీ. 200 లీ. నీళ్ళలో కలిపి పిచికారి చేసుకొని మొదటి నెల వరకు కలుపు రాకుండ నివారణ చేసుకోవచ్చు.
- విత్తిన 15 – 20 రోజులకు ఒకసారి కలుపు తీసి మరో 15 – 20 రోజులకు గొర్రుతోగాని, దంతితోగాని అంతరకృషి చేయాలి.
సస్యరక్షణ :
పురుగులు : ఈ పంటను సాధారణంగా పేనుబంక, ఆకు తినే పురుగులు, మిడతలు ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమిధొయేట్ 2.0 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. రబ్బరు పురుగు అకులను, రెమ్మలను తిని వేస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ళు :
మొక్కల లేత దశలో వడలు తెగులు (డాంపింగ్ ఆఫ్) ఆశిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. పూత, కాయ దశలో బూడిద తెగులు ఆశిసుంది. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడిని చల్లి నివారించవచ్చు.
కోత : కాయలు గడ్డి రంగుకు మారినప్పుడు మొక్కలను పీకి పొలంలోనే 2 – 3 రోజులు ఎండనివ్వాలి. ఎండిన తర్వాత నూర్చుకొని గింజలను ఎండబెట్టి సంచుల్లో నిలవ చేసుకోవాలి.
ఆకుకూర కొరకు : విత్తిన 25 – 30 రోజులకు మొదటి కత్తిరింపు తీసుకోవాలి. అటు తర్వాత ప్రతి 12 – 15 రోజులకు ఒక కత్తిరింపు చొప్పున తీసుకోవాలి. 2 – 3 కత్తిరింపుల తర్వాత మొక్కలను గింజల కోసం వదిలి పెట్టాలి.
గింజల కొరకు : గింజలు విత్తిన 5 – 6 వారాల తర్వాత పూత ప్రారంభమై 10 – 11 వారాల్లో కోతకు సిద్ధమవుతుంది. కాయలు గడ్ది రంగుకు మారినపుడు మొక్కలను పెరికి, పొలంలో 2 – 3 రోజులు ఎండనివ్వాలి. తర్వాత కాయలను కర్రలతో కొట్టి, గింజలను తీసి, శుభ్రపరచి గోనె సంచుల్లో నిలవ చేయాలి
దిగుబడి :
ఆకుకూర దిగుబడి : నీటి పారుదల కింద ఎకరానికి 4 నుండి 5 టన్నుల దిగుబడి వస్తుంది, దేశవాళీ రకాలు ఎకరానికి 2800 – 3200 కిలోలు (3- 4 కత్తిరింపుల్లో) ఇస్తాయి.
గింజల దిగుబడి : వర్షాధారం కింద ఎకరానికి 3-3.5 క్వింటాళ్ళు దిగుబడి. నీటి పారుదల కింద ఎకరానికి 4 – 6 క్వింటాళ్ళ గింజల దిగుబడి వస్తుంది.
Also Read: హరిత మొక్కల ఎరువుల వల్ల కలుగు లాభాలు