ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధికాదాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముంది. మన దేశంలోని వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ వాటా 12 శాతం వరకు ఉంటుంది. గ్రామీణ రైతులు తమ పెరట్లో అధికోత్పత్తి సామర్థ్యం గల గ్రామప్రియ, శ్రీనిధి, వనరాజ, గిరిరాజ, కడక్ నాథ్ రకాలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
నాటుకోళ్లలో ఉత్పత్తి సామర్థ్యం తక్కువ. దీంతో నాటుకోళ్లను సంకరపరచి పెరటి పెంపకానికి అనువైన మేలైన రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కోళ్లకు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఉంటుంది. దేశవాళీ కోళ్ల కన్నా ఎక్కువ బరువు పెరుగుతాయి. గుడ్ల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. 5 నుండి 6 మాసాల్లో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఈ కోళ్ళలో పొదిగే స్వభావం తక్కువ. కనుక ఈ కోళ్ల గుడ్లను దేశీయ కోళ్లకు పొడిగించడం లేదా ఇంకుబేటర్ లో గానీ పొడిగించాలి. ఆరు వారాల వరకు కోడి పిల్లలకు నిర్ధిష్ట ఉష్ణోగ్రత అందేలా బ్రూడింగ్ పద్ధతిలో పెంచాలి. బ్రూడర్ లో కరెంట్ బల్బుల సహాయంతో ప్రతి కోడి పిల్లకు రెండు వాల్టుల చొప్పున వేడి అందించాలి. దాణా కొరకు 50 శాతం జొన్న లేదా సజ్జ పిండి, 28 శాతం నూనె తీసిన వేరుశనగ లేదా పొద్దుతిరుగుడు, 20 శాతం విటమిన్, మినరల్ మిక్సర్ కలిపి ఇవ్వాలి.
మారెక్స్, గంబోరా, మసూచి, కొక్కెర తెగులు వంటి వ్యాధుల బారి నుండి కాపాడేందుకు టీకాలు వేయించాలి. కోడి పిల్లలు ఒత్తిడికి గురికాకుండా యాంటీ స్ట్రెస్ విటమిన్లను ఇవ్వాలి. కోళ్లు పొడుచుకోకుండా ఉండేందుకు దాణాలో సూక్ష్మధాతువులు 100గ్రా., ఉప్పు 450 గ్రా. ప్రతి 10 కిలోల దాణాలో కలిపి అందించాలి. 4 నుండి 6 వారాల వయస్సు దాటిన తరువాత వీటిని పెరట్లో పెంపకం చేపట్టవచ్చు. పెరటి వాతావరణానికి అలవాటు పడ్డాక ఇవి తమకు కావలసిన ఆహారాన్ని సులువుగా సేకరించుకుంటాయి. ఇవి పెరటిలో లభించే మొక్కలు, ధాన్యాలు, క్రిమి కీటకాలు, గడ్డి గింజలు మొదలైనవి తింటూ ఎదుగుతాయి. సాయంత్రానికి ఇవి తమ గూటికి వచ్చేలా అలవాటు చేయాలి.
గ్రామప్రియ: ఇవి ఆకర్షణీయమైన రంగు కలిగిన ఈకలతో ఉంటాయి. ఇది ఒకటిన్నర సంవత్సరంలో 250 గుడ్ల వరకు పెడుతాయి. వీటి గుడ్లు నాటుకోడి గుడ్ల రంగులో ఉంటాయి. ఆరు నెలలకు ఇవి రెండు కిలోల బరువు పెరుగుతాయి.
శ్రీనిధి: ఇవి విభిన్న రంగులలో ఆకర్షణీయమైన ఈకలు, పొడవైన కాళ్లతో ఉంటాయి. అధిక రోగనిరోధక శక్తి వీటి ప్రత్యేకత. ఇవి ఐదు నెలల వయసు నుంచి గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏటా 140 నుంచి 150 వరకు గుడ్లు పెడుతాయి. ఆరు నెలలకు 1800 గ్రా. వరకు బరువు పెరుగుతాయి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి.
వనరాజ: ఇవి రంగు రెక్కలు కలిగి ఉంటాయి. పెద్ద సైజు గుడ్లను పెడతాయి. వీటికి ఎక్కువ రోజులు బతికే సామర్థ్యం ఉంది. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఏడాదిన్నరలో 110 వరకు గుడ్లు పెడతాయి. ఐదు నెలల వయసు నాటికి 2.2 కిలోల వరకు ఎదుగుతాయి. వీటి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి.
గిరిరాజ : ఇవి పెరటిలో విస్తృతంగా లభించే ధాన్యపు గింజలు, క్రిమి కీటకాలు, పచ్చగడ్డి, వ్యర్థ పదార్థాలను తింటాయి. ఇవి 3.5 కిలోల నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. దేశీ కోళ్ల కన్నా రెండు రెట్లు అధిక బరువు కలిగి ఉంటాయి. ఏటా 140 నుంచి 150 గుడ్లు పెడతాయి.
కడక్ నాథ్: ఇది భారతదేశంలో అరుదుగా లభించే ఔషధ గుణాలున్న కోడి. వీటిని ముఖ్యంగా మధ్యప్రదేశ్ భిల్, బిలాల గిరిజన తెగవారు ఎక్కువగా పెంచుతారు. దీనికి మరో పేరు “కాలిమాసి” దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. ఈ కోడి ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని బతకగలదు. “మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. దీనిలో 25 శాతం మాంసకృత్తులు, 18 రకాల అమైనో యాసిడ్స్, బి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్స్ ఉన్నాయి. దీని మాంసం గుండె వ్యాధి గ్రస్తులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందని “సెంట్రల్ ఫుడ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్, మైసూర్ వారి పరిశోధనల్లో తేలింది. ఆరు నెలలకు దీని శరీర బరువు ఒకటిన్నర కిలోలకు పెరుగుతుంది. ఇది ఏడాదికి 120 గుడ్ల వరకు పెడుతుంది.
రాజశ్రీ: శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం వారు వీటిని అభివృద్ధి చేశారు. ఇవి ప్రత్యేకమైనవి. వనరాజ కోళ్లతో పోలిస్తే ఇవి ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ రకం రూపకల్పనలో మూడు విదేశీ జాతి కోళ్లతో పాటు, దేశవాళీ కోళ్ల రక్తాన్ని ఉపయోగించారు. ఇవి 20 వారాల వయసు నాటికి రెండు కిలోల బరువు పెరుగుతాయి. ఏటా 170 వరకు గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు కుక్కలు, పిల్లుల బారి నుండి తప్పించుకోగలవు. అంతేకాక వీటి మాంసం మంచి రుచి ఉంటుంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం వంటివి రైతులకు గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతాయి.
పెరటి కోళ్ల పెంపకంతో అధికాదాయం..
Leave Your Comments