Eruvaka Purnima: నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు అనేది అక్షర సత్యం కాదు. నిజమైన వాస్తవిక సత్యం. రైతు లేనిదే జగత్తు లేదు. ఎందుకంటే రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పెద్ద పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పున్నమి, కృషిక పున్నమి అని కూడా అంటారు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు వెంటనే గుర్తుకు వస్తుంది. ‘ఏరు’అంటే పంటపొలాలు, ‘వాక’ అంటే నాగలి అని అర్థం వస్తుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని నిజమైన అర్థం. అంటే దుక్కి దున్నడం అన్నమాట. అయితే ‘ఏరువాక పౌర్ణమి’ ని అనేక నామాలతో పిలుచుకుంటూ ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి యొక్క వాస్తవిక విశిష్టత ఏమిటి, దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే…

Eruvaka Purnima
వైశాఖ మాసం ముగిసిన వెంటనే జేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటుగా అయినా సరే జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకుండా మానదు. ఇదే నాగలితో సాగే అసలైన వ్యవసాయం అన్నమాట. వ్యవసాయపు పనులకు ఇది అసలైన శుభారంభం. అందుకనే ఈ రోజున ఏరువాక పౌర్ణమి అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని మొదలు పెడతారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం.. కాస్త ముందరగానే ఖాళీ సమయాల్లో దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న సందేహం అందరికీ రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తలక్రిందులవుతాయి. ప్రతి ఒక్కరూ సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు అనేవి ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని ముందుకు సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్ అనేది మన పెద్దలు ఏర్పరిచారు.
Also Read: Focus On Organic Farming: సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టండి- ఉప రాష్ట్రపతి

Eruvaaka Purnima Significance
ఏరువాక పౌర్ణమి పండగ రోజున రైతులందరూ వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు. ఇక పశువుల గురించి చెక్కర్లేదు. ఎందుకంటే ఆరోజు వాటికి శుభ్రంగా స్నానం చేయించి, కొమ్ములకి రంగులు పూస్తారు. వాటి కాళ్ళకి గజ్జలు కట్టి, పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు ఇస్తారు. పొంగలిని నైవేద్యంగా చేసి ఎద్దులకి తినిపిస్తారు. ఇక ఈ ఏరువాక పండగ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో పాటు సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు వెన్నంటే ఉండి, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే మూగ జీవాల పట్ల ఇలా తమ యొక్క ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఏరువాక సాగుతున్నంతసేపు, అలుపు సొలుపూ తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ కూడా వ్యవసాయంలో ఉంది. అందుకనే మన జానపద సాహిత్యంలో ఏరువాక పాటలు, నాగలి పాటలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది.

Eruvaaka Purnima
అయితే జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. భారతదేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం అనేది నైరుతి రుతుపవనాల వల్లనే ఏర్పడుతుంది. అందుకే ఈ ఏరువాక పౌర్ణమి పండగ దేశమంతా జరుపుకోవడం మనం గమనించవచ్చు. ఉద్వృషభ యజ్ఞమనీ సంస్కృతంలో, కారుణిపబ్బ అనీ కన్నడ లో.. ఇలా రకరకాల పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. వేదకాలంలో సైతం కూడా ఈ పండగ యొక్క ప్రస్తావన కనిపించింది. కాకపోతే ఈ రోజుల్లో ఇంద్ర భగవానుడి యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి, ఈ రోజున ఇంద్రుడి పూజ కి కూడా అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. రోజులు, నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు ప్రస్తావన పక్కకి జరిగినా.. వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు కూడా.
Also Read: Paddy Nursery Management: వరి నారుమడి పెంపకం లో మెళుకువలు