Soya Milk Preparation : సోయాగింజలతో పాలు తయారుచేసుకోవచ్చు. మనం నిత్యం వాడే పాల మాదిరిగానే ఈ పాలతోనూ కాఫీ, టీలు చేసుకోవచ్చు. పెరుగు తోడు పెట్టుకోవచ్చు. అంటే పాలకు మంచి ప్రత్యామ్నాయంగా సోయాపాలు వాడుకోవచ్చన్నమాట. సోయాపాల నుంచి తీసిన పన్నీరుకు మంచి గిరాకీ ఉంటుంది. సోయాచిక్కుడు గింజల్లో అత్యధిక మాంసకృత్తులు (40 -45 శాతం)ఉంటాయి. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం లభిస్తుండటంతో పలురకాల సోయా ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతోంది.
సోయాపాలు ఎలా తయారుచేసుకోవాలి ?
Read More : https://eruvaaka.com/health/reasons-why-soya-chunks-are-not-healthy-for-you/
సోయాచిక్కుడు గింజలుంటే ఇంట్లోనే పాలు తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక రాత్రంతా సోయా గింజలను నాన బెట్టాలి. తర్వాత మరగ కాచిన నీటిని వాడుతూ నానబెట్టిన ఈ సోయాగింజలను మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్ర మాన్ని ఒక పాత్రలో పోసి కుక్కర్లో 20 నిమిషాల పాటు ఉడికించాలి. శుభ్రమైన పలుచని బట్టతో లేదా మస్లిన్ గుడ్డతో వడగట్టాలి. వడకట్టగా వచ్చిన దానికి కొద్దిగా ఉప్పు లేదా పంచదార కలిపితే సోయాపాలు తయారవుతాయి. పావు కిలో సోయాచిక్కుడు గింజల నుంచి ఒక లీటరు సోయాపాలు తయారుచేయవచ్చు. పడగట్టగా వచ్చిన పిట్టును కూడా కూరల్లో, కట్లెట్ల తయారీలో వాడుకోవచ్చు.
సోయాచిక్కుడు గింజలను వండే ముందు 12 గంటలు నీటిలో నానబెట్టి,పైన ఉన్న పొట్టు తీసివేయాలి. తర్వాత వీటిని మరిగే నీటిలో 15 నిమిషాలు ఉంచి, ఎండబెట్టి వాడుకుంటే వాటిలో చిరు చేదు, చిక్కుడు వాసన పోతుంది. ఇలా చేయడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా లభ్యమవుతాయి.ఇతర పప్పుదినుసులతో చేసే వంటకాలన్నింటిలో 10-20% సోయాపిండి కలిపి చేసుకోవచ్చు. సోయాతో చేసిన మీల్ మేకర్, చంక్స్ వంటివి తిన్నప్పుడు మాంసాహారం తిన్న సంతృప్తి కలుగుతుంది. మాంసకృత్తులు అత్యధికంగా ఉండటం వల్లనే సోయాను శాకాహారుల మాంసాహారంగా చెబుతారు.